రేవంత్‌కు మంచి పదవి... కాంగ్రెస్‌లోకి నాగం?

TPCC chief Uttam Kumar comments on Revanth, Nagam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన రేవంత్‌రెడ్డికి, ఆయనతో కలిసివచ్చిన నేతలకు చల్లటి కబురు చెప్పారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. 2019 ఎన్నికల దృష్ట్యా పార్టీలో రేవంత్‌కు మంచి పదవి దక్కుతుందని, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల నర్సారెడ్డిలకు ఎమ్మెల్యే టికెట్లు ఖాయమని ఉత్తమ్‌ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా చిట్‌ చాట్‌తో మాట్లాడిన ఆయన పలు అంశాలతోపాటు నాగం చేరికపైనా స్పందించారు.

అన్నిస్థానాల్లో పోటీ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు‌, ఆయన తనయుడు రామారావులు ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వేల్‌, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని ఉత్తమ్‌ కుమార్‌ గుర్తుచేశారు. ఇక హరీశ్‌రావు నియోజకవర్గం సిద్ధిపేటలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలకు చెందిన మరికొంత మంది నాయకులు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌లోకి నాగం? : ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతోన్న పాలమూరు నేత నాగం జనార్థన్‌రెడ్డి త్వరలోనే హస్తం గూటికి చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే అంశాన్ని మీడియా ఉత్తమ్‌ వద్ద ప్రస్తావించగా.. సమాధానాన్ని దాటవేశారు. ‘‘నాగం చేరికపై నేను మాట్లాడలేను. నో కామెంట్‌’ అని అన్నారు. ‘కాంగ్రెస్‌లో చేరిక’  వార్తలను నాగం గతంలోనే ఖండించారు. అయినాసరే, పదే పదే ఆయన చేరికపై ప్రశ్నలు వినిపిస్తుండటం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top