
సాక్షి, వికారాబాద్: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు వచ్చిన ఆయన.. భావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పడిపోవడంలో తమ ప్రమేయం ఏమీలేదన్నారు. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల ఫలితాల తరువాత తమ బలం మరింత పెరగనుందన్నారు.
ఇటీవల ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం మల్లికార్జున ఖర్గేను సీఎంగా నియమిస్తామని ప్రకటించిన అనంతరం వారికి ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని ఎడ్డీ తెలిపారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 280 సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో 20-22 ఎంపీ సీట్లు, తెలంగాణ మహబూబ్‌నగర్, సికింద్రాబాద్ స్థానాలను గెలుచుకుంటామని జోస్యం చెప్పారు.