
సాక్షి, న్యూఢిల్లీ /అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అరకు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొంది పార్టీ ఫిరాయించిన ఎంపీ కొత్తపల్లి గీతపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక లేఖ రాశారు. వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆమె లేఖ రాశారని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ నిబంధనల ప్రకారం గీత లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆమె 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై గెలిచారని, ఆ తర్వాత పార్టీ ఫిరాయించారని తెలిపారు. దీంతో గతంలో కూడా అనేక మార్లు ఆమెపై అనర్హత వేటు వేయాల్సిందిగా తమ పార్టీ డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. గీతపై వేటు వేయాల్సిందిగా తమ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కోరారని గుర్తుచేశారు. గీతతో పాటు తమ పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎంపీలను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని ఈనెల రెండున తాను కూడా కోరినట్టు గుర్తుచేశారు. ప్రస్తుతం గీత వైఎస్సార్‌సీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని ప్రధాన సాక్ష్యంగా పరిగణించాలని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఆమెపై తక్షణమే అనర్హత వేటు వేయాలని విజయసాయిరెడ్డి కోరారు. వైఎస్ జగన్‌కు గీత రాసిన లేఖను కూడా అందజేశారు.