తిరువనంతపురం విజేత ఎవరు?

who will be the winner of Thiruvananthapuram - Sakshi

సాక్షి, తిరువనంతపురం: తెల్లటి కద్దరు చొక్కా, దోవతి ధరించిన కుమ్మనం రాజశేఖరన్‌ బీజీపీ అభ్యర్థిగా తిరువనంతపురం కోక్‌సభ నియోజక వర్గంలో ఆదివారం వరకు విస్తతంగా పర్యటించారు. కచాని నుంచి కేశవదాసపురం వరకు సాగిన ఆయన ఎన్నికల యాత్రలో ఆయన  ఎదురైన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగగా, ఆయన పార్టీ కార్యకర్తలు దారి పొడువున ఆయనకు కాషాయ, ఆకుపచ్చ కండువాలు కప్పుతూ ‘భారత మాతాకు జై’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆయన పలు చోట్ల మాట్లాడుతూ తాను నియోజకవర్గం అభివద్ధికి కృషి చేయడంతోపాటు సంస్కతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తానంటూ ‘వివాదాస్పద శబరిమల’ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. 

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవాళ్లను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి కేరళలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం కృషి చేయగా, బీజేపీ, ఆరెస్సెస్‌ సంస్థలు అందుకు వ్యతిరేకంగా ఆందోళన చేశాయి. తద్వారా బీజేపీ తిరువనంతపురం ప్రాంతంలో తన బలాన్ని పెంచుకుంది. తొలుత, సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ సమర్థించింది. గణనీయ సంఖ్యలో సుప్రీం తీర్పును ప్రజలు వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావడంతో బీజేపీ తన వైఖరిని మార్చుకొని ప్రత్యక్షంగా ఆందోళనలకు దిగింది. గత 70 ఏళ్లుగా రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకోసారి మారుతూ వస్తున్నాయని, ఈసారి ఆ మార్పు తిరువనంతపురంలో బీజేపీకి అనుకూలంగా మారుతుందని రాజశేఖరన్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. 

వరుసగా గత రెండు ఎన్నికల్లో తిరువనంతపురంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా శశిథరూర్‌ విజయం సాధిస్తూ వచ్చారు. మూడవ విడతగా తిరువనంతపురంలో ఏప్రిల్‌ 23వ తేదీన పోలింగ్‌ జరుగుతోంది. ఒక్క ఈ నియోజకవర్గంలోనే కాదు, మొత్తం కేరళలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏనాడు విజయం సాధించలేదు. ఈసారి శబరిమల వివాదం వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకని రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలకుగాను బీజేపీ 14, మిత్రపక్షాలు ఆరు స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మిత్రపక్షమైన భారత ధర్మసేన ఐదు, కేరళ కాంగ్రెస్‌ (థామస్‌) ఒక్క స్థానానికి పోటీ చేస్తున్నాయి. 

తిరువనంతపురం సీటును కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని ఉవ్యూళ్లూరుతున్న బీజేపీ, రాజశేఖరన్‌ విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఆయన విజయం కోసం భారీ ఎత్తున ఆర్థిక వనరులను సమకూర్చినట్లు తెల్సింది. మరో పక్క ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆరెస్సెస్‌ స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాడర్‌ను ఇక్కడికే పంపించింది. అయితే ఆయన విజయం అంత సులువుకాదు, కచ్చితమూ కాదు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా శశిథరూర్‌యే కాకుండా ఎల్‌డీఎఫ్‌ తరఫున బలమైన అభ్యర్థి, మాజీ మంత్రి సీ. దివాకరన్‌ పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో శశిథరూర్‌ మొదటిసారి 99,998 ఓట్ల మెజారిటీ తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి పీ. రామచంద్రన్‌ నాయర్‌పై విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి పీ. కష్ణదాస్‌ కేవలం 84,094 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో కూడా శశిథరూర్‌ రెండోసారి విజయం సాధించగా, బీజేపీ అభ్యర్థి ఓ. రాజగోపాల్‌ రెండో స్థానంలో వచ్చారు. ఆ ఎన్నికల్లో శశిథరూర్‌ మెజారిటీ 15,470 ఓట్లకు పడి పోవడం గమనార్హం. 

ఈ నియోజకవర్గంలో బీజేపీ 1998 నుంచి తన పోలింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వస్తోంది. 1998లో 12.39 శాతం ఓట్లురాగా, 1999లో 20.93 శాతం, 2004లో 29.86 శాతం ఓట్లు వచ్చాయి. 2005లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పోలింగ్‌ శాతం దారుణంగా 4.8 శాతంకు పడిపోయింది. అది 2009లో 11.4 శాతానికి, 2014లో 32.32 శాతానికి పెరిగింది. 2016లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరువనంతపురం జిల్లాలోని నిమామ్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top