చంద్రగిరికి ‘చంద్రం’ ఏం చేశాడు : వైఎస్‌ జగన్‌

YS Jagan Slams Chandrababu in public meeting held at Ramachandrapuram - Sakshi

సాక్షి, రామచంద్రాపురం (చిత్తూరు) : సొంతగడ్డ చంద్రగిరి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ఏం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టింది ఈ నియోజకవర్గంలోనే. ఆశ్చర్యం ఏంటో తెలుసా. 1978లో ఇదే చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేశారు. 2 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చలవతో మంత్రి కూడా అయ్యాడు.

మంత్రి అయి ఐదేళ్లు పరిపాలన చేశాడు. మళ్లీ 1983లో ఎన్నికలు జరిగాయి. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇదే చంద్రగిరి నుంచి బరిలోకి దిగితే 17,500 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. ఇదే చంద్రగిరి నియోజకవర్గాన్ని చూడండి. సొంతవూరికి ఏదైనా చేయాలని కాస్తోకూస్తో గొప్పగా సెటిల్‌ అయిన ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. విదేశాల్లో ఉన్న ఎన్నారైలు కూడా సొంత గడ్డకు ఏదైనా చేయాలని తపన పడతారు. డబ్బు పంపించి అభివృద్ధికి పాటుపడతారు.

అలాంటిది 13 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు సొంతవూరు ఉండాల్సిన స్థితి ఇదా?. చిన్నవయసులో చంద్రబాబు నారావారిపల్లె పక్కన ఉన్న శేషాపురం స్కూల్‌లో చదువుకున్నారు. ఇవాళ్టికి కూడా ఈ స్కూల్‌కు పిల్లలు వెళ్తున్నారు. గట్టిగా తుమ్మితే పడిపోయే దుస్థితిలో పాఠశాల ఉంది. ముఖ్యమంత్రి చదువుకున్న స్కూల్‌ పరిస్థితి ఇలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా స్కూళ్ల పరిస్థితి ఏంటి?

వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు చంద్రగిరిలో వంద పడకల ఆసుపత్రి నిర్మించడం కోసం జీవోను జారీ చేశారు. ఆ తర్వాత దురదృష్టం వల్ల మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికీ జీవో ఉంది. కానీ,  చంద్రబాబు దాన్ని పట్టించుకోరు. చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 138 పంచాయితీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో డెబ్భై శాతం తాగునీరు కొరత ఉంది.

దీన్నిబట్టి చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో తెలుస్తుంది. ప్రతి ఏటా చంద్రగిరిలోని కొన్ని మండలాల్లో ఏనుగులు బీభత్సం చేస్తూ ఉంటాయి. కనీసం ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు దమ్మిడి సాయం చేశాడా?’ అని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top