చంద్రబాబు హామీలన్నీ 'మోసాలుగా తేలాయ్‌': వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హామీలన్నీ 'మోసాలుగా తేలాయ్‌': వైఎస్‌ జగన్‌

Mar 18 2026 4:15 AM | Updated on Mar 18 2026 4:15 AM

YSRCP President YS Jaganmohan Reddy Fires On Chandrababu Govt

ఒంగోలు నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో భేటీల­ో వైఎస్‌ జగన్‌ 

జగన్‌ ఇచ్చిన పథకాలన్నీ బాబు రద్దు చేశాడు.. కూటమి సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

కోవిడ్‌ లాంటి పరిస్థితుల్లోనూ జగన్‌ ప్రజలకు సంక్షేమ పథకాలను ఇచ్చాడు.. ప్రతి ఇంటికీ మేలు చేశాడు 

కోవిడ్‌లోనూ జగన్‌ ఎలా చేయగలిగాడు?.. 

ఇప్పుడు అలాంటిదేమీ లేకున్నా చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదనే చర్చ ప్రతి ఇంటా సాగుతోంది 

మా హయాంలో రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా రూ.2.73 లక్షల కోట్లు వేశాం 

బాబు రెండేళ్లలోనే రూ.3.30 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసినా పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు 

మనం ఎక్కడా అవినీతికి తావు లేకుండా పథకాలిచ్చాం.. ఇప్పుడు అంతా దోచుకో.. పంచుకో.. తినుకో! 

తాజాగా టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌  డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డా.. చంద్రబాబు ‘నో యాక్షన్‌’.. 

మహిళలపై కూటమి ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నసీర్, కూన రవికుమార్‌ అఘాయిత్యాలపైనా... బాబు ‘నో యాక్షన్‌’ 

చంద్రబాబుకు మిగిలింది ఇక రెండు బడ్జెట్ల సమయమే.. 

మన పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు గుర్తించారు 

జగన్‌ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట

దోచుకో... పంచుకో... తినుకో...! ఈరోజు ప్రతి అడుగులో ఇదే 
కనిపిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఖజానాకు రానివ్వకుండా.. మీ సొంత జేబులు నింపుకొంటుంటే ఖజానా దివాలా తీయకుండా ఏమవుతుంది? అందుకే మీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితి ఇంత అధ్వాన్నంగా మారింది. 
– బాబు పాలనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 
 
సాక్షి, అమరావతి: చంద్రబాబు హామీలన్నీ మోసాలుగా తేలిపోయాయని.. ఒకవైపు జగన్‌ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేస్తూ, మరోవైపు రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ మేలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాడు కోవిడ్‌ లాంటి పరిస్థితుల్లోనూ జగన్‌ సంక్షేమాభివృద్ధి పథకాలన్నీ అమలు చేసినప్పుడు.. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోందన్నారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో మొత్తం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. రూ.2.73 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా వేశామని గుర్తు చేశారు. 

ఇప్పుడు రెండేళ్లు తిరగకుండానే చంద్రబాబు ప్రభుత్వం రూ.3.30 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసినా పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పథకాలను ఇంటివద్దకే అందిస్తే.. ఇప్పుడు అంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. సాగుతోందని మండిపడ్డారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డా.. చంద్రబాబు ‘నో యాక్షన్‌’..! మహిళలపై కూటమి ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నసీర్, కూన రవికుమార్‌ అఘాయిత్యాలపైనా... బాబు ‘నో యాక్షనే..!’ అంటూ ధ్వజమెత్తారు. 

మన పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని.. జగన్‌ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, పార్టీలో అందరినీ కూడగట్టి ముందుకు సాగుతున్న చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఏడాదిన్నరగా ఆయన అంకితభావంతో పని చేస్తున్నారని అభినందించారు. ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా చాలా చురుగ్గా పని చేస్తున్నారని ప్రశంసించారు. 

దేవుడి దయ, అందరి ఆశీస్సులుంటే ఆయన ఇంకా ఎదుగుతారని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా శ్రేణులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబుతో పాటు పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

మేనిఫెస్టో విశిష్టతను చాటాం... 
మన హయాంలో చరిత్రలో కనీవిని ఎరుగని మంచి చేశాం. మేనిఫెస్టో విశిష్టతను చాటి చెప్పాం. మేనిఫెస్టో అంటే ఏదో ప్రజలను నమ్మించడానికి కాదు. అదో చెత్త పేపర్‌ అన్న ముద్ర నుంచి దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించేలా పని చేశాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో ఏడాది కాలంలోనే 99 శాతం హామీలను అమలు చేసి ప్రజల్లో గుర్తుండిపోయేలా మంచి పరిపాలన చేశాం. అందుకే ఈరోజుకీ గర్వంగా కాలర్‌ ఎగరేసుకుని తిరగ్గలం.  

క్యాలెండర్‌ ప్రకటించి పథకాలు అమలు..
రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలన గురించి  ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. మనది సుపరిపాలన అయితే.. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయం. ఎక్కడా దేన్నీ వదలడం లేదు. ప్రజలకు మేలు చేయడం లేదు.  నాడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు  ట్రెజరీ (ఖజానా)లో రూ.100 కోట్లు కూడా లేవు.  రెండేళ్లు కోవిడ్‌తో అంతా అతలాకుతలం. ఒకవైపు ఆదాయం తగ్గింది. మరోవైపు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అలాంటి ఆర్థిక చిన్నాభిన్నం మధ్య మన వైఎస్సార్‌సీపీ పాలన సాగింది. అయినా కూడా ఏనాడూ ఆ సాకు చూపలేదు. ముందుగానే క్యాలెండర్‌ ప్రకటించి పథకాలు అమలు చేశాం. క్రమం తప్పకుండా బటన్‌ నొక్కి ప్రజలకు మేలు చేశాం. హామీలన్నీ అమలు చేశాం.

రెండేళ్లలోనే రూ.3.30 లక్షల కోట్ల అప్పులు..
మన ఐదేళ్ల పాలనలో దాదాపు రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే, అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. ఆ వివరాలన్నీ ఆధార్‌తో సహా చెప్పగలం. అదే ఈ రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం అప్పులు రూ.3.30 లక్షల కోట్లు దాటాయి. అయినా కూడా హామీల అమలు లేదు. మనం ఇచ్చిన పథకాలన్నీ రద్దయ్యాయి. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ మోసాలుగా తేలిపోయాయి. బటన్లు లేవు.. ప్రజలకు ఇచ్చిందీ లేదు..! మనం ఐదేళ్లలో చేసిన అప్పులు.. చంద్రబాబు రెండేళ్లలోనే దాటేశారు. మరి ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతోంది? ప్రజలంతా దీన్నే చర్చించుకుంటున్నారు.  

అంతా జేబులు నింపుకొంటున్నారు..
దోచుకో... పంచుకో... తినుకో...!  ఈరోజు ప్రతి అడుగులో ఇదే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో ఏదీ జరగడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయాలూ  రావడం లేదు. లిక్కర్‌ మాఫియాతో మొదలు పెడితే ఇసుక, మట్టి, మద్యం, సిలికా, క్వార్ట్జ్, ల్యాటరైట్, గ్రానైట్‌.. అన్ని వనరులూ దోచేస్తున్నారు. అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటున్నారు. అమరావతిలో చదరపు అడుగు రూ.10 – 12 వేల చొప్పున నిర్మాణం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు ఇచ్చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలురానివ్వకుండా, మీ సొంత జేబులు నింపుకుంటుంటే ఖజానా దివాలా తీయకుండా ఏమవుతుంది?  

ప్రభుత్వ మైండ్‌సెట్‌ సరిగా లేదు కాబట్టే..
ఈ ప్రభుత్వ మైండ్‌సెట్‌ సరిగా లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే.. విద్యా రంగాన్ని నాశనం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం తీసేశారు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. టోఫెల్‌ శిక్షణ లేదు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు లేరు. విద్యాదీవెన, వసతి దీవెన లేవు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. పేదలకు ఉచిత వైద్యం లేదు. ఆరోగ్యశ్రీ గాలికెగిరిపోయింది. 

నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్యం చేయడం లేదు. రూ.6 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. వీరి మైండ్‌సెట్‌.. పేదలు, అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలని కాదు. చివరకు మహిళలకు సున్నా వడ్డీని కూడా చంద్రబాబు ఎగ్గొట్టాడు. మనం అమలు చేసిన చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు... ఇవాళ ఏదీ కనిపించడం లేదు. 31 లక్షల ఇళ్ల పట్టాలు, 20 లక్షల ఇళ్ల మంజూరు... 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం... ఇప్పుడు ఏవీ లేవు. పాలనపై ధ్యాస లేదు. అంతా దోచుకో.. పంచుకో...తినుకో.. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ!

హాజరైన ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు

జగన్‌ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం
ఈ ప్రభుత్వంలో చూస్తుండగానే మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇక మిగిలింది రెండు బడ్జెట్లు మాత్రమే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. ఏడాదికి పైగా నేను ప్రజల్లో ఉంటా. మన కార్యకర్తలంతా ప్రజలకు తోడుగా నిలబడి వారి సమస్యలపై పోరాడాలి. లీగల్‌ సెల్‌ను పటిష్టం చేశాం. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది. రాబోయేది మనందరి ప్రభుత్వం. జగన్‌ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. ప్రతి ఒక్కటీ వారి ద్వారానే అమలు చేస్తాం.

ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ..?
టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌... డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డ ఏకైక పార్లమెంట్‌ సభ్యుడు. పార్లమెంటు చరిత్రలో గతంలో ఇలాంటివి ఎన్నడూ లేవు. ఇది చంద్రబాబు అనుసరించే వైఖరితో మొదలైంది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నాడు? ఏం చేశాడు? అని చూస్తే ఎక్కడా డ్రగ్స్‌ను నియంత్రించలేదు. ఒక పాలకుడు, నాయకుడికి ఉండాల్సిన గుణాలు చంద్రబాబులో ఎక్కడా కనిపించవు. అందుకే విచ్చలవిడిగా అరాచకాలు జరుగుతున్నాయి. రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అత్యాచారం చేశాడని, ఆపై మోసం చేశాడని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మరి ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ? అని అడుగుతున్నా... నో యాక్షన్‌...! కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మీద ఏం చర్యలు తీసుకున్నావు చంద్రబాబూ..? నో యాక్షన్‌...! మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే నసీర్‌ మీద ఏం చర్యలు తీసుకున్నావు..? నో యాక్షన్‌...! టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు? నో యాక్షన్‌! మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ! అక్కడా నో యాక్షన్‌! పైగా బాధితురాలి మీద తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టారు. ఎమ్మెల్యేలు, లీడర్ల కథ దేవుడెరుగు.. కనీసం పీఏల మీద కూడా చర్యలు తీసుకోలేకుండా ఉన్నాడు. 

ప్రస్తుత టీటీడీ చైర్మన్‌ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ, ఫొటోలతోనూ అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబు ఏం చేశాడు..? నో యాక్షన్‌...! బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు డ్రగ్స్‌ తీసుకుంటూ హైదరాబాద్‌లో పట్టుబడితే నో యాక్షన్‌... చంద్రబాబు కుమారుడు స్విమ్మింగ్‌పూల్‌ వద్ద తాగుతూ, తూగుతూ అమ్మాయిలతో డ్యాన్స్‌.. నో యాక్షన్‌..! ఇంకా చంద్రబాబునాయుడు బావమరిది, బాలకృష్ణ ఏమన్నాడు...? అమ్మాయి కనబడితే కడుపైనా చేయాలి... లేదా ముద్దు అయినా పెట్టాలి...అని! ఆయన అంత దారుణంగా మాట్లాడితే, చెంప పగలగొట్టకుండా.. హాహా! అని నవ్వుతారు. వీటన్నింటి మీదా చర్యలు తీసుకోని చంద్రబాబు ఏమన్నారు? తాను అవన్నీ చిన్నప్పుడే అంతకంటే బాగా చేశానని చెప్పుకొచ్చారు!

గుండె ధైర్యం.. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ మార్క్‌
విలువలు, విశ్వసనీయతే మన పార్టీ పునాదులు
‘‘మనమంతా కలసికట్టుగా, ఒక్కటై ఈ పార్టీని నిర్మించుకున్నాం. ఈ పార్టీ జగన్‌ ఒక్కడిదే కాదు.. వైఎస్సార్‌ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై, మనమంతా కలసి ఈ పార్టీని నిర్మించుకున్నాం. విలువలు, విశ్వసనీయత అన్న రెండు పదాల మీదే మన పార్టీ పుట్టింది, నడుస్తోంది. మన పార్టీ ఎప్పటికీ విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయతకు పెద్దపీట వేస్తుంది. పోరాటాలు మనకు కొత్త కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ మార్క్‌. మన పార్టీ చరిత్ర, 15 ఏళ్ల ప్రయాణం చూస్తే.. కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉన్నాం. విపక్షంగానే మొదలయ్యాం. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు మరింత తోడుగా, దగ్గరగా ఉండాలి...’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement