ఇక హోరే..

Telangana political Party Leaders Starts Elections Campaign in Hyderabad - Sakshi

నేటి నుంచి ప్రచార జోరు   

మహాకూటమి, టీఆర్‌ఎస్‌లకు రెబల్స్‌ బెడద  

కదనరంగంలోకి అసంతృప్తులు  

స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ  

కూటమిలో ఆయా పార్టీలకుకేటాయించిన స్థానాల్లోనూఇతరుల నామినేషన్‌  

జాబితాలో లక్ష్మణ్‌గౌడ్, బండకార్తీకరెడ్డి, ఉమాదేవి, కార్తీక్‌రెడ్డి, భిక్షపతి యాదవ్,మొవ్వ సత్యనారాయణ, నందికంటి శ్రీధర్,ఆకుల రాజేందర్‌  

అంబర్‌పేట్‌లో కాంగ్రెస్,టీజేఎస్‌ స్నేహపూర్వక పోటీ  

టీఆర్‌ఎస్‌లోనూ ఆశావహుల తిరుగుబావుటా  

ఉప్పల్‌లో శ్రీనివాస్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో శంకర్‌గౌడ్, ముషీరాబాద్‌లో ప్రఫుల్‌ రాంరెడ్డి నామినేషన్లు  

రెబల్‌ అభ్యర్థులనుబుజ్జగించడంలో ఆయాపార్టీలు నిమగ్నం

ఓ ఘట్టంముగిసింది. నామినేషన్ల పర్వ పూర్తయింది. ఇక ప్రచారం జోరందుకోనుంది. అయితే అన్ని పార్టీల్లోనూ రె‘బెల్స్‌’ మోగుతున్నాయి. మహాకూటమి, టీఆర్‌ఎస్‌ల నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు స్వతంత్రులుగా పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేయడం ఆయా పార్టీలను కలవర పెడుతోంది. మహాకూటమిలో బండ కార్తీకరెడ్డి, ఉమాదేవి, కార్తీక్‌రెడ్డి, భిక్షపతి యాదవ్, మొవ్వ సత్యనారాయణ, నందికంటి శ్రీధర్, ఆకుల రాజేందర్‌... టీఆర్‌ఎస్‌లో శ్రీనివాస్‌రెడ్డి,శంకర్‌గౌడ్, ప్రఫుల్‌ రాంరెడ్డి తిరుగుబావుటా ఎగరేశారు. ఈ నేపథ్యంలో రెబల్స్‌ను బుజ్జగించేందుకు ఆయా పార్టీల అధిష్టానాలు ప్రయత్నిస్తున్నాయి. భవిష్యత్తులో పదవులు ఇస్తామని హామీలిస్తున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో: నామినేషన్లకు చివరి రోజైన సోమవారం గ్రేటర్‌లో వందలాదిగా నామపత్రాలు దాఖలయ్యాయి. అత్యధికంగా మల్కాజ్‌గిరి, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో 65చొప్పున...అత్యల్పంగా బహదూర్‌పురాలో 11నామినేషన్లు వేశారు. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తంగా 475మంది నామినేషన్లు వేయగా... రంగారెడ్డి జిల్లాలో 305మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కార్తీకమాసం, సోమవారం సెంటిమెంట్‌ కలిసి రావడంతో పలువురు అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు ఆసక్తి చూపారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం పార్టీల నుంచి బరిలోకి దిగిన వారిలో ఒక్కో అభ్యర్థి రెండు నుంచి నాలుగు సెట్ల మేర నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడంతో సంఖ్యా పరంగా నామినేషన్లు పెరిగినట్లు కనిపించినా... అదే స్థాయిలో అభ్యర్థులు పెరగకపోవడం విశేషం. కొన్నిచోట్ల ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ దక్కని రెబల్స్‌ నామినేషన్లు దాఖలు చేయడంతో బీ–ఫారాలు దక్కిన అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేటి నుంచి ప్రచారహోరుకు తెరలేవనుంది. చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో ముషీరాబాద్‌ నుంచి ముఠాగోపాల్‌(టీఆర్‌ఎస్‌), సనత్‌నగర్‌ నుంచి కూన వెంకటేశ్‌గౌడ్‌(టీడీపీ), తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(టీఆర్‌ఎస్‌), భవర్‌లాల్‌వర్మ(బీజేపీ), గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌(బీజేపీ), ప్రేమ్‌సింగ్‌రాథోడ్‌(టీఆర్‌ఎస్‌) తదితరులున్నారు. గోషామహల్‌ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్‌ ఎం.రాజేశ్‌ అలియాస్‌ చంద్రముఖి నామినేషన్‌ దాఖలు చేశారు. అంబర్‌పేట్‌ నియోజకవర్గం నుంచి మహాకూటమిలోని కాంగ్రెస్‌ నుంచి లక్ష్మణ్‌యాదవ్, టీజేఎస్‌ నుంచి రమేశ్‌ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు.  

ప్రచార జోరు...
ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో గ్రేటర్‌లో నేటి నుంచి ప్రచారపర్వం జోరుగా సాగనుంది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేయనున్నారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు భారీగా తాయిలాలు ప్రకటించనున్నారు. ర్యాలీలు, బహిరంగ సభలు, ముఖ్యనేతల ప్రచారపర్వాలతో గ్రేటర్‌లో ప్రతి వీధీ హోరెత్తనుంది. రాజకీయ నాయకుల హామీల వర్షంలో ఓటర్లు తడిసిముద్దకానున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లు, యువత, కులసంఘాలను తమవైపునకు తిప్పుకునేందుకు వారికి అవసరమైన వినియోగ, గృహోపయోగ, విలాస వస్తువులను ఇస్తామంటూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఆయా వర్గాలతో బస్తీ, కాలనీల్లో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వారు కోరిన ఆఫర్లకు సై అంటుండడం గ్రేటర్‌ ఎన్నికల వైచిత్రి. ప్రధాన పార్టీల నుంచి స్టార్‌క్యాంపెయినర్లతో మినీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

గ్రేటర్‌లో నామినేషన్ల వివరాలివీ....  
ఖైరతాబాద్‌ 55: ఖైరతాబాద్‌లో మొత్తంగా 55 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం 14 నామినేషన్లు వేశారు.  
గోషామహల్‌ 43: ఈ నియోజకవర్గంలో మొత్తంగా 43 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం 21 నామినేషన్లు నమోదయ్యాయి.
నాంపల్లి 26:  నాంపల్లిలో మొత్తంగా 26 నామినేషన్లు, సోమవారం 17 నామినేషన్లు వేశారు.    
కార్వాన్‌ 21: ఇక్కడ మొత్తం 21 నామినేషన్లు , సోమవారం 7 నామినేషన్లు నమోదయ్యాయి.
జూబ్లీహిల్స్‌ 51: ఈ నియోజకవర్గంలో మొత్తం 51 నామినేషన్లు రాగా... సోమవారం 23 నామినేషన్లు వచ్చాయి.  
అంబర్‌పేట్‌ 45: ఇక్కడ మొత్తం 45 నామినేషన్లు రాగా... సోమవారం 26నామినేషన్లు నమోదయ్యాయి.
ముషీరాబాద్‌ 29: ఈ నియోజకవర్గంలో మొత్తం 29 నామినేషన్లు దాఖలు కాగా... సోమవారం 17 వేశారు.    
మలక్‌పేట్‌ 25: ఇక్కడ మొత్తంగా 25 నామినేషన్‌ పత్రాలు నమోదు కాగా.. సోమవారం 16 దాఖలయ్యాయి.
సికింద్రాబాద్‌ 37: సికింద్రాబాద్‌లో మొత్తం 37 నామినేషన్‌లు దాఖలు కాగా... సోమవారం 19 నామినేషన్లు నమోదయ్యాయి.
కంటోన్మెంట్‌ 25: ఇక్కడ మొత్తం 25 నామినేషన్లు నమోదు కాగా.. సోమవారం 15 నామినేషన్‌ పత్రాలు వచ్చాయి.  
యాకుత్‌పురా 37: ఈ నియోజకవర్గంలో మొత్తంగా 37 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి.
బహదూర్‌పురాలో మొత్తంగా 11 నామినేషన్లు, చార్మినార్‌లో 25, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో 25 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

రాజేంద్రనగర్‌ 50: రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో మొత్తం 50 నామినేషన్లు దాఖలు కాగా... సోమవారం ఒక్కరోజే 23నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి గణేష్‌గుప్తాకు టికెట్‌ ఖరారు కాగా... ఆ పార్టీ రెబెల్‌గా మ్యాడం రాజేశ్వర్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ టికెట్‌ ప్రయత్నించి విఫలమైన కార్తీక్‌రెడ్డి, చక్కల మల్లయ్య, రణధీర్‌రెడ్డిలు రెబెల్స్‌గా నామినేషన్లు వేశారు.  

కూకట్‌పల్లి 48: కూకట్‌పల్లి నియోజకవర్గంలో మొత్తం 48 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం ఒక్కరోజే 18 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి కాంతారావు రెండు సెట్ల నామినేషన్లు వేశారు.

మేడ్చల్‌ 35: మేడ్చల్‌ నియోజకవర్గంలో మొత్తం 35 నామినేషన్లు దాఖలు కాగా... సోమవారం ఏకంగా 20నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడా ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. కాగా కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్థిగా తోటకూర జంగయ్య యాదవ్‌ నామినేషన్‌ వేశారు.  

ఎల్బీనగర్‌ 64: ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో మొత్తం 64 నామినేషన్లు దాఖలు కాగా... సోమవారం అత్యధికంగా 37 నామినేషన్లు దాఖలవడం విశేషం. ఇక్కడ మొత్తం 44 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వీరిలో కొందరు రెండు మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడం విశేషం.  

మహేశ్వరం 35: మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం 35 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం 20 నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయి.

శేరిలింగంపల్లి 41: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొత్తంగా 41 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా శంకర్‌గౌడ్‌ నామినేషన్‌ వేశారు. టీడీపీ నుంచి మొవ్వా సత్యనారాయణ, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ నామినేషన్లు వేశారు.  

కుత్బుల్లాపూర్‌ 52: ఈ నియోజకవర్గంలో మొత్తం 52 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం ఒకేరోజు అత్యధికంగా 38 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ రెబల్‌ అభ్యర్థిగా చెరుకుపల్లి భరత్‌సింహారెడ్డి నామినేషన్‌ వేశారు.  

మల్కాజ్‌గిరి 65: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మొత్తం 65 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం అత్యధికంగా 37 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, నందికంటి శ్రీధర్, సురేష్‌యాదవ్, రామకృష్ణనాయుడు నామినేషన్లు వేశారు.

ఉప్పల్‌ 65: ఉప్పల్‌ నియోజకవర్గంలో మొత్తం 65 నామినేషన్లు దాఖలు కాగా.. సోమవారం ఏకంగా 28 మంది నామినేషన్లు వేశారు. కూటమి పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్‌ రెబల్‌అభ్యర్థిగా మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మేకల శివారెడ్డి నామినేషన్‌ వేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ వేశారు.

రెఢీబెల్స్‌
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో రె‘బెల్స్‌’ మోగుతున్నాయి. చివరి వరకు టికెట్‌ వస్తుందనుకున్న ఆశావహులకు ఆయా పార్టీల నుంచి రాకపోవడంతో తిరుగబావుటా ఎగరేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి నిలిచారు. నామినేషన్లూ వేశారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు గందరగోళంగా మారడంతో... కూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌ నేతలు కొందరు రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. కూటమిలో భాగంగా గ్రేటర్‌లోని 24 స్థానాల్లో కాంగ్రెస్‌కు 16, టీడీపీకి 6, టీజేఎస్‌కు 2 సర్దుబాటు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్‌ అదనంగా అంబర్‌పేట్‌లో పార్టీ అభ్యర్థి లక్ష్మణ్‌ యాదవ్‌కు బీ–ఫామ్‌ అందజేసింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్, టీజేఎస్‌ మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొంది. 

నామినేషన్ల దాఖలు...   
మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌కు ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, మహేశ్వరం, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, కార్వాన్, బహదూర్‌పురా, నాంపల్లి, చార్మినార్‌ స్థానాలు... టీడీపీకి మలక్‌పేట, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్‌ దక్కగా... టీజేఎస్‌కు మల్కాజిగిరి, అంబర్‌పేట కేటాయించారు. అయితే ఆయా పార్టీల నుంచి సంబంధిత నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ వారు రెబల్స్‌గా బరిలోకి దిగారు. సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన ఆదం ఉమాదేవి, నగర మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి లక్ష్మణ్‌గౌడ్, శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన భిక్షపతి యాదవ్, ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నించిన మొవ్వ సత్యనారాయణ, రాజేంద్రనగర్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన కార్తీక్‌రెడ్డి, మల్కాజిగిరి టికెట్‌ ఆశించిన కాంగ్రెస్‌ నేతలు నందికంటి శ్రీధర్, ఆకుల రాజేందర్‌లు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేశారు.  

బుజ్జగింపులు...  
అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆయాపార్టీలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏకంగా బుజ్జగింపుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు రెండు రోజులుగా నగరంలోని ఓ హోటల్‌లో ఉంటూ రెబల్స్‌తో మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తులను అమరావతికి పిలిపించి హామీలిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా రాజేంద్రనగర్‌ టికెట్‌ టీడీపీ అభ్యర్థి గణేష్‌ గుప్తాకు దక్కింది. అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేశ్‌ ఇక్కడి నుంచి టికెట్‌ ఆశించారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించిన అధిష్టానం టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీలో ఇప్పటి వరకు ఎలాంటి పదవి లేని బండ్ల గణేశ్‌కు ఏకంగా టీపీసీసీ అధికార ప్రతినిధి హోదా లభించింది.   

టీఆర్‌ఎస్‌కూ తప్పని తిప్పలు...   
టీఆర్‌ఎస్‌కూ రెబల్స్‌ బెడద తప్పలేదు. మిగతా పార్టీలతో పోలిస్తే రెబల్స్‌ బెడద టీఆర్‌ఎస్‌కు ఇబ్బందులు సృష్టించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నప్పటికీ... అక్కడక్కడా ఆ పార్టీ అసంతృప్తులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యేలోగా వీరిలో చాలామంది... అధినేత కేసీఆర్, కేటీఆర్‌ సూచనల మేరకు ఉపసంహరించుకుంటారా? లేక పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారు? అన్నది సస్పెన్స్‌గా మారింది. నామినేషన్ల ఘట్టం ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ రెబల్స్‌గా ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్‌రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి శంకర్‌గౌడ్, ముషీరాబాద్‌ నుంచి తుమ్మల ప్రఫుల్‌ రాంరెడ్డి నామినేషన్లు వేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top