
వసుంధరా రాజే (పాత చిత్రం)
సాక్షి, జైపూర్ : ఉప ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అప్రమత్తమయ్యారు. తన కుర్చీకే ఎసరుపడే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఆమె నేతృత్వంలో పార్టీ లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు.
‘‘ఈ ఓటమి మాకు మేలు కొలుపు లాంటిది. అందుకే అప్రమత్తమయ్యాం. అభివృద్ధి పనులు జరుగుతున్నా ఇంత దారుణమైన ఫలితం ఎందుకొచ్చిందో సమీక్షించబోతున్నాం’’ అని సమావేశానికి ముందు ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాది ఎన్నికలు ఉన్న ఆమె నేపథ్యంలో సమావేశంలో నేతలకు ధైర్యాన్ని నూరిపోసినట్లు సమాచారం.
ఓటమి గురించి వదిలేయండి. అధైర్య పడవద్దు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కండి. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించండి. ఎట్టి పరిస్థితుల్లో విజయం మనదే కావాలి అని నేతలతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓటమికి బాధ్యుల్ని చేస్తూ సీఎం వసుంధర రాజేతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్ణమిని మార్చాలనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
కాగా, ఫిబ్రవరి 1న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా అజ్మీర్, అల్వార్ లోక్ సభ స్థానాలను, మండల్‌గఢ్ శాసన సభ సీటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఓటమితో బీజేపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీఎం వసుంధరా రాజే రాజీనామాకు డిమాండ్ చేస్తోంది.