పతాక స్థాయికి లీకుల డ్రామా 

tdp party Leaks drama to top level - Sakshi

హామీల అమలుకు జైట్లీ అంగీకరించారంటూ ప్రచారం 

పోరాటం డ్రామా ఫలించకపోవడంతో టీడీపీ కొత్తపాట  

సాక్షి, అమరావతి: టీడీపీ లీకుల డ్రామా శుక్రవారం రాత్రి పతాక స్థాయికి చేరింది. పార్లమెంట్‌ వాయిదా పడిన తర్వాత జరిగిన ఒక సమావేశంలో విభజన హామీలన్నింటినీ అమలు చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అంగీకరించారంటూ ఆ పార్టీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. జైట్లీ, అమిత్‌షా, పీయూష్‌ గోయల్, సుజనా చౌదరిలు సమావేశమై, హామీల అమలుకు అంగీకరించినట్లు మీడియాకు విస్తృతంగా లీకులిచ్చింది. ప్రధాని మోదీ గానీ, అరుణ్‌ జైట్లీ రెండుసార్లు పార్లమెంట్‌లో చేసిన తమ ప్రసంగాల్లో గానీ ఎక్కడా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పలేదు. జైట్లీ పార్లమెంట్‌లో రెండుసార్లు మాట్లాడినప్పుడు ఇవ్వని హామీలను సభ వాయిదా పడిన తర్వాత జరిగిన సాధారణ సమావేశంలో ఇచ్చేసినట్లు శుక్రవారం అర్ధరాత్రి టీడీపీ అనుకూల మీడియాలో ఊదరగొట్టారు. పోరాటం పేరుతో పార్లమెంట్‌లో ఎంత హడావుడి చేసినా అదంతా డ్రామాయేనని పసిగట్టిన కేంద్రం తెలుగుదేశం పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తాము నడిపిన డ్రామా అంతా విఫలమైందని గ్రహించిన చంద్రబాబు శుక్రవారం రాత్రి మరో కొత్త లీకుల నాటకానికి తెరలేపారు.  

ఇవీ లీకులు...:  విభజన హామీలన్నీ అమలు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని టీడీపీ నేతలు లీకులు వదిలారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, పీయూష్‌ గోయల్, అమిత్‌షాలు సుజానా చౌదరితో అత్యవసరంగా సమావేశమై, టీడీపీ చేసిన అన్ని డిమాండ్లను ఒప్పుకున్నట్లు లీకులిచ్చారు. రెవెన్యూ లోటు (2014–15లో పది నెలలకు) భర్తీకి, ప్రత్యేక ప్యాకేజీ నిధులన్నింటినీ ఒకేసారి ఇచ్చేందుకు, ఈఏపీ నిధులు సర్దుబాటు చేసేందుకు అంగీకరించినట్లు ప్రచారం చేశారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి ఇస్రో అభ్యంతరం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మరోచోట నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చినట్లు ప్రచారం మొదలుపెట్టారు. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ, రైల్వేజోన్‌ ఏర్పాటుపైనా ప్రకటన చేస్తామని, రాజధాని అమరావతి నిర్మాణానికి చేసిన ఖర్చుల వివరాలు పంపితే వెంటనే నిధులు విడుదల చేస్తామని జైట్లీ చెప్పినట్లు వల్లెవేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసినట్లు లీకులిచ్చారు. అయితే, పార్లమెంట్‌లో ఎంత హంగామా చేసినా అక్కడ ఇవ్వని ఈ హామీలను ప్రైవేట్‌ సమావేశంలో బేషరతుగా ఇచ్చేందుకు జైట్లీ ఒప్పేసుకున్నారని విస్తృతంగా ప్రచారం చేయడం చూసి టీడీపీ వర్గాలే ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగేళ్లుగా ఇవ్వని వీటన్నింటినీ రాత్రికి రాత్రి, అదీ మోదీ విదేశాలకు వెళ్లిన సమయంలో ఇచ్చేందుకు జైట్లీ సాహసిస్తారా? అని అనుమానిస్తున్నాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో ఇది పతాక సన్నివేశమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   

     

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top