మోదీపై ‘టైమ్‌’లో వ్యాసం రాసినందుకు...

Writer Aatish Taseer Wikipedia Page Vandalised - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘టైమ్‌’ మేగజీన్‌లో కవర్‌ పేజీ వ్యాసం రాసిన ప్రముఖ జర్నలిస్ట్‌ ఆతిష్‌ తసీర్‌ గురించి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని పూర్తిగా మార్చి వేశారు. టైమ్‌ మేగజీన్‌తోపాటు పలు ఆంగ్ల పత్రికలకు ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా పనిచేసిన తసీర్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి పీఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారంటూ యాడ్‌ చేశారు. నరేంద్ర మోదీ గురించి ‘టైమ్‌’లో వ్యాసం రాగా, ఆ మరుసటి రోజే, అంటే మే 10వ తేదీనాడు వికీపీడియా పేజీని మార్చివేశారు. వాస్తవానికి ఇది మే 20వ తేదీ సంచిక. ముందే మార్కెట్‌లోకి వచ్చింది. 

తర్వాత దాన్ని భారతీయ జనతా పార్టీ సోషల్‌ మీడియా యూజర్‌ చౌకీదార్‌ శశాంక్‌ సింగ్‌ ట్వీట్‌ చేయగా, అది ఇప్పుడు వేలసార్లు రిట్వీట్‌ అవుతోంది. ‘ఆతిష్‌ తసీర్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు పీఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. నిష్పక్షపాతంగా ఉంటుందన్న గుర్తింపును అది ఎప్పుడో కోల్పోయింది. కమ్యూనిస్టుల బాకాగా మారింది’ అని శశాంక్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఇదే టైమ్‌ మేగజీన్‌ 2015, మే సంచికలో ‘వై మోదీ మ్యాటర్స్‌’ అంటూ మోదీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇదే బీజేపీ సోషల్‌ మీడియా ‘టైమ్‌’ అంత గొప్ప మేగజీన్‌ ప్రపంచంలోనే లేదంటూ ఆకాశానికి ఎత్తుకుంది.
 

నాడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ ప్రపంచ దిగ్గజంగా ఎదగాలంటే నరేంద్ర మోదీ లాంటి నాయకుడు అవసరమంటూ నాడు టైమ్‌ మేగజీన్‌ కవర్‌ పేజీతో మోదీ ఇంటర్వ్యూను ప్రచురించింది. ఇప్పుడు ఆ ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయని, భారత ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తానంటూ అధికారంలోకి వచ్చిన మోదీ అన్నింటా విఫలమయ్యారని, ఆయన చర్యలు విద్వేషపూరిత జాతీయ వాదానికి బీజం వేశాయంటూ విమర్శించింది. దీంతో కోపం వచ్చిన బీజేపీ సోషల్‌ మీడియా జర్నలిస్ట్, రచయిత అయిన ఆతిష్‌ తసీర్‌ను కాంగ్రెస్‌ పీఆర్‌ మేనేజర్‌ను చేసింది. 2003లో ఇండియా టుడే పత్రిక కూడా ‘మాస్టర్‌ డివైడర్‌’ అంటూ కవర్‌ పేజీ వ్యాసం రాసింది. 

ఆతిష్‌ భారతీయ జర్నలిస్ట్‌ తవ్లీన్‌ సింగ్‌ కుమారుడు. ఆయన టైమ్‌ మేగజీన్‌తోపాటు ప్రాస్పెక్ట్‌ మేగజీన్‌, ది సండే టైమ్స్, ది సండే టెలిగ్రాఫ్, ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. దేశ విభజన సందర్భంగా అద్బుతమైన కథలు రాసిన ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్‌ హసన్‌ మంటో కథనాలను ‘మంటో: సెలెక్టెడ్‌ స్టోరీస్‌’ పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. (చదవండి: ‘టైమ్‌’లో ఆతిష్‌ తసీర్‌ రాసిన కథనం ఇదే)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top