ఎన్‌డీఏకు కుష్వాహా గుడ్‌బై

Upendra Kushwaha Goodbye to NDA - Sakshi

ప్రతిపక్ష కూటమిలో చేరేందుకు సిద్ధమని ప్రకటన

బీసీలను నిర్లక్ష్యం చేశారంటూ ప్రధానిపై విమర్శలు

న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా అధికార ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకున్నారు. కేంద్ర మానవ అభివృద్ధి వనరుల సహాయ మంత్రిగా ఉన్న కుష్వాహా సోమవారం తన పదవికి రాజీనామా చేయడంతోపాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించారు. మంత్రి వర్గాన్ని ప్రధాని మోదీ రబ్బర్‌ స్టాంపుగా మార్చేశారనీ, వెనుకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేశారని తన రాజీనామా లేఖలో ఆరోపించారు. తమ పార్టీ బిహార్‌లోని ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన ప్రతిపక్ష కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.  

ఊహించిన పరిణామమే
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై బీజేపీతో విబేధాలు తలెత్తిన నేపథ్యంలో ఆర్‌ఎల్‌ఎస్‌పీ అధ్యక్షుడు కుష్వాహా ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. సోమవారం కుష్వాహా తన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘ప్రధాని మోదీ నాయకత్వంలో నిర్లక్ష్యానికి, మోసానికి గురైనట్లు భావిస్తున్నా. పేదల సంక్షేమం కోసం పనిచేయడం మాని, రాజకీయ విరోధులను అణచి వేయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బిహార్‌లో ఒక్క సీటు కూడా ఎన్‌డీఏకు దక్కదు’ అని అందులో పేర్కొన్నారు. ఆర్‌ఎల్‌ఎస్‌పీకి ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ఎమ్మెల్యేలిద్దరూ పార్టీని వీడారు.

కుష్వాహా ప్రభావం ఎంత?
కుష్వాహా చేసిన రాజీనామా ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న కోయిరీ(కుష్వాహా) కులానికి చెందిన నేత కుష్వాహా. బీసీ వర్గమైన కోయిరీలు ఈ రెండు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోనూ ఉన్నారు. బిహార్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని కూటమిలో ఆర్‌ఎల్‌ఎస్‌పీ చేరి, తర్వాత బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమిలో చేరితే హిందీ ప్రాంతాల్లోని కోయిరీలపై ఎంత వరకు ప్రభావం ఉంటుందో చెప్పడం కష్టం.

అదే బాటలో మరో పార్టీ!
ఎన్‌డీఏలోని మరో పక్షం అసోం గణపరిషత్‌ (ఏజీపీ) నడిచే అవకాశముంది. పౌరసత్వ సవ రణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదిస్తే ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతామంటూ హెచ్చరించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top