‘అన్ని వర్గాల ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టారు’

Uttam Kumar Reddy Slams TRS Over State Formation Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఇచ్చే నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు రూ. 3 లక్షల కోట్లు అప్పులు చేశారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా మంగళవారం కాంగ్రెస్‌ నాయకులు గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, విహెచ్‌ దామోదర్‌ రాజా నర్సింహ, షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, కుసుమ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమకుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రక దినం అన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కోరికను సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేరవేర్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలు జరిగాయని చెప్పిన నాయకులు ఇప్పుడు నియంత పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనతో  అన్ని వర్గాలు కష్టాలు పడుతున్నారని దుయ్యబట్టారు. (రాష్టంలో దుర్మార్గమైన పాలన సాగుతోంది‌)

యువతకు ఉద్యోగాలు రావడం లేదని, తెలంగాణ వచ్చిన రోజు 12 లక్షల నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 24 లక్షలకు చేరిందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు అన్ని పెండింగులో ఉన్నాయని ఉత్తమ్‌ మండిపడ్డారు. ఒక్క ప్రాజెక్టు దగ్గర తట్టెడు మట్టి పోయలేదు కానీ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆరోపించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కూడా ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని విమర్శించారు.  ఏటా రూ. 36 వేల కోట్లు వడ్డీలు కడుతున్నామంటే ఎన్ని అప్పులు చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. (తాకట్టులో సాగరిక.. విడిపించిన మాజీ ఎంపీ)

ఈ రోజు కృష్ణ నది ప్రాజెక్టుల సందర్శనకు కాంగ్రెస్ నాయకులు పోతామంటే పొద్దున్నే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 2014 నాటి నుంచి కృష్ణ ప్రాజెక్టులు పెండింగులో పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ సాధన ఏ లక్ష్యాలతో సాధించామో వాటన్నింటిపైనా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ  సందర్బంగా కోట్లాది ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ధన్యవాదాలు తెలిపారు. చివరగా తెలంగాణ అమరవీరులకు సంతాప సూచికంగా 2 నిమిషాలు కాంగ్రెస్‌ నేతలంతా మౌనం పాటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top