కేసీఆర్‌ను గద్దె దించేది కాంగ్రెస్సే | Uttamkumar Reddy Comments On KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను గద్దె దించేది కాంగ్రెస్సే

May 25 2019 1:19 AM | Updated on Sep 19 2019 8:44 PM

Uttamkumar Reddy Comments On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎప్పటికైనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించే సత్తా ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ మాత్రమే ప్రత్యామ్నాయమని తేల్చిచెప్పారు. టీఆర్‌ఎస్‌ను దించే స్థాయి బీజేపీకి లేదని, అదృష్టం కొద్ది మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లలో డిపాజిట్లు దక్కలేదని, స్థానికంగా ఆ పార్టీ ఎంత బలంగా ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. శుక్రవారం ఇక్కడ తన నివాసంలో కలసిన విలేకరులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పునాదులను తక్కువగా అంచనా వేశారని, తెలంగాణలో మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్‌ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందన్నారు.

నిజానికి తమ పార్టీ ఆరు సీట్లు గెలవాల్సి ఉందని, కొద్దిలో తమ అభ్యర్థులు ఓడిపోయారన్నారు. గెలిచిన వారంతా డైనమిక్‌ లీడర్‌లేనని అన్నారు. ఈ గెలుపుతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. రాజకీయాల్లో అహంకారం పనికిరాదని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహంకారానికి ఈ ఎన్నికలు గుణపాఠం చెప్పాయన్నారు. పీసీసీ మార్పుపై ఇంతవరకు ఎలాంటి చర్చ లేదని, తనకు ఏ బాధ్యత ఇస్తే దాన్ని నిర్వర్తిస్తానని, బాధ్యతలు లేకున్నా కార్యకర్తగా పనిచేస్తానన్నారు. కాంగ్రెస్‌ నుండి ఎవరు బయటకు పోయినా నష్టం లేదని లోక్‌సభ ఫలితాలు రుజువు చేశాయన్నారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని, ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్లు కూడా కాంగ్రెస్‌కు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.   

ఫలితాల వాయిదా హర్షణీయం: ఉత్తమ్‌ 
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వాగతించారు. ఫలితాలను వాయిదా వేయాలంటూ అఖిలపక్షం చేసిన పోరాటం ఫలించిందన్నారు. అప్రజాస్వామిక పద్ధతులకు స్వస్తి పలకాలని కాంగ్రెస్‌ చేసిన విన్నపాన్ని ఎస్‌ఈసీ అంగీకరించడం హర్షణీయ మని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ఆధ్వర్యాన ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం చేసిందని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ పేర్కొన్నారు. కోర్టుతీర్పు ప్రతికూలంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నికల ఫలితాలను వాయిదా వేయించిందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement