రాష్ట్రంలో ఓటర్లు 2.61 కోట్లు

Voters in the state are 2.61 crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌కు అనుగుణంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతోంది. ప్రతి జనవరిలోనూ కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటరు జాబితాను వెల్లడిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (టీఎస్‌సీఈవో) కార్యాలయం సెప్టెంబర్‌ 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనుంది. అనంతరం దీనిపై ప్రతిపాదనలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వీటిని పరిశీలించి 2018, జనవరి 4న తుది జాబితా వెల్లడిస్తారు. టీఎస్‌సీఈవో కార్యాలయం అధికారులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన కోసం అన్ని జిల్లాల నుంచి తాజా వివరాలను సేకరించి నివేదిక రూపొందించారు. ఈ జాబితా ప్రకారం.. రాష్ట్రంలో 2.61 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.32 కోట్ల మంది పురుషులు, 1.28 కోట్ల మంది మహిళలు, 2,439 మంది థర్డ్‌ జెండర్‌ కేటగిరీ వారున్నారు. 2018, జనవరి తుది ఓటర్ల జాబితాతో పోల్చితే 8,12,673 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది కొత్తగా 9,11,320 మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి వీటిని పరిశీలించి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పిస్తూ జాబితాలో చేర్చారు.

2014, సాధారణ ఎన్నికలతో పోల్చితే రాష్ట్రంలో 20,33,597 ఓటర్లు తగ్గారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే దాదాపు అధిక సంఖ్యలో ఓటర్లు తగ్గారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఓటరుగా నమోదైన వారి పేర్లను పరిశీలించి ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓటర్ల సంఖ్య తగ్గింది. భద్రాచలం, పినపాక, అశ్వారావుపేటలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో ఈ మూడు సెగ్మెంట్ల పరిధిలోనూ లక్ష ఓట్ల వరకు తగ్గాయి. కొత్తగా చేర్చిన ఓటర్లతో చూసినా గత ఎన్నికల కంటే దాదాపు 20 లక్షల మంది ఓటర్లు తక్కువగా ఉన్నారు.

2,439 పోలింగ్‌ కేంద్రాలు...
వీలైనంత ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌ నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది. ప్రశాంతంగా పోలిం గ్‌ జరిగేందుకు వీలుగా పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెంచుతుంది. కొన్ని కేంద్రా ల చిరునామా మార్చుతుంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో రాష్ట్రం లో 30,518 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తాజా ఓటర్ల ముసాయిదా జాబితాతోపాటు పోలింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలను అధికారులు ఖరారు చేశా రు. రాష్ట్రంలో 32,573 పోలింగ్‌ కేంద్రాలు ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఎస్‌సీఈవో కార్యాలయం ప్రతిపాదనలు పంపింది. ఎలాంటి మార్పు లు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం దీనికి ఆమోదం తెలపనుంది.

నోటిఫికేషన్‌ వరకు వివరాలతోనే...
తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తే అప్పటి వరకు ఉన్న ఓటర్ల జాబితాతోనే పోలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయ్యే ముందు రోజు వరకు ఓటరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిని సైతం ఎన్నికల సంఘం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. సాధారణ దరఖాస్తు చేసిన 7 పని దినాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని నిబంధనలు చెబుతు న్నాయి. ఎన్నికల నిర్వహణను పరిగణనలోకి తీసుకుని ఓటరు జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని, దీని ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top