‘ట్రక్‌’ గుర్తు చేటుపై ..తర్జన భర్జన! | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 16 2018 7:41 AM

TRS Leader Vemula Veeresham Raises Objections Over Nakrekal Election - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయడమే కాదు, కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీలను గణనీయంగా తగ్గించిన ‘ట్రక్‌’ గుర్తు చేసిన నష్టంపై అధికార పార్టీలో తర్జన భర్జన నడుస్తోంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ నాలుగు చోట్ల విజయం సాధించగా, మునుగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఎస్‌ఎఫ్‌బీ) పార్టీకి ఈ ఎన్నికల్లో ట్రక్‌ గుర్తును కేటాయించారు. ఇది టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలి ఉండడంతో గ్రామీణులు, ముఖ్యంగా నిరక్షరాస్యులు ట్రక్‌ గుర్తును చూసి కారనుకున్నారన్న వాదన టీఆర్‌ఎస్‌ వర్గాలనుంచి వినిపిస్తోంది. ఎస్‌ఎఫ్‌బీ పార్టీనుంచి అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో ట్రక్‌ గుర్తును కోరుకున్న స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు.

ప్రధానంగా వయో వృద్ధులు ఈ గుర్తు విషయంలో చాలా గందరగోళానికి గురయ్యారని, తమ పార్టీ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు ట్రక్‌ గుర్తుకు పడ్డాయని టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొంటున్నారు. ఎస్‌ఎఫ్‌బీ పార్టీ నుంచి పోటీలో నిలబడిన వారు ఎవరూ నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రచారం చేయలేదని, విస్తృతంగా ప్రచారం చేసిన బీజేపీ, సీపీఎం వంటి పార్టీలకన్నా ఎక్కువ ఓట్లు ట్రక్‌ గుర్తున్న అభ్యర్థులకు పోలయ్యాయని చెబుతున్నారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో అత్యధిక పర్యాయాలు సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. తొలి ఎన్నికల నుంచి 2014 ఎన్నికల దాకా కాంగ్రెస్‌ రెండు సార్లు, టీఆర్‌ఎస్‌ ఒకరి మాత్రమే గెలిచాయి.

కానీ, ఈ ఎన్నికల్లో సీపీఎం పోటీలో ఉన్నా, ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 4543 ఓట్లు రావడాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే ఎస్‌ఎఫ్‌బీ అభ్యర్థి ట్రక్‌ గుర్తుపై ఏకంగా 10,383 ఓట్లు పోల్‌ కావడాన్ని వీరు ఉదహరిస్తున్నారు. జిల్లాలో నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో 9818 ఓట్లు, మునుగోడులో 2279 ఓట్లు ఎస్‌ఎఫ్‌బీ అభ్యర్థులకు పోల్‌ కాగా, ట్రక్‌ గుర్తుపొందిన ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు ఉన్న మిర్యాలగూడలో 4,758, నల్లగొండ నియోజకవర్గంలో 2,932 ఓట్లు పోలయ్యాయి. ఈ అంశాలను విశ్లేషించుకున్న నేతలు కారు గుర్తును పోలిన ట్రక్‌ గుర్తు తమ అభ్యర్థుల మెజారిటీలు తగ్గించిందని, నకిరేకల్‌ నియోజకవర్గంలో ఏకంగా ఓటమికి కారణమైందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.

రీ ఎలక్షన్‌కు డిమాండ్‌
నకిరేకల్‌ నియోజకవర్గంలో ఓడిపోయిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల వీరేశం తన ఓటమికి  దారితీసిన ట్రక్‌ గుర్తు వ్యవహారంపై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాదులు, పార్టీ అధినాయకత్వంతో చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య 8,259 ఓట్ల మెజారిటీతో వేముల వీరేశంపై విజయం సాధించారు. అయితే, ట్రక్‌ రూపంలో తమ అభ్యర్ధికి 10,383 ఓట్లకు గండిపడిందన్నది టీఆర్‌ఎస్‌ నేతల అభిప్రాయం. ట్రక్‌ గుర్తు లేని పక్షంలో తమ అభ్యర్థి కనీసం 1500 నుంచి 2వేల ఓట్ల మెజారిటీతో గెలిచేవారని పేర్కొంటున్నారు.

జాతీయ స్థాయిలో రిజిస్టర్డ్‌ పార్టీ అయిన సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ తమ అభ్యర్థులకు కామన్‌ గుర్తుగా ‘ట్రక్‌’ను కోరడంలో ఒక వ్యూహం దాగి ఉందన్నది వీరి అభిప్రాయం. ఈ గుర్తు చేసే నష్టాన్ని అంచనా వేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులను పోటీలో లేకుండా కొందరు మేనేజ్‌ చేసుకున్నారని, అయినా, ఇండిపెండెంట్లకూ ఇదే గుర్తు కేటాయింపు జరగడంతో తమ మెజారిటీలు తగ్గాయని అంటున్నారు. ప్రత్యేకించి నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వేముల వీరేశం తమ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌ సరళిపై పూర్తి వివరాలు కావాలని జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్‌ను కోరారని తెలిసింది. అంతే కాకుండా గుర్తు చేసిన చేటు, గుర్తు కేటాయింపు తదితర అంశాలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెబుతున్నారు. తమ నియోజకవర్గానికి రీ ఎలక్షన్‌ జరిపించాలని ఈసీని కూడా డిమాండ్‌ చేస్తూ కేసు వేయనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Advertisement
Advertisement