కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం

TJC Leaders Criticize On KCR - Sakshi

మంచిర్యాలక్రైం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దెదించడమే లక్ష్యంగా తెలంగాణ జన సమితి అవిర్భవించిందని జిల్లా కన్వీనర్‌ మందల శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని టీజేఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ ఒక్కడే ఉద్యమం చేస్తే రాలేదన్నారు. రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్‌ కోదండరాం అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థ సంఘాల నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులను ఏకతాటిపై తెచ్చి ఉద్యమం నడపడం ద్వారానే రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. అనేక మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు, త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థుల ఆశయాలను, ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులకు కేసీఆర్‌ పట్టం కడుతున్నాడని మండిపడ్డారు.

ఎన్నికల్లో ఇచ్నిన హామీలను మరిచి స్వార్థపూరితమైన పథకాలను అమలు చేస్తూ  తమ ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు కలలు గన్న రాష్ట్రం ఇది కాదన్నారు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు మలిదశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ జన సమితి నిర్మాణంలో భాగంగానే జిల్లా విద్యార్థి విభాగం అడ్‌హక్‌ కమిటీని నియమించినట్లు తెలిపారు. కేసీఆర్‌ ఇప్పటికే ప్రభుత్వ విద్యను నీరుగార్చే కుట్రకు పూనుకున్నాడన్నారు 4800 పైగా ప్రభుత్వ పాఠశాలలను  మూసివేశారని అరోపించారు.

కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు, కార్పొరేట్‌  విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. అనంతరం జిల్లా అడ్‌హక్‌ కమిటీని, మందమర్రి పట్టణ కన్వీనర్‌ను నియమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా కో ఆర్డినేటర్‌ గడ్డం వెంకటేష్, జిల్లా సలహాదారు బాబన్న, జిల్లా కో కన్వీనర్‌ ఒడ్డెపల్లి మనోహర్, దుర్గం నరేష్, గోపాల్, క్యాతం రవికుమార్, ఎర్రబెల్లి రాజేష్, కుర్సింగ వెంకటేష్, రవికుమార్, కనకరాజు పాల్గొన్నారు.
 
టీజేఎస్‌వీ అడ్‌హక్‌ కమిటీ
తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా అడ్‌హక్‌ కమిటీని నియమించారు. కన్వీనర్‌గా చిప్పకుర్తి శ్రీనివాస్, కో కన్వీనర్లుగా పూరెల్ల నితిన్, గొడిసెల సురేందర్, సభ్యులుగా మామిడాల అరుణ్, ఆవునూరి ప్రసాద్, చిలుక శ్రావణ్, జక్కె ప్రశాంత్, భూక్య కిరణ్‌కుమార్, రమేష్, రామగిరి సాగర్‌లను నియమించారు. టీజేఎస్‌ మందమర్రి పట్టణ కన్వీనర్‌గా బండారి రవికుమార్‌ను నియమించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top