చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ నేతల రెక్కీ

TDP Supporters Conduct A Recce In YSRCP MLA Chevireddy Bhaskar Reddy - Sakshi

సాక్షి, చంద్రగిరి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హత్యకు అధికార టీడీపీ నాయకులు చేసిన కుట్ర బట్టబయలైంది. చెవిరెడ్డిపై దాడి చేయాలని స్థానిక టీడీపీ నేత పులివర్తి నాని గత కొద్ది నెలలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా చెవిరెడ్డికి సంబంధించిన ప్రతి కదలికను తెలిపేలా ఆయన దగ్గర ఇద్దరు డ్రైవర్లను నియమించారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో అదును చూసుకుని దాడి చేయాలని భావించారు. అయితే స్థానిక మహిళలు, అభిమానులే వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేకు భద్రతగా నిలవడంతో నాని వ్యూహం రివర్సయింది. టీడీపీ కుట్రను చెవిరెడ్డి ఆధారాలతో బయటపెట్టారు. తన దగ్గర చేరిన ఇద్దరు డ్రైవర్లను పోలీసులకు అప్పగించారు.

ఒక్కొక్కరికి 15 లక్షలు
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సంబంధించిన కదలికలు గమనించి పులివర్తి నానికి ప్రతి క్షణం అందించడమే తమ పని అని నాగభూషణం, సిసింద్రీ అనే ఇద్దరు డ్రైవర్లు తెలిపారు. మంగళవారం మీడియాతో ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుతూ.. ‘పులివర్తి నాని మాకు చాలా బాగా తెలుసు. ఆయన పంపితేనే మేము నెలరోజుల కింద చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద డ్రైవర్లుగా చేరాం. ప్రతీ క్షణం ఎమ్మెల్యే కదలికలను గమనించి నానికి అందిచడమే మా పని. ఇలా చెప్పినందుకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాము. గతంలో మేము చిత్తూరులో ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు పైలట్‌గా పనిచేశామ’ని ఇద్దరు డ్రైవర్లు వివరించారు. 

రెక్కీ నిర్వహించడం దారుణం
తన మీద దాడికి టీడీపీ నాయకులు కుట్ర చేయడం దారుణమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇద్దరి డ్రైవర్లకి ఉద్యోగం ఇచ్చి నెల రోజులు అన్నం పెట్టానని.. తాను పెట్టిన అన్నం తిన్నవారే తనపై రెక్కీ నిర్వహించడం బాధకరమన్నారు. ‘చంద్రగిరి నియోజకవర్గంలోనే పుట్టా. ఇక్కడే పెరిగా. ఇక్కడే చదివా. ఇక్కడే శాశ్వత నివాసం ఉన్నా. విద్యార్థి నాయకుడిగా, జెడ్పీటీసీగా, తుడా చైర్మన్‌గా, టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఎమ్మెల్యేగా ఈ ప్రజల ఆశీస్సులతోనే ఎదిగా. అలా నాకు భవిష్యత్తును ఇచ్చిన నా నియోజవర్గంలోని ప్రజల అభిష్టాలు, మనోభావాలు, జీవన స్థితిగతులు తెలుస’న్నారు. నియోజకవర్గ ప్రజలు ఎవరి పని వారు చేసుకుంటూ ఎన్నికల రోజే రాజకీయాల గురించి ఆలోచిస్తారన్నారు. ఎన్నికల అయిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరూ ఆత్మీయంగా ఉంటారని ఎమ్మేల్యే గుర్తు చేశారు.

అసలేం జరిగిందంటే..  
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో జరిగిన పసుపు– కుంకుమ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని మైక్‌ కట్‌ చేయించారు టీడీపీ నాయకులు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి  పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్‌ ప్యాకెట్లతో దాడి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top