ఆ డైలాగ్‌కు అర్థం ఇదా..: విజయశాంతి 

Vijayashanthi Reacts On KCR's Images On Yadadri Temple Wall - Sakshi

‘సారు.. కారు.. సర్కార్‌’ నినాదంపై విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీరుపై కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి వ్యంగ్య్రస్తాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ పదేపదే ‘సారు.. కారు.. సర్కార్‌’అనే డైలాగ్‌ వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థం అయిందన్న విజయశాంతి, ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న స్తూపాల్లో దేవతామూర్తులతో పాటు కేసీఆర్‌ బొమ్మను, కారు గుర్తును, టీఆర్‌ఎస్‌ సర్కార్‌ గుర్తును చెక్కడం ద్వారా కేసీఆర్‌ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతోందన్నారు. రాజులు, రాజ్యాలు కను మరుగైన తర్వాత కూడా కేసీఆర్‌ తన దొర తనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మండిపడ్డారు. 

ఖండించిన కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి 
యాదాద్రి దేవాలయ శిలలపై కేసీఆర్‌ తన ఫొటోతో పాటు కారు గుర్తు చిహ్నాన్ని చెక్కించుకోవడం సిగ్గుచేటని ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ చర్యలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. తక్షణమే ఆయా చిత్రాలను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

వివాదాస్పదంగా మారిన కేసీఆర్‌ చిత్రాలు  
కాగా యాదాద్రిలో అష్టభుజి మంటప పిల్లర్లపై సీఎం కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ఎన్నికల చిత్రమైన కారు, కేసీఆర్‌ కిట్టు, ఓటు వేయడానికి ఉపయోగించే స్వస్తిక్‌ స్టాంపు ముద్ర చిత్రాలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కాంగ్రెస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు కొండపైకి చేరుకుని నిరసనకు దిగారు. కొందరు కార్యకర్తలు ఉత్తర రాజగోపురం పైకి ఎక్కి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని కిందికి దించారు. దేవస్థానంలో జరుగుతున్న పనుల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ ఆ దరిదాపుల్లోకి రానివ్వలేదు.   

ఇది పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని భంగపరచడమే.. 
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అష్ట భుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభాల పై సీఎం కేసీఆర్‌ చిత్రం, టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు అయిన కారు, అన్యమత చిహ్నాలను చెక్కించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అది సీఎం కేసీఆర్‌ ప్రచార కాంక్ష మాత్రమే కాకుండా, హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని తెలిపారు. వైభవోపేతమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని భంగపర్చడం, తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. సీఎం ఆదేశాల మేరకే శిల్పులు కేసీఆర్‌ చిత్రాన్ని, టీఆర్‌ఎస్‌ గుర్తును చెక్కినట్టు స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్‌తో తమ మైత్రిని చాటుకుంటూ ఇందిరాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూల చిత్రా లు చెక్కించడం, తమ మిత్రుడైన మరో పార్టీని సంతృప్తి పరచడానికి, ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు హిందూయేతర మతానికి చెందిన చార్మినార్‌ను చిత్రించడం దుర్మార్గమన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top