రహస్య మైత్రి పటిష్టానికే సీఎం టూర్‌: గూడూరు

Tpcc Leader Criticises KCR Over Delhi Tour - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీతో తన రహస్య మైత్రిని మరింత పటిష్టం చేసుకునేందుకే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకున్నారని, అది పూర్తిగా రాజకీయ పర్యటనే తప్ప తెలంగాణ ప్రజలకో సం కాదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి విమర్శించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన కేసీఆర్‌ అన్నీ పాత వినతిపత్రాలను ఇచ్చి వచ్చారని, గతంలో ఇచ్చిన వినతిపత్రాల విషయం ఏం చేశారని ప్రధానిని ప్రశ్నిం చాల్సింది పోయి మళ్లీ వాటినే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని సోమవారం ఒక ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన వినతిపత్రాలను మోడీ బుట్టలో పడేశారా? లేకుంటే పోగొట్టారా? అని ఎద్దేవా చేశారు.

ప్రధాని, ముఖ్యమంత్రి మాట్లాడుకున్న విషయాలను దాచిపెట్టి మీడియా ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అసలు వారిద్దరూ ఏం మాట్లాడారో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను కేసీఆర్‌ సమర్థిస్తుంటే, తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ అవినీతి కార్యకలాపాలకు మోదీ రక్షణగా ఉంటున్నారని, అసమర్థ ముఖ్యమంత్రి, అచేతన ప్రధానమంత్రికి రాజకీయ లబ్ధి తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. కేసీఆర్‌ నిజంగా మోదీతో ప్రజలకు సంబంధించిన అంశాలను మాట్లాడి ఉంటే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను మోదీ అంగీకరించారో లేదో చెప్పాలని, కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు, హైకోర్టు విభజన గురించి ఎలాంటి హామీలిచ్చారో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top