40 ఏళ్ల అనుభవం.. మాట్లాడే తీరు ఇదేనా?

YSRCP Leader Gudivada Amarnath Fires On CM Chandrababu Naidu - Sakshi

చంద్రబాబు చెప్పుమన్నదే డీజీపీ చెప్పాడు : గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శల వర్షం కురిపించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి కర్త, కర్త, క్రియ చంద్రబాబేనని ఆరోపించారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌పై 12.40 నిముషాలకు దాడి జరిగితే ఎయిర్‌పోర్టు మేనేజర్‌‌, సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌లు 4.30 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో కంప్లెయింట్‌ ఇచ్చారని తెలిపారు.

మరి, డీజీపీ మధ్యాహ్నం రెండు గంటలకే దాడి చేసింది వైఎస్‌ జగన్‌ అభిమాని అని ఎలా చెప్పారని మండిపడ్డారు. ప్రెస్‌ మీట్‌లో చంద్రబాబు చెప్పదల్చుకున్న విషయాలన్ని ముందే డీజీపీతో చెప్పించారని విమర్శలు గుప్పించారు. దీన్ని బట్టే టీడీపీ కుట్ర రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. పోలీస్‌ బాస్‌ అలా అసత్యాలు ప్రచారం చేస్తే మిగతా ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్సైలు ఏం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీకి వ్యతిరేకంగా వారు మట్లాడగలరా అని ప్రశ్నించారు.

కనీస మర్యాద లేని మనిషి ముఖ్యమంత్రి
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు మాట్లాడే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కనీస మర్యాద లేని మనిషని అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. ఘటనను ఖండించకుండా, వైఎస్‌ జగన్‌ను పరామర్శించకుండా అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఎయిర్‌పోర్టులో భద్రత కేంద్ర పరిధిలోని అంశమని మాట్లాడుతున్న చంద్రబాబుకు సంస్కారం లేదని అన్నారు. వైఎస్‌ జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు తామే ఆయనకు టీ, స్నాక్స్‌ అందిస్తామని తెలిపారు. అయితే, ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌ నిర్వాకుడు, టీడీపీకి చెందిన హర్షవర్థన్‌ దీనికి అభ్యంతరం తెలిపాడని వివరించారు. వైఎస్‌ జగన్‌కు బయట నుంచే టీ, ఫలహారాలు తీసుకొస్తున్నారనీ, ఇది తమ వ్యాపారానికి నష్టం కలిగిస్తోందని ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ జగన్‌కు టీ అందించే నెపంతో నిందితుడు శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడని అన్నారు.

బాబూ.. మీ ఇంటలిజెన్స్‌ ఏమైంది..
పనీ పాట లేని ఓ ఆర్టిస్ట్‌ ‘ఆపరేషన్‌ గరుడ’ అంటూ చెప్తే దానిని ముఖ్యమంత్రి నిజమేకావచ్చునని అనుమానం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. యాక్టర్‌ శివాజీ వ్యాఖ్యలకు ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు.. ‘ఆపరేషన్‌ గరుడ’పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొన్ని నెలల కిందటే శివాజీ ఈ విషయాలు చెప్పినప్పుడు ఏం చేశారనీ, చంద్రబాబు ఇంటలిజెన్స్‌ పని చేయడం లేదా అని చురకలంటించారు. వైఎస్‌ జగన్‌పై దాడి ఘటనను సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మాత్రమే కోరామని..  పక్క రాష్ట్ర పోలీసులతో విచారణ చేయించాలని ఎక్కడా చెప్పలేదని ఉద్ఘాటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top