బాబును కాపాడేలా ‘సోమయాజులు’ నివేదిక

Vasireddy Padma Fires On Somayajulu Committee Report and Chandrababu - Sakshi

     వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం 

     టీడీపీ కార్యాలయంలో కూర్చుని నివేదిక రూపొందించారా? 

     ఇంత దౌర్భాగ్యమైన నివేదికను ఎప్పుడూ, ఏ కమిషనూ ఇవ్వలేదు

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, భక్తుల మరణంపై జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ ఇచ్చిన నివేదిక సీఎం చంద్రబాబును కాపాడే రీతిలో, వాస్తవాలను మరుగుపర్చేలా ఉండడం దారుణమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.  ఆ దుర్ఘటనకు సంబంధించిన ఆధారాలను పరిశీలించకుండానే టీడీపీ కార్యాలయంలో కూర్చుని నివేదికను రూపొందించారా? అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబే దీన్ని తయారుచేసి, సోమయాజులు చేత సంతకం పెట్టించి ఉంటారన్నారు. ఇలాంటి ఏకపక్ష నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వాసిరెడ్డి పద్మ బుధవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు గుడ్డినమ్మకంతో, ఇంగితం మరిచి పుష్కరాలకు వచ్చారని సోమయాజులు కమిషన్‌ నివేదికలో పేర్కొనడం దారుణం.

మీడియా తప్పుడు ప్రచారం వల్ల, మూఢ విశ్వాసాల వల్ల తొక్కిసలాట జరిగిందని చెప్పడాన్ని చూస్తే ఇది అసలు కమిషనేనా లేక చంద్రబాబును కాపాడటానికి ఇచ్చిన రిపోర్టా అన్న అనుమానం కలుగుతోంది. ఇంత దౌర్భాగ్యమైన నివేదికను ఎప్పుడూ, ఏ కమిషనూ ఇవ్వలేదు. తప్పంతా మీడియా, భక్తులపైనే నెట్టడం సమంజసం కాదు. దుర్ఘటన జరిగిన మరుసటి రోజు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను కమిషన్‌ పట్టించుకోలేదు. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిసిన తర్వాతే చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారని జిల్లా పోలీసు అధికారి కూడా తెలిపారు.

ఇన్ని ఆధారాలు కళ్లముందు ఉన్నా, చంద్రబాబును కాపాడే రీతిలో కమిషన్‌ నివేదిక ఇవ్వడం దారుణం’’ అని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు ప్రచార యావ వల్లే ఇంత ఘోరం జరిగితే, సోమయాజులు కమిషన్‌.. ప్రతిపక్షాలను తప్పుబట్టడం ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నవాళ్లను కాపాడడమే కమిషన్‌ కర్తవ్యంగా పెట్టుకుంది. కనీస మానవత్వం కూడా లేకుండా కమిషన్‌ చేత తప్పుడు నివేదిక ఇప్పించిన చంద్రబాబును ప్రజలు క్షమించరు. ఈ నివేదికను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’’ అని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top