
ప్రైవేటు టీచర్స్, లెక్చరర్లతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
సాక్షి, గన్నవరం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని దావాజీగూడెం వద్ద బుధవారం ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు కలుసుకున్నారు. తమ సమస్యలను జననేతకు వివరించారు. ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల ఇబ్బందులపై వైఎస్ జగన్ మాట్లాడారు.
ప్రైవేటు టీచర్లకు ఒక ప్రత్యేక పద్దతి ద్వారా వేతనాలు ఇవ్వాలని అన్నారు. కళాశాలల యాజమాన్యాలు మానవత్వంతో కనీసం వారానికి రెండు రోజులు సెలవులు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేరకు చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు అందరికీ ఒకే రకమైన నియమ, నిబంధనలు ఉండేలా చూస్తామని చెప్పారు. కళాశాలల యాజమాన్యాలు ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకునే విధంగా చట్ట సవరణ చేస్తామని అన్నారు.
ప్రజాసంకల్పయాత్రలో 145వ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఉంగటూరు మండలం వెన్నూతల, పుట్టగుంట క్రాస్ రోడ్డు, వెల్దిపాడు క్రాస్ రోడ్డు, నాగవరప్పాడు, ఎలకపాడు క్రాస్ రోడ్డు, ఉంగుటూరు, ఆముదాల పల్లి క్రాస్ రోడ్డు, లంకపల్లి, వెంకట రామపురం మీదుగా ఈరోజు పాదయాత్ర సాగుతోంది.