టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగిన భూపతి

TRS MLC Bhupathi Reddy Slams KCR In Nizamabad - Sakshi

నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో అసమ్మతి రాగం వినిపించారు. పార్టీ అధినేత కేసీఆర్‌పై భూపతి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పని చేస్తానని కుండబద్దలు కొట్టి చెప్పారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌ను ఓడిస్తానని వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని, టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇచ్చినా పోటీ చేయనని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తా..ఏ పార్టీ అనేది త్వరలో చెబుతా, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని తెలిపారు. అలా చేయకపోతే రాజీనామా చేయనన్నారు. తాను తప్పు చేస్తే ఎందుకు సస్పెండ్‌ చేయరని ప్రశ్నించారు. క్షమాపణ ఎందుకు చెప్పరు.. పొమ్మన లేక పొగ పెడుతున్నారని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ ఏ ముఖం పెట్టుకుని ముందస్తు ఎన్నికలకు పోతుందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పతనం నిజామాబాద్‌ నుంచే మొదలవుతుందని శాపనార్థాలు పెట్టారు. కేబినేట్‌లో 70 శాతం మంది కేసీఆర్‌ను తిట్టిన వారే ఉన్నారని వెల్లడించారు. ఉద్యమ ద్రోహులకు కేసీఆర్‌ పెద్దపీట వేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులను పథకం ప్రకారం టీఆర్‌ఎస్‌ పక్కన పెడుతోందని, టీఆర్‌ఎస్‌ చెప్పిందే వినాలి..లేకపోతే ద్రోహులు అనే ముద్ర వేసే పద్ధతి అవలంబిస్తున్నారని అన్నారు.

నీళ్లు, నిథులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆ మూడూ జరగడం లేదని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకులు జూన్‌ రెండున నివాళులు అర్పిస్తుంటే బాధ కలుగుతోందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన ఓ యువకునికి కేసీఆర్‌ ఇంతవరకూ నష్టపరిహారం మంజూరు చేయలేదని వెల్లడించారు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని అమరవీరులు, విద్యార్థులు, మేథావులు, కళాకారులు, జనాలు ఆశించారో అవేమీ నెరవేరలేదని భూపతిరెడ్డి విమర్శించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top