మత విద్వేషాలకు చంద్రబాబు, పవన్‌ కుట్ర

Velampalli Srinivas Fires On Chandrababu and Pawan kalyan - Sakshi

అన్యమత ప్రచార ఆరోపణలపై చర్చకు సిద్ధమా?

దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి 

సాక్షి, అమరావతి: మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కుట్రలు చేస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేక అన్యమత ప్రచారం అంటూ ఆరోపణలకు దిగుతున్నారని తెలిపారు. పార్ట్నర్స్‌ ఇద్దరు వేరువేరుగా చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమా? అని మంత్రి సవాల్‌ విసిరారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్రిటిష్‌ వారి విభజించు పాలించు పాలసీని నల్ల దొరలు చంద్రబాబు, పవన్‌లు అనుసరిస్తున్నారన్నారు. సోషల్‌ మీడియాలో, పచ్చ మీడియాలో కావాలని చంద్రబాబు, పవన్‌.. సీఎంపై విష ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

హిందూ దేవాలయాలు, అర్చకుల అభివృద్ధికి రూ.234 కోట్లు మొదటి బడ్జెట్‌లో కేటాయించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దని చెప్పారు. చంద్రబాబు ఇసుక దీక్షకు 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో 15 మంది రాలేదని, దీక్షకు వారి మద్దతు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి అన్ని విధాలుగా అడుగులు వేస్తూ.. సీఎంపై మతపరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ భవానీ ఐల్యాండ్‌లో 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు నిర్మాణం చేసిన తోరణం చూసి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారన్నారు.

అర్చకులకు చంద్రబాబు ఏనాడైనా మేలు చేశారా?: మల్లాది విష్ణు
చంద్రబాబు విజయవాడలో 40 దేవాలయాలు కూలదోస్తే, సీఎం వైఎస్‌ జగన్‌ నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్‌ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అర్చకుల మేలు గురించి ఏనాడైనా చంద్రబాబు ఆలోచించారా? అని ప్రశ్నించారు. అర్చకులకు సంబంధించిన జీవో నంబర్‌ 76ను ఎందుకు అమలు చేయలేదని విష్ణు నిలదీశారు. అవినీతి రాజధాని కాంట్రాక్ట్‌ పనిలో రూ.150 కోట్లు లంచం తీసుకున్న నేత ఎవరో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. సోషల్‌ మీడియాలో మితిమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు రోడ్లపైకి వచ్చి గగ్గోలు పెట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top