హైకోర్టు విభజనపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

Union Minister's key statement on division of High Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. విభజన చేస్తే ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు చెందుతుందని తెలిపారు. ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర కొత్త రాజధానిలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి నాలుగు భవనాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు. అందులో ఏదో ఒకటి ఖరారు చేయాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారని వివరించారు. భవనాలు సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరపాలని, హైకోర్టును తాత్కాలికంగా మార్చగలం కానీ శాశ్వతంగా మార్చడానికి చాలా సమయం పడుతుందని వెల్లడించారు. అంతవరకు పరస్పరం ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని రెండు రాష్ట్రాలను కోరుతున్నానని విన్నవించారు. న్యాయమూర్తుల నియామకం, పదోన్నతులు తమ పరిధిలోని అంశం కాదని, నియామకలన్నీ కొలీజియమే చేస్తుందని పేర్కొన్నారు. పదోన్నతులు నిలిపివేయాలన్న విషయంపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. 

నాలుగు భవనాలను ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా ముందుకు రావడం సంతోషం అయితే విభజన జరిగే వరకు న్యాయమూర్తుల పదోన్నతులు చేయవద్దని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కేంద్రమంత్రికి విన్నవించారు. హైకోర్టు విభజన ఒక్కటే సమస్య కాదు. విభజన చట్టంలో అనేక పెండింగ్ అంశాలున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు, ఇంకా చాలా అంశాలు పరిష్కరించాల్సి ఉన్నాయని మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలని, ఆ సమావేశం ఏర్పాటు చేసేందుకు తాము రెడీగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top