ఏపీకి తీవ్ర అన్యాయం.. లోక్‌సభ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ వాకౌట్!

 YSR Congress Party mps stages walk-out from lok sabha - Sakshi

లోక్‌సభలో కేంద్రం తీరును తప్పుబట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ

గడిచిన నాలుగేళ్లలో ఒక్క హామీ అమలు కాలేదు

బెంగళూరు మెట్రోకు నిధులిచ్చారు? ఏపీకి ఎందుకివ్వలేదు?

ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్న

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు లోక్‌సభలో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. విభజన హామీల విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేయడానికి ముందు మిథున్‌రెడ్డి లోక్‌సభలో మాట్లాడారు. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు. విభజన చట్టం హామీలైన పోలవరం నిర్మాణం, కడపలో స్టీల్‌ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, ప్రత్యేక రైల్వేజోన్‌, విశాఖ, విజయవాడలో మెట్రో రైలు తదితర అంశాలను ఇంతవరకు తేల్చలేదని అన్నారు.

బెంగళూరు మెట్రో రైల్‌ కోసం నిధులు ఇచ్చారు కానీ, ఏపీకి ఎందుకు ఇవ్వడం లేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి అన్యాయమే జరుగుతోందన్నారు. ఏపీకి అన్యాయం విషయంలో టీడీపీ-బీజేపీ బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎంపీలపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు.

రాజ్యసభలో పార్టీ మారిన ఇద్దరు ఎంపీలపై చైర్మన్‌ వెంకయ్యనాయుడు అనర్హత వేటు వేశారని గుర్తుచేశారు. కానీ తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎంపీలకు అనర్హత వర్తించదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీ మారిన కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారని, పార్టీ మారిన ఫిరాయింపు నేతలపై అనర్హత వేటు వేయడంతోపాటు విభజన హామీలన్నింటినీ నిర్దిష్ట కాలపరిమితితో అమలు చేయాలని లోక్‌సభలో మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top