కేసీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు

VHP Complaints About KCR To Chief Electoral Officer Rajat Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ఎన్నికల సంఘానికి విశ్వహిందు పరిషత్‌(వీహెచ్‌పీ) ఫిర్యాదు చేసింది.  ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ బహిరంగ సభలో హిందువులను అవమానించేలా మాట్లాడిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ను కోరింది. ఆ సభలో ‘హిందూ గాళ్లు, బొందు గాళ్లు.. దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది’అంటూ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యానించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది.
(16మంది ఎంపీలను గెలిపిస్తే అగ్గి రాజేస్త) 
అంతేకాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్డును కూడా కించపరిచారని, జాతీయ సమగ్రతకు భంగం కలిగేలే మాట్లాడిన కేసీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ బృందం రజత్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేసింది. లిఖితపూర్వ ఫిర్యాదుతో పాటు, కేసీఆర్‌ ప్రసంగానికి సంబంధించిన సీడీని కూడా సమర్పించింది. 

నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు
వీహెచ్‌పీ ఇచ్చిన ఫిర్యాదుపై రజత్‌ కుమార్‌ స్పందించారు. కరీంనగర్‌ జిల్లా ఎన్నికల అధికారులను నివేదిక కోరుతూ ఆదేశాలు జారీ చేశారు. నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వీహెచ్‌పీ బృందానికి హామీ ఇచ్చారు. రజత్‌ కుమార్‌ను కలిసిన బృందంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌, భజరంగ్‌ దళ్ రాష్ట్ర కన్వీనర్‌ సుభాష్‌ చందర్‌, ముఖేష్‌ సీనియర్‌ న్యాయవాది కరుణాసాగర్‌, గిరిధర్‌, వీహెచ్‌పీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top