నేడే మూడో విడత

third phase elections today - Sakshi

14 రాష్ట్రాల్లోని 116 స్థానాలకు ఎన్నికలు

బరిలో రాహుల్, అమిత్‌ షా, జయప్రద, ములాయం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమయింది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ప్రజలు నేడు తేల్చనున్నారు. గుజరాత్‌(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్‌గఢ్‌(7), ఒడిశా(6), బిహార్‌ (5), బెంగాల్‌(5), గోవా(2), దాద్రనగర్‌ హవేలీ, డామన్‌డయ్యూ, త్రిపురలో చెరో స్థానానికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విడత ఎన్నికలు బీజేపీకి కీలకం కానున్నాయి.

ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఈ 116 స్థానాల్లో 66 సీట్లను కమలనాథులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కేవలం 27 సీట్లకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో అదే ఫలితాలను పునరావృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 14 రాష్ట్రాల్లో మొత్తం 2.10 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఏడో, చివరి విడత సార్వత్రిక ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఏడో విడతలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌ సహా 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 59 స్థానాలకు మే 19న ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 29 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top