ప్రభుత్వ విప్‌లకు హరీశ్‌ క్లాస్‌! | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విప్‌లకు హరీశ్‌ క్లాస్‌!

Published Sat, Oct 21 2017 5:10 AM

Telangana Assembly Monsoon Session To Start From October 27th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో సమన్వయ పాత్ర పోషించడంలో, చురుగ్గా వ్యవహరించడంలో ప్రభుత్వ విప్‌లు ఘోరంగా విఫలమవుతున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. అసెంబ్లీ సమావేశ మందిరంలో గురువారం శాసనసభా సమావేశాల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, విప్‌లు గంప గోవర్దన్, నల్లాల ఓదేలు, శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈనెల 27 నుంచి వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు విప్‌లతో భేటీ అయ్యారు. ఫ్లోర్‌ కో–ఆర్డినేషన్‌ సరిగా చేయలేకపోతున్నారని, విప్‌లు డల్‌గా ఉంటే ఇక ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటని  ప్రశ్నించినట్లు సమాచారం. విప్‌లు అంతా యాక్టివ్‌ కావాలన్నారు. ఆయా జిల్లాల్లో చురుగ్గా ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించాలని, వారికి కొన్ని సబ్జెక్టులు అప్పజెప్పాలని కూడా నిర్ణయం జరిగినట్లు తెలిసింది. ప్రశ్నోత్తరాల సమయంలో, వాయిదా తీర్మానాల విషయంలో గీత దాటే సభ్యులపై కఠినంగా వ్యవహరించాలని చర్చ జరిగినట్లు సమాచారం.మరో విప్‌ గొంగిడి సునీత సమావేశానికి హాజరు కాలేదు.

Advertisement
Advertisement