బాబూ.. భరోసా ఇదేనా!? 

YS Jagan Fires On Chandrababu Frauds - Sakshi

సీఎం చంద్రబాబు మోసాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిప్పులు   

చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాలకే దిక్కులేదు.. అలాంటి వ్యక్తి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తాడా?

ప్రజల భవిష్యత్తు ఆలోచించే వాడే అయితే హోదాను తాకట్టు పెట్టేవాడా? 

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేవాడా? కమీషన్ల కోసం పోలవరాన్ని లాక్కునేవాడా?

మట్టి, ఇసుక, బొగ్గు, రాజధాని భూములు, దళితుల భూములు,గుడి భూములు దోచుకునేవాడా? ఆరోగ్యశ్రీని నీరుగార్చేవాడా?  

రాష్ట్రంలో స్కూళ్లను, ఆసుపత్రులను తన మనుషులకు అప్పగించేవాడా?  

ప్రజల బాగు కోరేవాడే అయితే రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేవాడా?  

ఓర్వకల్లు, రాయదుర్గం, రాయచోటిలో వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం

ఎన్నికల్లో నెగ్గడం కోసం ఏమైనా చేయడానికి వెనుకాడని మనస్తత్వం చంద్రబాబుది. ఎన్నికల్లో గెలవడానికి ప్రజల ఓట్లను తొలగిస్తాడు, దొంగ ఓట్లను చేర్పిస్తాడు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తాడు. చివరకు మన ఆడపిల్లల ఫోన్‌ నంబర్లను సైతం జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలకు ఇస్తూ సంస్కారం లేని పని చేస్తాడు.
– ఓర్వకల్లు సభలో

వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌సీపీకి అండగా, తోడుగా ఉంటున్నాడని మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపించడానికి సైతం చంద్రబాబు వెనుకాడలేదు. మన పార్టీని దెబ్బతీయాలని చూశాడు. హత్య చేయించింది చంద్రబాబు, చిన్నాన్నను పోగొట్టుకున్నది మేము. హత్య చేసేది వాళ్లే, దానిపై దర్యాప్తు చేసేదీ వాళ్ల పోలీసులే. దొంగ వార్తలు రాసేది, ప్రసారం చేసేది వాళ్ల పత్రికలే, వాళ్ల టీవీ చానళ్లే.
– రాయచోటి సభలో

3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు.. అన్ని వర్గాల ప్రజల కష్టాలు, బాధలు చూశాను. వారి కన్నీటి గాథలు విన్నాను. సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న మీకు నేనున్నాను అని మాట ఇస్తున్నా.
– రాయదుర్గం సభలో

సాక్షి ప్రతినిధి, కర్నూలు/అనంతపురం/కడప:  ‘‘ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన తొలి సంతకాలకే దిక్కు లేకుండా పోయింది. అలాంటి వ్యక్తి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తాడా? చంద్రబాబు ప్రజల భవిష్యత్తు గురించి నిజంగా ఆలోచన చేసేవాడే అయితే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేవాడా? ప్యాకేజీకి ఒప్పుకునేవాడా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేవాడా? కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును లాక్కునేవాడా? మట్టి, ఇసుక, బొగ్గు, రాజధాని భూములు, దళితుల భూములు, గుడి భూములు దోచుకునేవాడా? ప్రజల బాగోగుల గురించి చంద్రబాబు ఆలోచించేవాడే అయితే ఆరోగ్యశ్రీని నీరుగార్చేవాడా? రాష్ట్రంలో స్కూళ్లను, ఆసుపత్రులను తన మనుషులకు అప్పగించేవాడా? చంద్రబాబు ప్రజల బాగు కోరుకునేవాడే అయితే రాష్ట్రంలోని ప్రజలందరి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేవాడా? చివరకు మన ఆడపిల్లల ఫోన్‌ నంబర్లను సైతం జన్మభూమి కమిటీల సభ్యులకు ఇచ్చేవాడా? రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని చివరకు ఉత్తచేయి చూపించాడు.

ఇదేనా రైతులకు, మహిళలకు చంద్రబాబు ఇచ్చే భరోసా? రూ.2,000 భృతి ఇవ్వకుండా ఎగ్గొట్టడమేనా నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చే భరోసా?’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, అనంతపురం జిల్లా రాయదుర్గం, వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్‌ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఎన్నికల్లో నెగ్గడానికి సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న అనైతిక విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ మేలు జరిగేలా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. మరో నాలుగైదు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పరిచయం చేశారు. వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల బాబు పాలనతో విసిగిపోయి సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. మూడు సభల్లో జగన్‌  ఏం మాట్లాడారంటే..  

‘‘మీరందరూ బాగుండాలని, మీ బాగోగుల్లో నేను భాగం కావాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, మీ సంతోషంలో నేను పాలుపంచుకోవాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. పాదయాత్రలో మీ అందరి గుండె చప్పుడు విన్నాను. ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికీ మంచి జరిగే విధంగా మరో నాలుగైదు రోజుల్లో మన పార్టీ మేనిఫెస్టో(ఎన్నికల ప్రణాళిక) విడుదల చేస్తాం. ప్రతి సగటు కుటుంబం, ప్రతి సగటు మనిషి ఏం కోరుకుంటున్నారు? అనే అంశంపై ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర దాకా సమాధానం కోసం వెతికాను. మనిషికి మనసు అనేది ఉంటే తోటి వారికి సహాయం చేయాలనుకుంటాడు. ఒక ప్రభుత్వానికి మనసు ఉంటే ఇంటింటికీ, మనిషి మనిషీకి మేలు చేయాలని ఆరాట పడుతుంది. అలాంటి ప్రభుత్వం దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనతోనే వెళ్లిపోయింది. (పోలేదు.. మళ్లీ వస్తుందని ప్రజలు కేకలు వేశారు) ప్రతి కుటుంబాన్ని, ప్రతి మనిషిని ఎలా బాగుచేయాలి అని ప్రభుత్వం ఆలోచించిన దాఖలాలు ఈ ఐదేళ్లలో ఎక్కడా కనిపించలేదు.  

రైతన్నలకు ఇదే నా భరోసా..  
 గ్రామాల్లో ఒక రైతు ఏం కోరుకుంటాడు? వ్యవసాయం బాగా జరగాలని, పంటలకు గిట్టుబాటు ధర దక్కాలని ఆశిస్తాడు. తనకు అయ్యే ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం ఆరాటపడాలని భావిస్తాడు. గిట్టుబాటు ధరలకు భరోసా ఇచ్చే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తాడు. ప్రతి రైతు కుటుంబం ఇదే కోరుకుంటుంది. కానీ, ఇప్పటి ప్రభుత్వం నుంచి ఈ రెండూ అందక రైతన్నలు పడుతున్న బాధలను చూశా. ఆ బాధలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ప్రతి రైతన్నకూ చెబుతున్నా.. మీకు నేనున్నాను.  

మహిళల సంతోషంతోనే రాష్ట్రం బాగుంటుంది  
మన రాష్ట్రంలో జనాభాలో 50 శాతం మంది అక్కచెల్లెమ్మలు, మహిళలు ఉన్నారు. పొదుపు సంఘాల్లోని మహిళల కష్టాలను పాదయాత్రలో చూశా. అప్పులు మాఫీ అవుతాయని ఎదురు చూశారు. కానీ, మాఫీ కాలేదు. అప్పులపై వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయి. బ్యాంకుల్లో సున్నా వడ్డీలకు రుణాలు దక్కే పరిస్థితి ఎప్పుడో పోయింది. మీ బాధలు నేను విన్నాను, నేనున్నాను, మీకు తోడుగా ఉంటానని భరోసా ఇస్తున్నా.  

ఎక్కడపడితే అక్కడ మద్యం బెల్టుషాపులు   
బయటకు వెళ్లే మహిళలకు భద్రత ఉంటేనే ఏ కుటుంబమైనా సంతోషంగా ఉంటుంది.  గ్రామాల్లో మద్యం అమ్మే దుకాణాలు ఒకటి రెండు కాదు, ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. మద్యం బెల్టు షాపులను రద్దు చేస్తామన్న పాలకుల మాట మాటగానే మిగిలిపోయింది. ప్రతి గ్రామంలో మూడు నాలుగు బెల్టు షాపులు నడుస్తున్నాయి. సాయంత్రం 7 గంటలు దాటితే.. చీకటి పడితే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. అక్కలకు, చెల్లెమ్మలకు ఓ మాట చెబుతున్నా.. మీ కష్టాలను చూశాను, మీకు నేనున్నాను. 

ఫీజులు కట్టలేక విద్యార్థుల ఆత్మహత్యలు  
పెద్ద చదువులు చదివే పిల్లల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశా. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి, ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అమ్మడానికి ఆస్తులు లేక, అప్పులు పుట్టక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను పాదయాత్రలో చూశా. తల్లిదండ్రులకు ఒక మాట చెబుతున్నా.. మీకు నేనున్నా. 

నిరుద్యోగ యువత ఆవేదన చూశా..  
పాదయాత్రలో ఎన్నో విషయాలను పరిశీలించా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కష్టాలను చూశా. నోటిఫికేషన్ల కోసం ఆశగా నిరీక్షిస్తున్న వారిని చూశా. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తానని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. లేకపోతే ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.2,000 చొప్పున భృతి ఇస్తానని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని అడిగిన యువతను చూశా. చదువులు పూర్తి చేసుకుని, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికీ చెబుతున్నా..  మీకు నేనున్నా.  

పేద రోగుల ఆక్రందనలు విన్నా..  
ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమైన పరిస్థితిని పాదయాత్రలో చూశా. ‘108’కు ఫోన్‌ చేస్తే కుయ్‌ కుయ్‌ కుయ్‌ అంటూ రావాల్సిన అంబులెన్స్‌ సకాలంలో రాక మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం చూశా. ఆరోగ్యశ్రీ పథకం వర్తించక, వైద్యం కోసం అప్పుల పాలై, చివరకు మంచాన పడి, చావు కోసం ఎదురు చూస్తున్న పేద రోగుల ఆక్రందనలను విన్నా. ప్రతి పేదవాడికీ చెబుతున్నా..   మీకు నేనున్నా అని భరోసా ఇస్తున్నా.  

బందిపోటులా, గజదొంగలా రాష్ట్రాన్ని దోచేశాడు  
ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ప్రజల ఓట్లను తొలగిస్తాడు, దొంగ ఓట్లను చేర్పిస్తాడు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తాడు. చివరకు మన ఆడపిల్లల ఫోన్‌ నంబర్లను సైతం జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలకు ఇస్తూ సంస్కారం లేని పని చేస్తాడు. చంద్రబాబు సాగిస్తున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కావు. బలమైన ప్రత్యర్థులను నీరుగార్చాలని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నాడు. ఏకంగా హత్యా రాజకీయాలకు కూడా తెరతీస్తున్నాడు. ఒక బందిపోటులా, ఒక గజదొంగలా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశాడు.  

అన్న మన బతుకులు బాగు చేస్తాడని చెప్పండి   
రాబోయే రోజుల్లో చంద్రబాబు అన్యాయాలు మరింత పెరుగుతాయి. గ్రామాలకు మూటల కొద్దీ డబ్బులు పంపిస్తాడు. ఒక్కో ఓటుకు రూ.3,000 చొప్పున ఇస్తాడు. అందుకే ప్రతి ఊరికి వెళ్లండి. ప్రతి ఒక్కరికీ చెప్పండి.  
- చంద్రబాబు ఇచ్చే డబ్బులకు ఆశ పడకండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన పిల్లలను బడికి పంపిస్తే, ప్రతి కుటుంబానికి ఏటా రూ.15,000 ఇస్తాడని చెప్పండి.  
విద్యార్థులు ఎక్కడ, ఏ కోర్సు చదివినా పూర్తి ఫీజు చెల్లిస్తాడని ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పండి. ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీఏ.. ఏ కోర్సు అయినా సరే, ఎంత ఫీజు అయినా సరే అన్న చదివిస్తాడని చెప్పండి. అన్నను సీఎం చేసుకుందాం, పెట్టుబడి సాయం కింద నాలుగేళ్లలో రూ.50,000 ఇస్తాడని రైతన్నలకు చెప్పండి. ప్రతి ఏటా మేలో రూ.12,500 రైతుల చేతిలో పెడతాడని చెప్పండి. ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర కల్పిస్తాడని చెప్పండి.  
‘వైఎస్సార్‌ చేయూత’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడని చెప్పండి. ఈ కార్యక్రమం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చేతిలో రూ.75,000 పెడతాడని చెప్పండి.  
అన్నను సీఎంను చేసుకుంటే, ఎన్నికల నాటికి ఉన్న అప్పును నాలుగు విడతల్లో నేరుగా మీ చేతికే ఇస్తాడని పొదుపు సంఘాల మహిళలకు చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలు అందుతాయని, మీరు లక్షాధికారులు అవుతారని చెప్పండి.  
అవ్వాతాతల దగ్గరకు వెళ్లి ఒక మాట అడగండి. మీకు మూడు నెలల క్రితం దాకా ఎంత పెన్షన్‌ వచ్చేదని అడగండి. తమకు పెన్షన్‌ రావడం లేదని కొందరు చెబుతారు. ఇంకొందరు రూ.2,000 వస్తున్నాయని చెబుతారు. మరి జగనన్న లేకపోతే ఆ పెన్షన్‌ వచ్చేదా? అని అడగండి. జగన్‌ అన్నకు భయపడే చంద్రబాబు ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందే పెన్షన్‌ పెంచాడని చెప్పండి.  
జగనన్న ముఖ్యమంత్రి అయితే పెన్షన్‌ రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి.  

హత్య చేయించింది చంద్రబాబు.. చిన్నాన్నను పోగొట్టుకున్నది మేము  
ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు రోజుకొక సినిమా చూపిస్తాడు, రోజుకొక డ్రామా చూపిస్తాడు. చివరకు మనుషులను హత్య చేయడానికి కూడా వెనుకాడడు. వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా, తోడుగా ఉంటున్నాడని మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపించడానికి సైతం చంద్రబాబు వెనుకాడలేదు. మన పార్టీని దెబ్బతీయాలని చూశాడు. హత్య చేయించింది చంద్రబాబు, చిన్నాన్నను పోగొట్టుకున్నది మేము. హత్య చేసేది వాళ్లే, దానిపై దర్యాప్తు చేసేది వాళ్ల పోలీసులే. దొంగ వార్తలు రాసేది, ప్రసారం చేసేది వాళ్ల పత్రికలే, వాళ్ల టీవీ చానళ్లే. రాయచోటి నియోజకవర్గానికి ఒక మాట ఇచ్చా, మైనారిటీ సోదరులకు ఇక మాట ఇచ్చా. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా ఇక్కడి నుంచి మైనారిటీ సోదరుడిని ఎమ్మెల్సీగా చేస్తామని హామీ ఇస్తున్నా. రాయచోటిలో కాలేజీ గ్రౌండ్‌ సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తాం. ఈ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రకటించిన నవరత్నాలను ప్రతి ఊరు, ఇల్లు, గడప గడపకూ తీసుకెళ్లాలి. ఆ దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలి’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.   

సంతకాలు చేశాడు.. విస్మరించాడు
ఐదేళ్లపాటు చంద్రబాబు నాయుడి పాలన చూశాం, ఆయన చేసిన మోసాలు, అన్యాయాలు చూశాం. ఐదేళ్లు అన్యాయాలు, మోసాలు చేసి, ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తానని చెబుతున్నాడు. 2014 ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చాడు. ఎన్నికల్లో నెగ్గాక ప్రమాణ స్వీకారం చేస్తూ మొదటి సంతకం అంటూ కొన్ని సంతకాలు చేశాడు. ఆ సంతకాలు అమలయ్యాయో లేదో మీరే చెప్పండి. రైతుల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. సంతకం చేశాడు. డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తానన్నాడు, సంతకం చేశాడు. గ్రామాల్లో రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తానన్నాడు, సంతకం చేశాడు. మద్యం బెల్టు షాపులు రద్దు చేస్తానన్నాడు, సంతకం చేశాడు. ఐదేళ్ల చంద్రబాబు పాలన తర్వాత అడుగుతున్నా వీటిలో ఏ ఒక్కటైనా అమలు చేశాడా? (లేదు లేదు అంటూ జనం కేకలు) చంద్రబాబు సంతకాలు అమలు కాలేదని ప్రజలు చెబుతున్నారు. అలాంటి వ్యక్తి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తాడా?  
చంద్రబాబు ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవాడే అయితే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేవాడా? ప్యాకేజీకి ఒప్పుకునేవాడా?  
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, విపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చి కొనేవాడా?  
పోలవరం ప్రాజెక్టు కడతామని కేంద్రం ప్రకటిస్తే, కమీషన్ల కోసం కక్కుర్తి పడి తానే కడతానని లాక్కునేవాడా?  
చంద్రబాబు ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచన చేసేవాడే అయితే ఇసుక దగ్గర నుంచి మట్టి దాకా, మట్టి దగ్గర నుంచి బొగ్గు దాకా, బొగ్గు దగ్గర నుంచి కరెంటు కొనుగోళ్ల దాకా, కరెంటు కొనుగోళ్ల నుంచి రాజధాని భూముల దాకా, రాజధాని భూముల దగ్గర నుంచి విశాఖపట్నం భూముల దాకా, చివరకు దళితుల భూములు, గుడి భూములు సైతం వదిలిపెట్టకుండా దోచుకునేవాడా?  
ప్రజల భవిష్యత్తు గురించి చంద్రబాబు ఆలోచించే వ్యక్తే అయితే ‘108’ సర్వీసుల పరిస్థితి ఇవాళ ఇంత దారుణంగా ఉండేదా?  
ప్రజల బాగోగుల గురించి చంద్రబాబు ఆలోచించేవాడే అయితే ఆరోగ్యశ్రీని నీరుగార్చేవాడా?  
ఆస్తులు అమ్ముకుంటే తప్ప పిల్లలను చదివించలేని పరిస్థితి ఇవాళ నెలకొంది. ప్రజల కోసం చంద్రబాబు ఆలోచన చేసేవాడే అయితే ఇలాంటి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చేవాడా? రాష్ట్రంలో స్కూళ్లను, ఆసుపత్రులను తన మనుషులకు అప్పగించేవాడా? ప్రభుత్వ బడులను మూసేసి, నారాయణకు మేలు చేసేవాడా?
చంద్రబాబు ప్రజల బాగు కోరుకునేవాడే అయితే రాష్ట్రంలోని ప్రజలందరి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేవాడా? చివరకు మన ఆడపిల్లల ఫోన్‌ నంబర్లను కూడా జన్మభూమి కమిటీల సభ్యులకు ఇచ్చేవాడా?
2014 నాటికి రైతుల రుణాలు అక్షరాలా రూ.87,600 కోట్లు ఉండేవి. 2018 సెప్టెంబర్‌ 18 నాటికి అవి వడ్డీలతో కలుపుకుని రూ.1.30 లక్షల కోట్లకు చేరాయి. రైతులకు భరోసా ఇవ్వడం అంటే వారి రుణాలను మాఫీ చేయకపోవడమేనా?
చంద్రబాబు సీఎం అయ్యేనాటికి డ్వాక్రా మహిళల రుణాలు రూ.14,205 కోట్లు ఉండేవి. 2018 సెప్టెంబర్‌ నాటికి అవి వడ్డీలతో కలిపి రూ.25,500 కోట్లకు చేరాయి. మహిళలకు చంద్రబాబు ఇస్తానంటున్న భరోసా ఇదేనా?  
ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. ఇవ్వలేకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఈ ఐదేళ్లలో ప్రతి ఇంటికీ అక్షరాలా రూ.1.20 లక్షలు బాకీ పడ్డాడు. భృతి ఇవ్వకుండా ఎగ్గొట్టడమేనా నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చే భరోసా?  

చంద్రబాబు ఐదేళ్లలో అన్యాయమైన పాలన చేశాడు. ఇప్పుడు జనంలోకి వెళ్లి ఓట్లు అడిగితే వేయరని ఆయనకు తెలుసు. కాబట్టి ఎలగైనా గెలవాలన్న ఆరాటంతో బాబు చేస్తున్న అన్యాయాలను మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల్లో నెగ్గేందుకు ఏమైనా చేయడానికి వెనుకాడని చంద్రబాబు మనస్తత్వాన్ని చూస్తున్నాం.

అన్యాయాలు తానే చేసి ఎదుటివారిపై నెపం నెట్టేయడంలో ఘనుడు చంద్రబాబు. దొంగే దొంగా దొంగా అని మాట్లాడుతాడు. ఎన్నికల దాకా ఇలాంటి కట్టుకథలు ఇంకా చాలా కనిపిస్తాయి. అన్యాయమైన సినిమాలు చాలాచాలా చూపిస్తారు. మనం పోరాటం చేస్తున్నది కేవలం చంద్రబాబుతోనే కాదు, ఆయనతోపాటు ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, టీవీ5తో పోరాటం చేస్తున్నాం. అమ్ముడుపోయిన ఇంకొన్ని టీవీ చానళ్లతో పోరాటం చేస్తున్నాం. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ప్రచారం చేయడమే ఆ చానళ్ల పని.

ఎలా మోసం చేయాలన్న దానిపై బాబు పీహెచ్‌డీ  
ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడానికి మేనిఫెస్టో అనే పుస్తకాన్ని చంద్రబాబు విడుదల చేశాడు. అందులో 650 హామీలు ఇచ్చాడు. ఈ మేనిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించాడు. ఒక్కో కులాన్ని ఎలా మోసం చేయాలన్న దానిపై పీహెచ్‌డీ చేశాడు. భరోసా కల్పించడం అంటే హామీలు అమలు చేయకుండా ప్రజలను దగా చేయడమేనా? 3,648 కిలోమీటర్లు నడిచాను. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజల కష్టాలు, బాధలు చూశాను. మీ ఇబ్బందులను కళ్లారా చూశాను, మీ కన్నీటి గాథలు విన్నాను. సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న మీకు నేనున్నాను అని మాట ఇస్తున్నా. ఎన్నికల్లో నెగ్గడానికి చంద్రబాబు పంచే డబ్బులకు మోసపోవద్దని గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన జీవితాలను మారుస్తాడని తెలియజేయండి. ఇవాళ ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. విశ్వసనీయత, విలువలు ఒకవైపు ఉండగా, మరోవైపు వంచన ఉందన్న సంగతి ఎవరూ మర్చిపోవద్దు.  

ప్రతి అవ్వాతాతకు చెబుతున్నా... 
చంద్రబాబు హయంలో పెన్షన్‌ చివరి మూడు నెలల్లో మాత్రమే పెరిగింది. 60 నెలల పాలనలో.. 57 నెలల్లో పెన్షన్‌ పెంచాలి, అవ్వాతాతలకు తోడుగా ఉండాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాలేదు. కానీ, ఎన్నికలు వచ్చేసరికి మూడు నెలల ముందు మాత్రమే పెన్షన్‌ పెంచారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఈ ఐదేళ్లలో పడిన కష్టాలను చూశా. పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయని పరిస్థితి చూశా. పెన్షన్‌ కావాలంటే జన్మభూమి కమిటీలు అడిగే ప్రశ్నలేమిటో నేను విన్నా. పెన్షన్‌ కావాలని కోరితే మీరు ఏ పార్టీ వారు అని ప్రశ్నించిన పరిస్థితి చూశా. పెన్షన్‌ కావాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితిని చూశా. ప్రతి అవ్వకు, ప్రతి తాతకూ చెబుతున్నా.. మీ కష్టాలను నేను విన్నా, మీ బాధలు విన్నా, మీ అందరికీ ఇవాళ భరోసా ఇస్తున్నా, మీకు నేనున్నాను. దివంగత మహానేత, మన ప్రియతమ నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి హృదయంలో బతికే ఉన్నాడు, ప్రతి గుండె చప్పుడులోనూ జీవించే ఉన్నాడు. అంతకంటే గొప్ప పరిపాలన అందించేందుకు మీకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నా.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top