‘ధర్మసాగరం సెజ్‌ ఎంతమందికి ఉద్యోగాలిచ్చింది’

YS Jagan Mohan Reddy Public Meeting In Narsipatnam - Sakshi

సాక్షి, నర్సీపట్నం : ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అయ్యన్నపాత్రుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు  నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచారని అన్నారు. ధర్మసాగరం ప్రాంతంలో సెజ్‌ (ప్రత్యేక ఆర్థిక మండలి) ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు, ఉద్యోగాలు కల్పిస్తానన్న బాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. నర్సీపట్నంను అభివృద్ధి చేసి మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దుతానన్న హామీని టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని చెప్పారు.

నీరుచెట్టు కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలోని చెరువుల్లో పూడిక తీసి మట్టిని అమ్ముకుంటున్నారని విమర్శించారు. చెరువులను తాటి చెట్టు లోతు తవ్వేసి ట్రాక్టర్‌ మట్టికి రూ.500 చొప్పున వసూలు చేస్తూ టీడీపీ నేతలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నర్సీపట్నం ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి 20 ఏళ్లకిందట వరాహ నదిపై దుక్కాడ వద్ద మొదలైన ప్రాజెక్టు ద్వారా నేటికీ నీరు అందుబాటులోకి రాలేదని అన్నారు. తుప్పుపట్టిన పైపులతో బురద నీరు వస్తోందనీ, నర్సీపట్నంలోని 65 వేల జనాభా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

నర్సీపట్నంలో డాక్టర్లు, నర్సులు లేని ఆస్పత్రులు దర్శనమిస్తున్నాయని వైఎస్‌ జగన్‌ అన్నారు. 150 పడకలు గల ఏరియా ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, నర్సులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సర్కార్‌ దవాఖానాలో ఉండే అంబులెన్స్‌కు రోగులనుంచే డీజిల్‌ డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన 82 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం లాక్కొందని ధ్వజమెత్తారు. ఆ స్థలంలో ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని చెప్పిన బాబు... వాటిల్లో కూడా కమీషన్‌ నొక్కాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీ పాలనలో పన్నుల బాదుడు ఎక్కువైందని ఆయన పేర్కొన్నారు. ఇంటి పన్ను కింద 800 కట్టాల్సి వస్తోందనీ, రూ.200 వచ్చే నీటి పన్ను వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top