నన్ను సస్పెండ్‌ చేసేంత సీన్‌ లేదు!

Vallabhaneni Vamsi Challenge to Chandrababu - Sakshi

దమ్ముంటే బీజేపీలో చేరిన ఎంపీల్ని సస్పెండ్‌ చెయ్యి.. 

చంద్రబాబుకు వల్లభనేని వంశీ సవాల్‌ 

లోకేష్‌ దద్దమ్మ.. టీడీపీకి పెద్ద గుదిబండ 

సాక్షి, అమరావతి: చంద్రబాబుకు తనను సస్పెండ్‌ చేసేంత సీను లేదని, దమ్ముంటే బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేయాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్‌ విసిరారు. ఆ రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకున్నందుకు మోదీ, అమిత్‌షా ఇంటి వద్ద చంద్రబాబు దీక్ష చేయాలన్నారు. విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పార్టీకి రాజీనామా చేశాక నన్ను సస్పెండ్‌ చేయడమేంటి?. వయసు మీద పడడంతో చంద్రబాబు మతి చలించి మాట్లాడుతున్నాడు. కొడుకుని గెలిపించుకోలేకపోయాడు. లోకేష్‌ ముద్ద పప్పు.. అతన్ని మాపై రుద్దాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు. టీడీపీకి లోకేష్‌ పెద్ద గుదిబండ, స్పీడ్‌ బ్రేకర్‌ అని, అతని వల్ల పార్టీ ముందుకు వెళ్లలేదని వంశీ విమర్శించారు. తాను బయటికెళ్తే టీడీపీకి నష్టం లేదని, లోకేష్‌ పార్టీలో ఉంటేనే పెద్ద నష్టమని పేర్కొన్నారు.  

జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకుని వదిలేశారు 
జూనియర్‌ ఎన్టీఆర్ను ఎన్నికల తర్వాత పట్టించుకోలేదని, ఆ కుటుంబాన్ని అవసరానికి వాడుకుని వదిలేశారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘తన రెండెకరాల పొలంతోనే చంద్రబాబు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారా? వ్యవసాయం చేసి పార్టీ ఫండ్‌ ఏమైనా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్‌లు తనపై పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. లోకేష్‌ చచ్చు దద్దమ్మ కాబట్టే మంగళగిరిలో ఓడిపోయాడని, సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని లోకేష్‌ బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్ అంటే లోకేష్‌కు భయమని.. ఎన్ని జన్మలెత్తినా జూనియర్‌ ఎన్టీఆర్ అంతటివాడు కాలేడన్నారు. ముఖ్యమంత్రి కావాలని లోకేష్‌, ప్రధాని కావాలని చంద్రబాబు పళ్లు రాలగొట్టుకున్నారని విమర్శించారు. తనను ఎవరూ ప్రభావితం చేయలేరని, మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటానన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేసింది కాబట్టి అభినందించానని, తన నియోజకవర్గం కోసం వైఎస్సార్‌సీపీలో చేరుతున్నానని తెలిపారు.  

టీడీపీ వెబ్‌సైట్‌ నుంచే నాపై దు్రష్పచారం 
అమ్మాయిల మారి్ఫంగ్‌ ఫొటోలను జతచేసి సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన ఓ వెబ్‌సైట్‌ నుంచి ఈ దు్రష్పచారం జరుగుతోందని, తన కుటుంబాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top