‘కుర్చీ’ కమల్‌కే..!

Telangana Khammam ZP Chairman Members - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా లింగాల కమల్‌రాజుకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. అధికారికంగా ఆయన పేరును శుక్రవారం ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 8వ తేదీన జెడ్పీ చైర్మన్‌ పదవికి ఎన్నిక ఉండడంతో పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మెజార్టీ స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌కు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి సునాయాసంగా లభించే అవకాశం ఏర్పడింది. మొత్తం 20 జెడ్పీటీసీలకుగాను.. 17 జెడ్పీటీసీలను ఆ పార్టీ గెలుపొందింది. దీంతో జెడ్పీ చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై టీఆర్‌ఎస్‌ అధినేత జిల్లా నేతలతో చర్చించి.. కమల్‌రాజు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక జిల్లాస్థాయిలో చైర్మన్‌ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన వైస్‌ చైర్మన్‌ పదవిపై మాత్రం నెలకొన్న పీటముడి ఇంకా వీడలేదు. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని వైస్‌ చైర్మన్‌ పదవికి అభ్యర్థిని ఖరారు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పలు సామాజిక వర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున జెడ్పీటీసీలుగా ఎన్నికైన వారిలో అనేక మంది ఈ పదవిని ఆశిస్తుండడంతో పేరును ఖరారు చేయడానికి పార్టీ పలు కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైస్‌ చైర్మన్‌ పదవితోపాటు రెండు కోఆప్షన్‌ సభ్యుల పదవులకు సైతం అదేరోజు ఎన్నిక జరుగుతుండడంతో ఆ పేర్లను సైతం ఖరారు చేయాల్సి ఉంది.
 
‘వైస్‌’పై ఆలోచన.. 
జెడ్పీ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌ కావడంతో.. వైస్‌ చైర్మన్‌ పదవిని మహిళలకు కేటాయించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి గెలిచిన జెడ్పీటీసీల్లో ఒకరిని వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి జెడ్పీటీసీగా గెలుపొంది.. ఉద్యమ నేపథ్యం కలిగి.. బీసీ వర్గానికి చెందిన ధనలక్ష్మి అభ్యర్థిత్వం వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైస్‌ చైర్మన్‌ పదవిని బీసీలకు కేటాయించడంతోపాటు మహిళను ఎంపిక చేసినట్లు అవుతుందనే దానిపై పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే పెనుబల్లి జెడ్పీటీసీ, బీసీ వర్గానికి చెందిన చక్కిలాల మోహన్‌రావు పేరును సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జెడ్పీ చైర్మన్‌ పదవికి మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందిన మధిర జెడ్పీటీసీ లింగాల కమల్‌రాజును ఎంపిక చేయాలని నిర్ణయించిన అధిష్టానం.. వైస్‌ చైర్మన్‌ పదవికి ధనలక్ష్మి పేరు పరిశీలనలో ఉండడంతో ఇక రెండు కోఆప్షన్‌ పదవుల్లో సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వైస్‌ చైర్మన్‌ పదవి కోసం అనేక మంది జెడ్పీటీసీలు గట్టిగా పట్టుపట్టడమే కాకుండా.. తమ అభీష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ముఖ్య నేతల ద్వారా అధిష్టానాన్ని ఒప్పించే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఖమ్మం జిల్లా పరిషత్‌లో అంతర్భాగంగా ఉండి.. కొత్త జిల్లా పరి షత్‌గా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ పదవి ఎవరిని వరిస్తుందనే అంశం సామాజిక సమీకరణాల ఆధారంగా ఖమ్మం జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవి ఖరారు వ్యవహారంతో ముడిపడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలోని 20 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ సభ్యుల కోసం ఈనెల 7వ తేదీన అధికారులు ఆయా మండల కార్యాలయాల్లో ఎన్నికను నిర్వహించనున్నారు. మెజార్టీ స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉన్నా.. కొన్నిచోట్ల ఎంపీపీ పదవులు ఎవరిని వరించాలన్నా స్వతంత్ర అభ్యర్థులదే కీలక నిర్ణయంగా మారే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా లోని వివిధ మండలాల్లో తమకు గల బలాబలాల ఆధారంగా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కోఆప్షన్‌ సభ్యులను గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top