ఏడాదిలో తెలంగాణను త్రిపుర చేయగలం

We Can Telanagana Like Tripura with in a year : GVL Narasimha Rao - Sakshi

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజల్లో చైతన్యం కలిగిస్తే తాము అధికారంలోకి వచ్చే పరిస్థితులు రావటానికి ఏడాది కాలం సరిపోతుందని, త్రిపురలో తాము చేసి చూపించింది తెలంగాణలో కూడా సాధ్యమేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నా రు. ఈ దడ పుట్టే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బురద జల్లే రాజకీయాలకు టీఆర్‌ఎస్‌ నేతలు తెరదీశారని ఆయన విమర్శించారు. తెలంగాణలో తమ బలం తగ్గుతోందని  తెలియటంతో సీఎం కేసీఆర్‌లో భయం పట్టుకుందని, అదే భయంతో ఉన్న ఇతర రాష్ట్రాల నేతలను కూడగట్టుకుని ఫ్రంట్‌ పేరుతో  రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ అలాంటి ఏ ఫ్రంట్‌ కూడా మోదీ ముందు నిలవబోవని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్యను మరింత పెంచుకుంటుందని జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

దక్షిణాదిలో ఎక్కువ సీట్లు సాధిస్తాం.. 
తెలంగాణ, ఆంధ్ర సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈసారి ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తామని, ఆ సంఖ్య 40 నుంచి 50 సీట్ల వరకు ఉండేలా చూస్తున్నామని జీవీఎల్‌ పేర్కొన్నారు. 2014లో ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 21 రాష్ట్రాలను కైవసం చేసుకుందని, ప్రధాని మోదీకి ఇంకా ఆదరణ పెరుగుతోందని, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అదే భయం పట్టుకుందని చెప్పారు. బంగారు తెలంగాణ అని కేసీఆర్‌ అంటున్నా, ఆయన కుటుంబం బంగారం కావటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఎలాగైనా ప్రజల దృష్టిని మరల్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా నిధులివ్వలేదనే ప్రచారం ఇందులో భాగమేనని అన్నారు. హామీలతో కాంగ్రెస్‌ కాలం వెళ్లదీస్తే బీజేపీ అసలు సామాజిక న్యాయం అమలు చేస్తోందన్నారు. 

మోదీని తిట్టడమే వారి ఎజెండా 
హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ సమావేశాలు ప్రధాని మోదీని దూషించటంతో మొదలయ్యాయని, అదే రకంగా ముగించే అవకాశం ఉందని, మోదీని తిట్టడమే అన్ని పార్టీలకూ సింగిల్‌ ఎజెండాగా మారిపోయిందని జీవీఎల్‌ పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top