
సాక్షి, హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 30 వేల మెజారిటీ రాకుంటే.. ఏ శిక్షకైనా సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒక్కసారి రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్త పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తను మొత్తంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని గుర్తుచేశారు. అందులో హుజూర్‌నగర్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచానని తెలిపారు. ఇక్కడ తాను చేసిన అభివృద్ధి తప్పితే ఇంకేమీ లేదన్నారు.
2009 -2014 మధ్య కాలంలో హుజూర్‌నగర్‌లో రూ. 2 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పారు. మట్టపల్లి దగ్గర కృష్ణా నదిపై రూ. 50 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 50 లక్షలు వెచ్చించి అప్రోచ్ రోడ్డు పూర్తిచేయలేదని ఎద్దేవా చేశారు. 2014 నుంచి హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ఏం పని చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న మంత్రి కేటీఆర్.. పదవుల కోసమే ఇక్కడకు వచ్చాడని విమర్శించారు. తాను 16 ఏళ్ల వయస్సులోనే సైన్యంలో చేరానని తెలిపారు.
టీఆర్‌ఎస్ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తారని.. అలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పార్టీని బొంద పెట్టాలని మాదిగలకు పిలుపునిచ్చారు. అతి పెద్ద సామాజిక వర్గమైన మాదిగలకు కేబినెట్‌లో చోటు లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థులను మోసం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 24 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. వారికి నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. టాస్క్ ఫోర్స్ టీమ్‌లు.. సర్పంచ్‌లను ఎత్తుకుపోతారా అని నిలదీశారు.