టీఆర్‌ఎస్‌తోనే  కాళేశ్వరానికి జాతీయ హోదా 

Trs Can Only Bring National Status For Kaleshwaram Project - Sakshi

సాక్షి, అల్లాదుర్గం(మెదక్‌): కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీనే గెలిపించాలని జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం అల్లాదుర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం ఇస్తుందని, 10 శాతం రాష్ట్రం నిధులిచ్చి నిర్మిస్తుందని చెప్పారు. జాతీయ రహదారులు ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. సంగారెడ్డి నుంచి మంగ్లూర్‌ వరకు 161 జాతీయ రహదారిగా చేసి నాలుగులైన్ల రోడ్డుకు 3 వేల కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. దీనికి పక్కనే ఉన్న జాతీయ రహదారి పనులే నిదర్శనమన్నారు. బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యమని, అల్లాదుర్గంలో సీఎం కేసీఆర్‌ సభ విజయవంతం అయిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా బీబీ పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాశీనాథ్, అనిల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నారాయణ, టీవీ నటి ఉమా, జాగృతి అధ్యక్షురాలు మల్లిక, స్థానిక సర్పంచ్‌ అంజయ్య యాదవ్, సుభాశ్‌రావ్‌ పాల్గొన్నారు. వట్‌పల్లి మండల కేంద్రమైన వట్‌పల్లిలో జహీరాబాద్‌ శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బీబీ పాటీల్‌ అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి రోడ్‌షో చేపట్టారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బుద్దిరెడ్డి, సర్పంచ్‌లు సురేఖ, ఖయ్యుం, ఎంపీటీసీలు శివాజీరావ్, అప్పారావ్, కోఆప్షన్‌ సభ్యుడు కూత్బొద్దీన్, మార్కెట్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్, నాయకులు మధు, ప్రభాకర్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top