
లక్నో : కాంగ్రెస్ అధిష్టానం ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి బీజేపీ పార్టీ ఇప్పటికే పలు విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రియాంక పొలిటికల్ ఎంట్రీని ఉద్దేశిస్తూ.. రెండు సున్నాలు కలిస్తే వచ్చేది సున్నానే.. కానీ 100 కాదంటూ ఎద్దేవా చేశారు.
న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐతో యోగి మాట్లాడుతూ.. ‘ప్రియాంక తొలిసారి రాజకీయ రంగం ప్రవేశం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ బిల్డప్ ఇస్తుంది. కానీ 2014, 2017 ఎన్నికల్లో కూడా ప్రియాంక కాంగ్రెస్ పార్టీ తరఫున యూపీలో ప్రచారం చేశారు. ఇప్పుడు మరోసారి ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రియాంక ప్రచారం వల్ల గతంలో కాంగ్రెస్ పార్టీ లాభపడింది లేదు.. ఇప్పుడు కూడా లాభపడదు. మరీ ముఖ్యంగా ఆమె రాక వల్ల బీజేపీకి ఎటువంటి నష్టం ఉండదు అన్నారు.
అంతేకాక రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్ష విమర్శలు చేశారు యోగి. ‘ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఒకటే సున్నా ఉండేది. ఇప్పుడు మరో సున్న కలిసింది. రెండు సున్నాలు కలిస్తే సున్నానే అవుతుంది కానీ 100 కాదం’టూ యోగి ఎద్దేవా చేశారు.