అవమానాలు భరించాం!

Telangana Grand Alliance Will Work For Telangana Activists Says Kodandaram - Sakshi

ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల మేలు కోసమే కూటమిని నిలబెట్టుకున్నాం 

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల మేలు కోసం కూటమిని ఏర్పాటు చేసుకున్నాం. కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలనుకున్నాం. అందుకే అవమానాలు భరించాం. వివక్ష చూపినా వదిలేశాం. మా పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితి తెచ్చారు. మాకు ఇస్తామన్న స్థానాలు ఇమ్మని అడిగినా కాంగ్రెస్‌ కనికరించలేదు. ఉద్యమంలో పని చేసి, మా పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారి భవిష్యత్‌ను వదులుకున్నాం’’అని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. గురువారం అభ్యర్థుల ఉపసంహరణ అనంతరం టీజేఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కూటమి అభ్యర్థులుగా టీజేఎస్‌ 4 స్థానాల్లో పోటీ చేస్తోందని, మరో 4 చోట్ల టీజేఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు స్నేహపూర్వక పోటీ చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ పరిస్థితిని గమనించి ఆ 8 స్థానాల్లో టీజేఎస్‌ అభ్యర్థులకు, అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో సర్వేల పేరుతో మీవాడు పనికి రాడంటూ కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను చులకన చేసిందన్నారు. అయినా భరించి, పొత్తు ధర్మాన్ని అనుసరించి జనగామ, మిర్యాలగూడ స్థానాలను వదులుకున్నామన్నారు. పొత్తుల్లో జాప్యం వద్దని పోరాటం చేసినా సమాధానం రాలేదన్నారు. తాను పోటీలో లేకపోవడం మంచిదేనని, కేసీఆర్‌ నిరంకుశ పాలనను ప్రజలకు వివరిస్తానన్నారు.

మల్కాజ్‌గిరి, అంబర్‌పేట, వర్దన్నపేట, సిద్దిపేట, వరంగల్‌ ఈస్ట్, దుబ్బాక, ఆసిఫాబాద్, ఖానా పూర్‌లో తమ అభ్యర్థులను గెలిపించాలని, మిగతా స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హామీల అమలు కోసమే పట్టుబట్టి ‘కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌‘ బాధ్యతను తీసుకున్నామన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆ ఎజెండాను అందుబాటులోకి తెస్తామన్నారు. నాలుగున్నరేళ్లల్లో కేసీఆర్‌ ఆస్తులు పెంచుకోవడానికే పనిచేశారన్నారు. తాను ఓడితే తనకు నష్టం ఏం లేదని కేసీఆర్‌ చెప్పిన మాట వాస్తవమేన్నారు. గెలిచినా, ఓడినా ఫాంహౌజ్‌కే పరిమితం అన్నారు. సోనియా సభలో పాల్గొనాలని తనకు ఆహ్వానం వచ్చిందని పాల్గొంటానన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top