ఎడారిలో దుమ్మురేపేదెవరో?

Tension In Rahul And Amit Shah on Rajasthan Elections - Sakshi

బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీ

ఓటర్లను బూత్‌లకు తీసుకురావడంపైనే దృష్టి

ఆరెస్సెస్‌పై బీజేపీ, సేవాదళ్‌పై కాంగ్రెస్‌ భారం

రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎన్నికల ఫీవర్‌ పెరిగిపోతోంది. ఈ రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు నెలకొని ఉండడంతో పై చేయి సాధించడానికి ఎవరికి వారే వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరెంత దూకుడు ప్రదర్శించినా పోలింగ్‌ రోజు బూత్‌ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ చెయ్యగలిగినవారే కింగ్‌లు. బీజేపీ ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచి వారు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చేలా చైతన్య పరచడం కోసం 10 లక్షల మందికిపైగా పార్టీ కార్యకర్తలను బూత్‌ వర్కర్లుగా నియమించింది. 7లక్షల మందికి పైగా పార్టీ సభ్యులు పోలింగ్‌ రోజు బూత్‌ దగ్గరే ఉండి పార్టీ ఓట్లు ఎటూ జారిపోకుండా చూస్తారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా బూత్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలో 13 లక్షల మందిని నియమించింది. జనం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా వీరు చర్యలు చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 51,796 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఒక్కో కేంద్రం వద్ద 27 మంది కార్యకర్తలు ఉండి పోలింగ్‌ క్షణం క్షణం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ రోజు కోసం రచించిన వ్యూహంలో ఏ మాత్రం తేడా రాకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన యూత్‌ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్‌ కార్యకర్తల్ని ముందు ఉంచి షో నడిపించనున్నారు.. ఇక బీజేపీ ఆరెస్సెస్‌ కేడర్‌ బలంపైనే ఆధారపడింది.

ముఖాముఖి పోరు
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోరు నెలకొని ఉండడంతో రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మూడో ప్రత్యామ్నాయం ఎక్కడా బలంగా లేకపోవడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఘన్‌శ్యామ్‌ తివారి, హనుమాన్‌ బేణివాల్‌ ఆర్‌ఎల్పీ వంటి పార్టీలు తమదే విజయమంటున్నాయి. 15 నియోజకవర్గాల్లో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వారిని స్వస్థలాలకు రప్పించి ఓటు వేయించడానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.

రాజే, గెహ్లాట్‌ దృష్టి బయటే!
ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌లు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంపైనే దృష్టి సారించారు. పార్టీ అభ్యర్థుల తరఫున వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజే తన సొంత నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను తన కుమారుడు, పార్టీ ఎంపీ అయిన దుష్యంత్‌ సింగ్, కోడలు నిహారిక రాజేలకు అప్పగించారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపుపైనే దృష్టి సారించిన గెహ్లాట్‌ (సర్దార్‌పుర) నియోజకవర్గంలో ప్రచారాన్ని కుమారుడు వైభవ్‌ గెహ్లాట్, కోడలు హిమాంశి, భార్య సునీత చూసుకుంటున్నారు.

ప్రచారంలో కులకలం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులం దగ్గర్నుంచి రామభక్త ఆంజనేయుడు కులం వరకు ఈ సారి ఎన్నికల ప్రచారంలో కలకలాన్ని రేపాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు సీపీ జోషి, విలాస్‌రావ్‌ మట్టెమ్‌వార్‌ వంటి వారు ప్రధాని మోదీ కులాన్ని తక్కువ చేసి మాట్లాడిన వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. మోదీ తండ్రి ఎవరంటూ ప్రశ్నించడం కూడా కలకలం రేపింది. దీనికి కౌంటర్‌గా కమలనాథులు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గోత్రం అంశాన్ని లేవనెత్తి ఆ పార్టీని ఇరుకున పెట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top