జగన్‌ నిజం..బాబు మోసం.. పవన్‌ విద్వేషం..

Writer Kona Venkat Comments On Chandrababu - Sakshi

పవన్‌... తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొడతావా?

మాయావతి నీకు మదర్‌ థెరిసాలా కనిపించిందా?

జగన్‌పై ఎందుకంత విషం కక్కుతున్నావ్‌?

పవన్‌ నాకు సన్నిహితుడే; కానీ రాజకీయాల్లో ఆయనవి తప్పటడుగులే

బ్రాహ్మణ ద్రోహి చంద్రబాబురాష్ట్రంలో ఒక్క బ్రాహ్మణుడూ ఆయనకు ఓటెయ్యకూడదు

బాబు రాజకీయం అత్యంత నీచం

ఆయన వంటి విలన్‌ను నేను సినిమాల్లోనూ సృష్టించలేదు.. సృష్టించలేను కూడా!

తాజా రాజకీయాలపై స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ అంతరంగం

ఆయన కలం... హీరోతో డ్రామా పండించింది... హీరోయిన్‌ను దెయ్యంగా చూపించింది... విలన్‌తో కామెడీ కితకితలు పెట్టించింది...! ‘ఢీ’, రెడీలతో తెలుగు సినిమా దూకుడును పెంచిన ఆయనలో కథా రచయిత, నిర్మాత, దర్శకుడు, సంభాషణల రచయిత, పాటల రచయిత, నటుడు ఉన్నారు. ఆయనే... స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కోన వెంకట్‌... రాజకీయ దిగ్గజం, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ కోన ప్రభాకర్‌రావుకు స్వయానా మనుమడు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చి రెండున్నర దశాబ్దాలుగా రాణిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై విశాఖపట్నంలో సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పరిస్థితిని ఆయన ఒక్క మాటలో చెబుతూ.. ‘వైఎస్‌ జగన్‌ నిజం... చంద్రబాబు మోసం.. పవన్‌ కల్యాణ్‌ గందరగోళం’ అని విశ్లేషించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...

పవన్‌ కల్యాణ్‌ సినీ రంగంలో నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంతటి అనుబంధం ఉంది. కత్తి మహేష్‌ వివాద విషయంలో పవన్‌కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను. కానీ, రాజకీయాల్లోకి వచ్చేసరికి పవన్‌ తప్పటడుగులు వేస్తున్నారని అనిపిస్తోంది. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశంగా స్పందిస్తున్నారని అర్థమవుతోంది. తాజాగా తెలంగాణ గురించి పవన్‌ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ మాటలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయ్‌. ఈ ఐదేళ్లలో తెలంగాణలోని హైదరాబాద్‌లోనే కాదు. మారుమూల పల్లెల్లో ఉంటున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు. పవన్‌ ఇలాంటి ప్రకటనలను ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. 

పవన్‌... జగన్‌పై నీవు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం చూపించు...నేను జనసేన జెండా పట్టుకు తిరుగుతా...
మాయావతి వంటివారితో పొత్తు పెట్టుకున్న పవన్‌... ఆరోపణలు తప్ప ఒక్క కేసు కూడా నిరూపణ కాని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాత్రం విషం చిమ్మడం అన్యాయం. ఎందుకు వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పవన్‌ విమర్శలు చేస్తారో అర్ధం కాదు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటాలే శ్వాసగా బతికే కుటుంబం వైఎస్‌ జగన్‌ది. అటువంటి జగన్‌పై అకారణంగా రెచ్చగొట్టేలా మాట్లాడటం చాలా తప్పు. ఇప్పుడు చెబుతున్నా... పవన్‌ కల్యాణ్‌... వైఎస్‌ జగన్‌పై మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కనీసం ఒక్కదానికైనా ఆధారం చూపించండి. అలా చేస్తే నేను జనసేన జెండా పట్టుకుని మీ వెంటే తిరుగుతా.

మాయావతి మదర్‌ థెరిసాలా కనిపించిందా?
పవన్‌కు సరిగ్గా ఎన్నికల ముందు, అర్ధాంతరంగా మాయావతితో చర్చలు జరిపి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మాయావతి మీకు మదర్‌ థెరిసాలా కనిపించిందా? నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుపట్టిన మాయావతి వద్దకు వెళ్లి పొత్తు పెట్టుకోవడం ఏమిటో? దళితుల ఓట్లే కావాలనుకుంటే అంతకంటే నిబద్ధత, నిజాయితీ కలిగిన నేతలు మీకు దొరకలేదా? మీ గందరగోళ రాజకీయం, తప్పటడుగులు ఇక్కడే తెలిసిపోతున్నాయి.

జగన్‌ నవ్యాంధ్ర ఆశాజ్యోతి
2014లోనే వైఎస్‌ జగన్‌ సీఎం అయితే ప్రస్తుతం రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఉండేది. ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. వైఎస్‌ జగన్‌ పక్షానే ఉన్నారు. అందుకు ఆయన ఎవ్వరినీ నమ్ముకోలేదు. కేవలం తన కష్టాన్ని, ప్రజలను నమ్ముకున్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో ఆయన తండ్రి డా.వైఎస్‌ఆర్‌ చనిపోయినప్పుడు చేసిన ఓదార్పు యాత్రకు, ప్రజల కోసం చేసిన పాదయాత్రకు చాలా తేడా ఉంది. పాదయాత్ర జగన్‌లో చాలా మార్పు తెచ్చింది. ‘నాన్న నాకు అన్నీ ఇచ్చాడు.. ఇక నేను కేవలం ప్రజల కోసమే బతకాలి’ అనే లక్ష్యం వైఎస్‌ జగన్‌లో కనిపిస్తోంది. అలాంటి వ్యక్తికి ఓట్లేసి గెలిపిస్తేనే నవ్యాంధ్ర ఇప్పటినుంచైనా బాగుపడుతుంది. అందుకే నేను జగన్‌ నవ్యాంధ్ర ఆశాజ్యోతి అంటాను.

బాబు వంటి విలన్‌ను సినిమాల్లోనూ సృష్టించలేను
సినీ పరిశ్రమలో నాది సుమారు రెండున్నర దశాబ్దాల ప్రస్థానం. 54 సినిమాలకు రచయితగా పనిచేశాను. అందులో 90 శాతం విజయవవంతమైనవే. సినిమాల్లో ఎన్నో విలన్‌ పాత్రలు సృష్టించాను. ఒక రచయితగా కామెడీ విలన్లతో పాటు క్రూర విలన్‌ పాత్రలనూ రాసుకున్నాను. కానీ సీఎం చంద్రబాబునాయుడు వంటి విలన్‌ పాత్రను ఇంతవరకు నేను సృష్టించలేకపోయా. బహుశా ఇక సృష్టించలేను కూడా. ఎందుకంటే బాబు రాజకీయం మొత్తం నీచత్వం, భ్రష్టత్వమే. మొత్తం జీవితమంతా వెన్నుపోట్లమయమే. పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌ మొదలు... 2014 ఎన్నికల్లో సీనియర్‌ నేత అని నమ్మి ఓట్లేసిన ప్రజలందరికీ ఆయన వెన్నుపోటే పొడిచారు. నమ్మక ద్రోహానికి చంద్రబాబు నిలువెత్తు రూపం. సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పరిస్థితి ఇప్పుడు ఏమిటి? ఆయన బతికున్నారా లేదా? అని తెలియని పరిస్థితికి తెచ్చాడు. రక్త సంబంధీకులను కూడా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. జూ.ఎన్టీఆర్‌ను ఎలా తొక్కొలని చూశాడో అందరికీ తెలుసు. కుమారుడు లోకేష్‌ కోసం జూ.ఎన్టీఆర్‌ని టీడీపీకి దూరం చేసిన విషయం బహిరంగ రహస్యమే.

చంద్రబాబుపై విమర్శలు ఎందుకు తగ్గాయో?
చంద్రబాబు పాలన అవినీతి, అక్రమాలమయం అని గతంలో మంగళగిరి, కాకినాడ సభల్లో పవన్‌కల్యాణ్‌ చేసిన ప్రసంగానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రజలు కూడా హర్షించారు. పవన్‌ ఇన్నాళ్లకు రాజకీయంగా సరైన దారిలోకి వచ్చారని అనుకున్నారు. మరి ఏమైందో తెలియదు? యూ టర్న్‌ అని చెప్పను గాని అకస్మాత్తుగా విమర్శల దాడి తగ్గించారు. అధికారపక్షాన్ని కాకుండా నిత్యం ప్రజలతో ఉండే వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా విమర్శలు చేయడం ఏమిటో అర్ధం కాకుండా ఉంది.

పవన్‌ కూడా పాదయాత్ర చేసుంటే... 
పవన్‌ కల్యాణ్‌ కూడా పాదయాత్ర చేస్తే ప్రజా సమస్యలపై మరింత అవగాహన వచ్చేది. అప్పుడు వాళ్లు చెప్పేది, వీళ్లు చెప్పేది విని మాట్లాడకుండా స్వయంగా ప్రజలతో మాట్లాడి అసలు సమస్యలేమిటో తెలుసుకునేవారు. సినీ గ్లామర్‌తో వెల్లువెత్తే అభిమానుల సమస్య మొదట్లో ఉన్నా, పాదయాత్ర చేసుకుంటూ పోతే అది తగ్గేది. స్టార్‌ హీరోల కంటే ఎక్కువ మాస్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌ వేలాదిమంది పోటెత్తుతున్నా పాదయాత్ర చేశారు కదా? పవన్‌ కూడా అదే మాదిరి చేసుంటే ఆయనకు వర్తమాన రాజకీయాలపై స్పష్టత వచ్చేది.

బ్రాహ్మణుడు చంద్రబాబుకు ఓటెయ్యకూడదు
నేను సనాతన బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాను. కానీ నేను సామాజిక బాధ్యత ఉన్న రచయితను. రచయితలకు కలం తప్ప కులం ఉండదు. నాది కులాంతర వివాహం. నా పెద్ద కుమార్తెది వర్ణాంతర వివాహం. కానీ బ్రాహ్మణులకు అనాదిగా చంద్రబాబు చేస్తున్న వంచనపై కడుపుమండి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బ్రాహ్మణులు పనికిరారని చంద్రబాబు భావిస్తుంటారు. అందుకే ఏ ఎన్నికల్లోనూ టికెట్లు ఇవ్వరు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 294 నియోజకవర్గాల్లో టీడీపీ ఒక్క సీటు కూడా బ్రాహ్మణులకు ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో కూడా ఒక్క టికెట్‌ ఇవ్వలేదు. అలాంటప్పుడు బ్రాహ్మణులు చంద్రబాబుకు ఎందుకు ఓటెయ్యాలి. జంధ్యం వేసుకుని గాయత్రీమంత్రం చదివే ఒక్క బ్రాహ్మణుడు కూడా టీడీపీకి ఓటెయ్యకూడదని నేను బహిరంగంగా పిలుపునిస్తున్నా. సిగ్గు, శరం ఉంటే టీడీపీలో ఉన్న బ్రాహ్మణ నేతలు పునరాలోచన చేసుకోవాలి. మహా నేత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే వైఎస్‌ జగన్‌ బ్రాహ్మణ పక్షపాతి. అందుకే రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడతో పాటు బాపట్లలో బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లిచ్చారు. ఈ ఒక్క విషయం చాలదా? బ్రాహ్మణులను వైఎస్‌ జగన్‌ ఎంత గౌరవిస్తున్నారో. అందుకే చెబుతున్నా... బ్రాహ్మణులారా, ఒక్క ఓటు కూడా బయటకి పోకూడదు. అన్ని ఓట్లూ వైఎస్‌ జగన్‌కే  వేయండి.

నవరత్నాలతో అందరి జీవితాలు బాగుపడతాయి
మహానేత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా చిరస్థాయి పేరు సంపాదించారు. ఆరోగ్య శ్రీ. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలతో వైఎస్‌ ఇప్పటికీ పేదల గుండెల్లో కొలువై ఉన్నారు. మళ్లీ అంతటి పాలన ఒక్క వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనే చూడగలం. ఆయన ప్రకటించిన నవరత్నాల గురించి నేను క్షుణ్నంగా తెలుసుకున్నా. ఆయన ఇంట్లో కూర్చునో, ఆఫీసులో కూర్చునో, పార్టీ నేతలతో మాట్లాడో నవరత్నాలు ప్రకటించలేదు. ఎండనక, వాననక రోడ్లపై ప్రజలతో తిరిగి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ఆ తర్వాతే ప్రకటించారు. ఈ పథకాలతో బీదాబిక్కి జనమే కాదు అందరి జీవితాలు బాగుపడతాయి.

సినీ పరిశ్రమలో జగన్‌ మద్దతుదార్లే ఎక్కువ
సినీ పరిశ్రమలో ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతుదార్లే ఎక్కువమంది ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ను మా సినీ కుటుంబ సభ్యుడిగా అభిమానిస్తాం. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి జగన్‌కు మద్దతిచ్చేవారే అధికంగా ఉన్నారు. ఇక చంద్రబాబు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విభజన తర్వాత సినీ పరిశ్రమ బాగోగులను ఆయన కనీసం పట్టించుకోలేదు.

చివరగా ఒక్కమాట... నాకు రాజకీయాలతో అస్సలు సంబంధం లేదు. నేను వైఎస్సార్‌సీపీ నేతను కాదు. కనీసం కార్యకర్తను కూడా కాదు. కానీ వర్తమాన రాజకీయాలపై బాధ్యత కలిగిన పౌరుడిగా, ఒక రచయితగా ప్రజలు ఏ పక్షాన నిలవాలో సూచించాల్సిన కనీస కర్తవ్యం నాపై ఉంది. చంద్రబాబు అండ్‌ కో గిమ్మిక్కులతో కొందరు ప్రజలు, తటస్థులు గందరగోళానికి గురవుతుంటారు. అందుకే నా వంటి వాళ్లు బహిరంగంగా మాట్లాడాల్సిన సమయమిది. మహా నేత డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే ఈ రాష్ట్ర గతి మారుతుంది. ప్రజల జీవనవిధానం మారుతుంది. మళ్లీ రాజన్న రాజ్యం కావాలంటే వైఎస్‌ జగన్‌ను సీఎం చేయాలి.

 – గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top