భవిష్యత్‌ను నిర్ణయించేది మహిళా ఓటర్లే!

Women Voters To Decide Indian Politics In Future - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో మహిళా ఓటర్ల పాత్ర చరిత్రాత్మక దశకు చేరుకుంది. 1990వ దశకంలో ఎన్నికల్లో ఓటేసిన పురుషులకంటే మహిళల సంఖ్య పది శాతానికి పైగా తక్కువగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఓటేసిన మహిళల సంఖ్య 65.5 శాతానికి చేరుకుంది. అదే ఎన్నికల్లో 67 శాతం పురుషులు ఓటేశారు. అంటే పురుషులతో పోలిస్తే ఓటేసిన మహిళల సంఖ్య ఒకటిన్నర శాతం మాత్రమే తక్కువ. ఏకంగా దేశంలోని 87 లోక్‌సభ నియోజక వర్గాల్లో పురుషులకన్నా మహిళలే ఎక్కువ ఓట్లు వేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రిజిస్టర్‌ చేసుకున్న పురుషుల ఓటర్ల సంఖ్య మహిళా ఓటర్లే కంటే ఎక్కువే. అయినప్పటికీ రిజిస్టర్‌ చేసుకున్న మహిళల్లోనే ఎక్కువ మంది ఓటేస్తున్నారు. అంటే ఓ ప్రభుత్వాన్ని, ఓ రాజకీయ పార్టీ భవిష్యత్తును శాసించే దశకు వారు చేరుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను కూడా మహిళలే శాశిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

1994 నుంచి 2014వరకు జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్ల పోలింగ్‌ సరళి చూస్తే పురుషులకన్నా మహిళలే కాంగ్రెస్‌వైపు ఎక్కువ మొగ్గు చూపారు. కాంగ్రెస్‌ కన్నా బీజేపీకి రెండు, మూడు శాతం తక్కువ మంది మహిళలు ఓట్లు వేశారు. అంతర్జాతీయంగా కూడా మహిళా ఓటర్ల ప్రభావం పెరుగుతోంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికులకన్నా డెమోక్రట్లకే ఎక్కువ మంది మహిళలు ఓటేశారు. 2016 ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీకి ఓటేసిన వారిలో 56 శాతం మంది మహిళలు ఉండగా, 44 శాతం మంది మహిళలు ఉన్నారు. బ్రిటన్‌ ఎన్నికల్లో కూడా లేబర్‌ పార్టీకన్నా కన్జర్వేటివ్‌ పార్టీకే మహిళల ఓట్లు ఎక్కువ పడ్డాయి.

దేశంలో లోక్‌నీతి జరిపిన జాతీయ ఎన్నికల అధ్యయనం ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి కాంగ్రెస్‌ పార్టీకి ఒకే రీతిన అంటే, 19 శాతం పురుషులు, 19 శాతం పురుషులు ఓట్లు వేశారు. అదే బీజేపీకి 33 శాతం మంది పురుషులు ఓటేయగా, 29 శాతం మంది మహిళలు ఓటేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్‌కు స్త్రీ, పురుషులు సమానంగా వేయగా, ప్రతి చోటా బీజేపీకి పురుషులకన్నా స్త్రీలు తక్కువ సంఖ్యలో ఓటేశారు. కొన్ని రాష్ట్రాల్లో స్త్రీ, పురుషుల ఓటింగ్‌ సరళిలో కూడా ఎంతో వ్యత్యాసం కనిపించింది. అస్సాం రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలు కాంగ్రెస్‌కు ఓటేయగా, ఎక్కువ మంది పురుషులు బీజేపీకి ఓటేశారు. కర్ణాటకలో కూడా మహిళలు కాంగ్రెస్‌ పార్టీని కోరుకోగా పురుషులు బీజేపీ పార్టీని కోరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకన్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలనే స్త్రీ, పురుషులు కోరుకున్నారు. ఈ రెండు పార్టీలకే మహిళలు కూడా ఎక్కువ ఓటేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు 15 శాతం మంది పురుషులు ఓటేయగా, ఐదు శాతం మంది మహిళలు మాత్రమే ఓటేశారు. గుజరాత్‌లో మాత్రం స్త్రీ, పురుషులు దాదాపు సమానంగా బీజేపీకే ఓటేశారు. తెలంగాణలో కే. చంద్రశేఖర రావు, బీహార్‌లో నితీష్‌ కుమార్, మధ్యప్రదేశ్‌లోలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌లు మహిళా ఓటర్లను ఎక్కువ ఆకర్షించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ,  తమిళనాడులోని అన్నాడిఎంకే (జయలలిత) పార్టీలు మహిళా ఓటర్లను ఎక్కువ ఆకర్షించాయి. అలాగే 2014 అనంతరం తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల సరళిని లోక్‌నీతి సంస్థ పరిశీలించగా మహిళా ఓటర్లే ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెల్సింది. మహిళా నాయకత్వంలోని అన్ని పార్టీలకు పురుషులకన్నా మహిళలే ఎక్కువ ఓట్లు వేస్తున్నారు.

2017, నవంబర్‌లో ‘ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌’ జరిపిన అధ్యయనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పురుషులకన్నా స్త్రీల మద్దతు కాస్త తగ్గింది. మతమరమైన అంశాలను మోదీ సరిగ్గా డీల్‌ చేయలేకపోతున్నారన్నదే వారి అభియోగం. కానీ 2018 మే నెలలో లోక్‌నీతి జరిపిన అధ్యయనంలో 2014 ఎన్నికలతోపోలిస్తే బీజేపీకి మహిళల మద్దతు కొద్దిగా పెరిగింది. అంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మహిళలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నమాట.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top