
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లోని త్రిపుర, నాగాలాండ్‌లో ఓటమిని అంగీకరించింది. ఓటమిగల కారణాలపై విశ్లేషించి పార్టీని మరింత బలంగా పనిచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్‌పటేల్ అన్నారు. గతంలో నాగాలాండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలుచుకోగా ఈసారి కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఒక త్రిపుర గతంలో 10 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఇక్కడ కూడా ఖాతా తెరవలేకపోయింది.
అయితే, మేఘాలయలో మాత్రం 2013లో 28 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ ఈసారి మాత్రం 21 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస తరుపున అహ్మద్‌పటేల్ అధికారిక ప్రకటన చేశారు. 'మేఘాలయలో మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. త్రిపుర, నాగాలాండ్‌లో మాత్రం ఓడిపోయాం' అని ఆయన అన్నారు. ఇక ఓ పక్క ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటే రాహుల్ గాంధీ విదేశాలకు వెళతారా అని బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన విమర్శలపై అహ్మద్‌పటేల్ స్పందించారు. ఆయన అనవసరంగా మాట్లాడుతున్నారని, ఎవరైనా వారి అమ్మమ్మ దగ్గరకు వెళితే నేరం అవుతుందా అని ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం గిరిరాజ్ ప్రవృత్తిని బయటపెట్టుకోవడం తప్ప మరొకటి కాదని ఆయన ప్రతిదాడి చేశారు.