నిర్బంధాలతో నిజాలను దాచలేరు 

YSR Congress Party leaders Fires on state government - Sakshi

రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేతలు 

అక్రమ మైనింగ్‌పై నిజనిర్ధారణకు వెళ్తున్న నేతలను అడ్డుకోవడంపై మండిపాటు 

మైనింగ్‌లో చంద్రబాబుకు, లోకేశ్‌కు వాటాలున్నాయి 

అందుకే అక్రమార్కులను కాపాడే ప్రయత్నం 

అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం 

సాక్షి, గుంటూరు/దాచేపల్లి(గురజాల)/తాడేపల్లిరూరల్‌/మాచర్ల: నిర్బంధాలతో నిజాలను దాచలేరు అని రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ వందల కోట్లు కొల్లగొడుతూ.. అమాయలకుపై కేసులు పెట్టి అక్రమార్కులు తప్పించుకోవాలని చూడటంపై నిజనిర్ధారణకు వెళుతున్న ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం, హౌస్‌ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే  రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందా అనే అనుమానం వ్యక్తం చేశారు. దోషులను శిక్షించాల్సింది పోయి తమను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.  

ప్రశ్నిస్తే జైలుకు పంపుతారా? 
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నారో, ఆటవిక పరిపాలనలో ఉన్నారో అర్థంకావడంలేదు.  ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేల అక్రమాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపుతారా? ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలను మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవు. టీడీపీ అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్రంలో ప్రకృతి వనరులన్నింటినీ దోచుకుంటున్నారు. వైఎస్సార్‌ సీపీ నేతలు సంఘటనా స్థలానికి వెళితే నిజాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేయిస్తోంది.చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కు అక్రమ మైనింగ్‌లో వాటాలు ఉన్నాయికాబట్టే వైఎస్సార్‌ సీపీ నాయకులను అడ్డుకుంటున్నారు.
– బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత   

ప్రజాప్రతినిధుల నిర్బంధం అప్రజాస్వామికం 
అక్రమ మైనింగ్‌ జరిగిన తీరును పరిశీలించేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుని నిజాలను పూడ్చేయాలని చూడడం అప్రజాస్వామికం. జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలను గృహనిర్భంధం చేయడం, అరెస్టులు చేయడం చూస్తుంటే పోలీసు రాజ్యం నడుస్తున్నట్లు ఉంది. అక్రమాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి, ప్రజలతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకుంటే ఎమ్మెల్యే, ఆయన అనుచరుల బండారం బయటపడుతుందనే భయంతోనే మమ్మల్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే యరపతినేనిని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆమేరకు ఆదేశాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే యరపతినేని సీఎం వద్దకు వెళ్లి తాను కేసులో ఇరుక్కుంటే లోకేశ్‌కు, పార్టీకి ఖర్చు చేసిన లెక్కలన్నీ బయటకు వస్తాయని భయపెట్టారు. ప్రభుత్వానికి పోలీసులకు పది రోజులు సమయం ఇస్తున్నాం. ఈలోపు ఓ తేదీ నిర్ణయించి అక్కడకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించేందుకు వెనుకాడం.   
– అంబటి రాంబాబు, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి 

రాష్ట్ర ప్రభుత్వ తీరు విచిత్రంగా ఉంది 
అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు విచిత్రంగా ఉంది. దోషులను పట్టుకుని అవినీతిని అరికట్టాల్సింది పోయి దానిపై పోరాడుతున్న వారిని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లోని ఏ గ్రామంలో అడిగినా ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచరులు ఖనిజాలను ఏ స్థాయిలో దోచుకున్నారో చెబుతారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 21లోపు విచారణ జరపాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డ పెద్దల పేర్లు బయటపెట్టకుండా దోషులను తప్పించాలని చూస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీ ఆ ప్రాంతానికి బయల్దేరితే సీఎం సహా టీడీపీ నేతలు గడగడలాడుతున్నారు. గతంలో ఓబులాపురం మైనింగ్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి  అప్పటి టీడీపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ వేశారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్షాన్ని అక్కడకు వెళ్లనీయకపోవడం చూస్తుంటే భారీగా అక్రమ క్వారీయింగ్‌ జరిగిందని తేటతెల్ల మవుతోంది.    
 – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసన మండలి ప్రతిపక్ష నేత  

అక్రమమైనింగ్‌లో బాబు, లోకేశ్‌లకు వాటాలు 
ప్రజాస్వామ్య ముసుగులో అక్రమ నిర్భంధం జరుగుతోంది. గురజాల నియోజకవర్గంలో రాజ్యాంగం, చట్టాలు అమలు జరగడం లేదు. కోనంకి, కేసానుపల్లి, నడికుడి గ్రామాల్లో గత నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. టీడీపీ కార్యకర్తలను ఈ కేసులో ఇరికిస్తున్నారు. వాస్తవాలు దాచిపెట్టి కోర్టు కళ్లకు గంతలు కట్టవద్దు. అక్రమ మైనింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు వాటాలు ఉండబట్టే ఈ వ్యవహరంపై స్పందించడం లేదు. ఎమ్మెల్యే యరపతినేని వారికి వాటాలు పంచుతున్నారు. అక్రమమైనింగ్‌పై హైకోర్టును ఆశ్రయించిన బీసీ నేత కుందుర్తి గురవాచారిని ఎమ్మెల్యే బెదిరించి పోలీసులతో తీవ్రంగా కొట్టించి భయభ్రాంతులకు గురి చేశారు. మైనింగ్‌ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి.  
– జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు 

లోకేశ్‌ బినామీ యరపతినేని  
చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ బినామీ అయిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రూ. వందల కోట్ల  అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. దానిపై నిజనిర్ధారణకు వైఎస్సార్‌సీపీ నేతలు దాచేపల్లి వెళుతుంటే పోలీసులు సాయంతో ప్రభుత్వం అడ్డగించటం దారుణం. అధికార పార్టీ నాయకులు, మైనింగ్‌ మాఫియా కారకులైన వారు కొంతమందిని రెచ్చగొట్టి భారీ ప్రదర్శన చేస్తే.. దానికి అనుమతించిన పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకోవడం, హౌస్‌ అరెస్టులు చేయటం హేయమైన చర్య. నిర్బంధాలతో వాస్తవాలను దాచలేరు. రాబోయే రోజుల్లో మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం. అక్రమ మైనింగ్‌ను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రజల మద్దతుతో ముందుకెళ్తాం. వందల మంది పోలీసులతో జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిర్భందించటం మానవహక్కులను హరించటమే.      
– ఎమ్మెల్యే పీఆర్కే, వైఎస్సార్‌సీపీ విప్‌

సీబీఐ విచారణ జరిపించాలి 
జిల్లాలో ఏం జరిగినా నరసరావుపేటలో ఉంటున్న నన్ను గృహనిర్బంధం చేస్తున్నారు. ఈనెలలో ఇది రెండోసారి. నరసరావుపేట మొత్తం ప్రశాంతంగా ఉంటే, కాసు ఇంటి వద్ద, నా ఇంటి వద్ద మాత్రం 144 సెక్షన్‌ ఎందుకు విధిస్తున్నారో అర్థం కావడం లేదు. అధికార పార్టీ నేతలు మాత్రం నడిరోడ్లపై ఆందోళనలు, ధర్నాలు నిర్వహించినా పట్టించుకోవడం లేదు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచేస్తుంటే నిలదీయడానికి వెళుతున్నవారిని నిర్బంధిస్తున్నారు. పిడుగురాళ్లలో టీడీపీ నేతలు ర్యాలీ చేస్తే లా అండర్‌ ఆర్డర్‌ గుర్తుకు రాలేదా?. ఎమ్మెల్యే యరపతినేని అక్రమ క్వారీయింగ్‌పై సీబీఐ విచారణ జరిగితేనే నిజాలు బయటపడతాయి. ఇప్పటికైనా అమాయకులై కేసులు ఎత్తివేసి నిజమైన దోషులను శిక్షించాలి. అప్పటి వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదు.  
    –డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే  

కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు 
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నేత గురవాచారి హైకోర్టులో పిల్‌ వేస్తే దీనిపై చర్యలు తీసుకోమని ఇచ్చిన కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దోచుకున్న అక్రమ మైనింగ్‌కు పెనాల్టీతో సుమారుగా రూ. 2 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సి ఉంది. హైకోర్టు ఆగ్రహంతో అధికారులు చర్యలు తీసుకుంటారని 15 రోజులు వేచి చూశాం. యరపతినేని, ఆయన అనుచరులను కాపాడుతూ అమాయకులకు నోటీసులు ఇచ్చి కేసుల్లో ఇరికించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్వారీల్లో పనిచేసుకునే వారికి క్వారీలు అప్పగించి వారికి జీవన భృతి కల్పించాలి.  
– కాసు మహేశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top