‘ఫామ్‌ హౌజ్‌లో ఉండేవారిని కాదు.. ప్రజల మనిషిని గెలిపించండి’

Vijayashanthi Criticize CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు సాధించేలా కృషి చేస్తానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ప్రచారకమిటీ చైర్మన్‌ పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల(ఫిబ్రవరి)లోనే ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి  కేసీఆర్‌ గెలిచారని.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు గట్టి బుద్ది చెబుతారన్నారు. (సార్వత్రిక ఎన్నికలకు ఐదు కమిటీలు)

 ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్‌, నరేంద్ర మోదీలు విఫలమయ్యారని విమర్శించారు. సీఎం కేసీర్‌ పెట్టింది ఫెడరల్‌ ఫ్రంట్‌ కాదని.. ఫెడో ఫ్రంట్‌ అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు మంత్రి వర్గం కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌ని గెలిపించింది హోమాలు చేయడానికా అని ప్రశ్నించారు. ఫామ్‌ హౌజ్‌లో ఉండేవారికి కాకుండా ప్రజల మనిషికి అధికారం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజలు కోపంగా ఉన్న తెలుగు దేశం పార్టీని ముందు ఉంచి కేసీఆర్‌ ఎన్నికల్లో లబ్ది పొందారన్నారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లనే వినియోగించాలని డిమాండ్‌ చేశారు. తాను పోటీ చేసే విషయం అధిష్టానం నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పారు.

దొడ్డిదారిన టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది : డీకే అరుణ
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని సర్వేలు అన్ని అనుకూలంగా చెప్పినా... టీఆర్‌ఎస్‌ దొడ్డి దారిని అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన్‌ డీకే అరుణ ఆరోపించారు. చేయరాని పనులు చేసి, ధనబలంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిపించి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని కోరారు. 2014ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు సాధించిన టీఆర్‌ఎస్‌ రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. విభజన చట్టంలోని హామీలను సాధించడంలో టీఆర్‌ఎస్‌ విఫలమయ్యిందని విమర్శించారు. మతాల పేరుతో దేశాన్ని విభజించాలని చూస్తున్న బీజేపీని తిప్పికొట్టాలని పిలనిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే విషయం అధిష్టానం నిర్ణయంపై అధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top