రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఆందోళన

YSR Congress Party Leaders Protest In Rajya Sabha - Sakshi

వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు

ప్లకార్డులు, నినాదాలతో నిరసన 

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. శుక్రవారం ఉదయం సభ ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రత్యేక హోదా కోసం నినదించారు. పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు. సభ ప్రారంభమైన వెంటనే రాజ్యసభలో ఎంపీలు చైర్మన్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ప్లకార్డులు, నినాదాలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి వినిపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు ఏపీలో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా ఓవర్‌డ్రాఫ్టు తీసుకునే పరిస్థితి. రాష్ట్రం అప్పు రూ.2.5 లక్షల కోట్లకు చేరుకుంటోంది.

కడప స్టీల్‌ప్లాంటుకు రూ.18 వేల కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. బడ్జెట్‌లో ఏమైనా కేటాయించారా? ఎక్కడి నుంచి తెస్తారు? కేంద్రం కట్టాల్సింది పోయి.. నిధులు కేంద్రం ఇవ్వాల్సింది పోయి.. నిధులు మీరే పెడతామంటున్నారు. కడపలో మీ బినామీ సీఎం రమేశ్‌ ద్వారా భూములు కొనిపించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకే స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. అది కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కాదు.. సీఎం రమేష్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ..’ అని విమర్శించారు. మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ ‘చంద్రబాబు కడప స్టీల్‌ప్లాంటుకు, దుగరాజపట్నం పోర్టుకు, రైల్వేజోన్‌కు ద్రోహం చేశారు..’ అని మండిపడ్డారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top