జాబితాలో మళ్లీ మార్పులు!

Telangana Elections 2018 Changes In Seats List In Grand Alliance - Sakshi

కాంగ్రెస్‌ ఖరారు చేసిన తొలి జాబితాపై ఏపీ సీఎం చంద్రబాబు అభ్యంతరాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికలో నెలకొన్న సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అధిష్టానం గురువారం అభ్యర్థుల తొలి జాబితాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరాలు తెలిపారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ దూత హోదాలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ చంద్రబాబుతో శనివారం ఏపీ రాజధాని అమరావతిలో భేటీ అయ్యారని తెలుస్తోంది. దీంతో శనివారం ప్రకటించాల్సిన జాబితా మరోమారు వాయిదా పడిందని, కాంగ్రెస్‌ అధిష్టానం క్లియరెన్స్‌ ఇచ్చిన తొలి జాబితాలోనూ చంద్రబాబు సూచన మేరకు మార్పుచేర్పులుంటాయని తెలియవచ్చింది. అందుకే 10న జాబితాను విడుదల చేస్తామంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి. కుంతియా గురువారం ఢిల్లీలో ప్రకటించినప్పటికీ శనివారం కూడా జాబితా వెలువడలేదని సమాచారం. మరోవైపు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఇంతవరకు ఒక్క అభ్యర్థి పేరును కూడా ప్రకటించకపోవడంపట్ల పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి.

కారణం ఏమిటి?
గత 15 రోజులుగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన ఊరిస్తూనే ఉంది. అదిగో... ఇదిగో, ఈరోజు.. రేపు, ఎల్లుండి అంటూ ముఖ్య నాయకులు చేస్తున్న ప్రకటనలు, అనధికారికంగా జరుగుతున్న ప్రచారం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ శ్రేణులను గందరగోళంలో పడేస్తోంది. ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీలో ఆమోదం పొందిన 74 మంది అభ్యర్థుల జాబితా ప్రకటనలోనూ ఎందుకు ఆలస్యమవుతోందనే విషయమై పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇందుకు టీపీసీసీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపం, కీలక నాయకుల అలకలు, ఆగ్రహాలు, వారసులకు టికెట్లు ఆశిస్తున్న నేతల కినుక లాంటివి ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఆధిపత్యం కోసం కీలక నేతలు అభ్యర్థుల ఖరారులో వేర్వేరు వ్యూహాలను అమలుపర్చడంతో జాబితా గందరగోళంగా తయారైందనే చర్చ జరుగుతోంది.

సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నామని, గెలుపు గుర్రాలకే అవకాశం కల్పిస్తామని పైకి ప్రకటించినా ముఖ్య నాయకులు తమ అనుయాయులకు ప్రాధాన్యమిచ్చేలా సిఫారసులు చేశారని, అధిష్టానం నిర్దేశించిన సూత్రాలకు విరుద్ధంగా జాబితాలో పేర్లను చేర్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ లాంటి నేతలకు చెక్‌పెట్టేలా కొందరు టీపీసీసీ ముఖ్యులు అధిష్టానం వద్ద చేసిన ప్రయత్నాలు వారికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. తాను చేయించిన సర్వేల్లో గెలుస్తారని తేలిన 24 మందితో కూడిన జాబితాను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో అధిష్టానం ముందు పెట్టినప్పటికీ దాన్ని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోకుండా కొందరు అడ్డుకున్నారని రేవంత్‌ అలకవహించినట్లు సమాచారం. అలాగే తమకు చెక్‌పెట్టాలనే వ్యూహంలో భాగంగా నకిరేకల్, మునుగోడు స్థానాలను ఇంటి పార్టీతో ముడిపెట్టడంపై కోమటిరెడ్డి సోదరులు మండిపడుతున్నారని తెలియవచ్చింది.

తాము అడుగుతున్న స్థానాల విషయంలో అభ్యంతరాలు చెప్పడంతోపాటు తమ అనుచరుడికి ఇవ్వాల్సిన సీటుకు కూడా ఎసరు పెడుతుండటంతో వారు ఢిల్లీ స్థాయిలో మళ్లీ పావులు కదుపుతున్నారని తెలిసింది. మరోవైపు ఏఐసీసీ వద్ద జరిగిన కీలక భేటీల్లో జానా, ఉత్తమ్‌ల మధ్య కూడా అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదనే చర్చ జరుగుతోంది. భువనగిరి స్థానానికి ఉత్తమ్‌ ఒకరి పేరు ప్రతిపాదిస్తే జానా మరో పేరు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇలా కీలక నేతల మధ్య పొరపొచ్చాలతోపాటు తమ వారసులకు టికెట్లు ఇవ్వడంలేదని అధిష్టానం ఇచ్చిన సంకేతాల నేపథ్యంలో కొందరు నాయకులు ఇంకా ఢిల్లీలో లాబీయింగ్‌ చేసుకునే పనిలో ఉన్నారు.

బీసీల ఆందోళనా కారణమేనా..?
కాంగ్రెస్‌లోని బీసీ నేతలకు పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు ఏమాత్రం రుచించడం లేదు. టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, తమకు ఇవ్వాల్సిన స్థానాలను పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు కేటాయించాలని ప్రతిపాదించడం, సామాజిక సమీకరణలను సరిగా పాటించకపోవడం బీసీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొన్ని కులాలకు అధిక ప్రాధాన్యమిచ్చి మరికొన్ని కులాలను విస్మరించేలా అభ్యర్థుల జాబితా తయారు చేశారని వారు మండిపడుతున్నారు. తమకు 45 సీట్లు కేటాయించడంతోపాటు సీఎం పదవి ఇవ్వాలంటూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద పలువురు నేతలు ఆందోళనకు దిగడంతో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్త చరణ్‌దాస్‌ Ððవెళ్లి వారిని సముదాయించాల్సి వచ్చింది. దీనికితోడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు, ఓయూ జేఏసీ నేతలకు కూడా అన్యాయం జరిగే పరిస్థితులు ఉండటంతో వారు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు.

ప్రజారాజ్యం, టీఆర్‌ఎస్‌లలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు, పార్టీకి చేదోడువాదోడుగా ఉంటున్న పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ కూడా తన సీటు కోసం ఢిల్లీలో మకాం వేయాల్సి రావడం గమనార్హం. ఖైరతాబాద్‌ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయనతోపాటు అదే టికెట్‌ ఆశిస్తున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్‌.జి. వినోద్‌రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండి అధిష్టానం పెద్దలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. వీటన్నింటికీతోడు కాంగ్రెస్‌ ఖరారు చేసుకున్న 74 స్థానాల్లో కొన్నింటిని మిత్రపక్షాలు ఆశిస్తుండటం, ఆయా సీట్ల విషయంలో కూటమి పార్టీలతో చర్చలు పూర్తి కాకుండానే మిత్రపక్షాలకు 26 సీట్లు కేటాయించినట్లు కాంగ్రెస్‌ ఏకపక్షంగా ప్రకటించడం కూడా జాబితా ఆలస్యం అయ్యేందుకు కారణంగా కనిపిస్తోంది.

నేడు కూడా జాబితా రానట్లే!
డైలీ సీరియల్‌లా వాయిదా పడుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన ఆదివారం కూడా లేనట్లే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తమ అభ్యర్థులకు బీఫారాలు ఇస్తున్న నేపథ్యంలో ఆదివారం జాబితా విడుదల చేయవద్దన్న టీపీసీసీ సూచన మేరకు అధిష్టానం దాన్ని వాయిదా వేసిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే ఖరారు చేసిన 74 సీట్లలోనూ మళ్లీ మార్పుచేర్పులు చేసేందుకు ఢిల్లీలో కసరత్తు జరుగుతుందనే చర్చ గాంధీ భవన్‌ వర్గాల్లో వినిపిస్తోంది. కారణమేదైనా ఆదివారం కూడా జాబితా రాదని, నోటిఫికేషన్‌ రానున్న 12వ తేదీ అర్ధరాత్రి లేదా 13వ తేదీన తొలి జాబితా వస్తుందని, అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయితే ఒకే దఫాలో అందరి పేర్లు ప్రకటిస్తారని సమాచారం. అయితే గతంలో లాగా కాకుండా ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన హైదరాబాద్‌లోనే ఉంటుందని, కూటమి భాగస్వామ్య పక్షాలందరితో కలసి అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించాలని గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆ రోజున అన్ని పార్టీల అభ్యర్థుల జాబితాలను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బాబు వద్దకు జాబితాపై రాష్ట్ర నేతల ఆగ్రహం?
ఏఐసీసీ అధినేత రాహుల్‌ గాంధీ దూత హోదాలో అశోక్‌ గెహ్లాట్‌ శనివారం అమరావతికి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం, కూటమి అభ్యర్థుల జాబితాను బాబు ఆమోదం నిమిత్తం తీసుకెళ్లడం రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. మహాకూటమి పేరుతో టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్నే జీర్ణించుకోలేకపోతున్నామని, అయినా టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో సర్దుకుపోదామనుకున్నా మొత్తం పార్టీనే చంద్రబాబు చేతిలో పెట్టడమేంటనే అభిప్రాయం కాంగ్రెస్‌ శ్రేణులను విస్మయపరుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థులకు కూడా చంద్రబాబు క్లియరెన్స్‌ ఇవ్వడమంటే ఆత్మహత్యాసదృశమేనని, 74 మందితో జాబితా సిద్ధమైనా బాబు ఆమోదం కోసం ఆపడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తుంటారన్న విషయాన్ని ఏ క్షణంలో మర్చిపోతామో అప్పుడే రాజకీయంగా అగాథంలో కూరుకుపోతామని ఆయన వ్యాఖ్యానించడం రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయానికి అద్దం పడుతోంది. కాగా, కూటమి అభ్యర్థుల జాబితాను చంద్రబాబు ఆమోదం కోసం తీసుకెళుతున్నారని ‘సాక్షి’ముందే చెప్పినట్లుగానే తాజా పరిణామాలు జరుగుతుండటం, శనివారం వెలువడాల్సిన కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన వాయిదాపడటం గమనార్హం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top