ప్యాకేజీకి జైకొట్టింది టీడీపీనే

TDP Has Been in Power With The BJP For Four Years, Demonstrated Opportunism - Sakshi

సాక్షి, అమరావతి : ‘టీడీపీ నాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగింది. అవకాశవాదాన్ని ప్రదర్శించింది. ఆ సమయంలో వాళ్లు ఏమి చెప్పినా తలూపింది. ప్యాకేజీకీ జై కొట్టింది. వెంకయ్య, జైట్లీకి సన్మానాలు చేసింది చంద్రబాబే. నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా అని ఆయన పోరాటం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదాపై పోరాటానికి వైఎస్సార్‌సీపీ కలిసివచ్చింది.  రాజకీయంగా మాతో కలిసి వచ్చేందుకు ఒక పార్టీ ముందుకొచ్చింది. అతడు సినిమా వ్యక్తి అనో, మరొకరనో మేం చూడలేదు. మేం చెబుతున్న నూతన ప్రత్యామ్నాయానికి మద్దతిస్తామన్నాడు. కలిసి పోరాటాలు చేద్దామన్నాడు. అందుకే సీట్ల సర్దుబాటు చేసుకున్నాం’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.  ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
ఏపీలో చంద్రబాబు పాలన ఎలా ఉందో నా కన్నా మీకే (మీడియాకు) బాగా తెలుసు. మా రాష్ట్ర పార్టీ వాళ్లను అడిగితే బాగా చెబుతారు. ఆయన పాలన ఎలా ఉందో చూస్తున్నారుగా మీరంతా? ఇక్కడ భూ సేకరణ బిల్లుకు సంబంధించి ఒక మాట చెప్పాలి. గతంలో ఆ బిల్లును అనేక తర్జనభర్జనలు పడి ఆమోదించాం. దాన్ని తోసిరాజని కొందరు సవరణలు తెచ్చారు. ఇందుకు రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను చూపుతున్నారు.

వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉందనే పేరిట కేంద్రం, రాష్ట్ర పరిధి అంశమనే పేరిట కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు తెచ్చాయి. ఈ వైరుధ్యాలను పరిష్కరించాల్సి ఉంది. భూ సేకరణ చట్టానికి తూట్లు పొడిచిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఇవన్నీ రాష్ట్రపతి వద్ద ఉన్నాయి. కేంద్ర చట్టానికి ఆధిపత్యం ఉండాలనేది మా అభిప్రాయం. రాష్ట్ర చట్టాలన్నీ దానికి లోబడి ఉండాలి. దీని కోసం అవసరమైతే ఒక కొత్త చట్టం తీసుకురావాలి. ఇందుకు మేం చొరవ తీసుకుంటాం. 

ఎన్నికల తర్వాతే మా ఎత్తులు పొత్తులు 
ఇక్కడో పార్టీతో అక్కడో పార్టీతో కేంద్రంలో మరో పార్టీతో పొత్తా అని చాలామంది అమాయకంగానో, అతి తెలివితోనో మాట్లాడుతున్నారు. అది నిజం కాదు. ఇది గత 35 ఏళ్లుగా జరుగుతున్నదే. ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలకు జనాదరణ ఉంది. ఆ పార్టీలకు ఆయా రాష్ట్రాలలో తప్ప మరెక్కడా బలం ఉండదు. ఎన్నికలకు ముందే పొత్తులు, అవగాహనలు ఎందుకుండవంటే ఎక్కువగా ఉన్నవి ప్రాంతీయ పార్టీలే. తెలుగు దేశం, వైఎస్సార్‌సీపీలనే తీసుకోండి. వాటి ప్రభావం తెలుగు రాష్ట్రాలలోనే కదా.

ఇలాగే మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా. ఈ వేళ మన దేశంలో ఇది అనివార్యం. అందువల్ల రాష్ట్రాల స్థాయిల్లోనే కూటములు, లేదా సర్దుబాట్లు జరుగుతుంటాయి. ఎన్నికల తర్వాతే ఒక ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది. ముందే ఫలానా అభ్యర్థి ప్రధాని అని చెప్పలేం. 1977లో ఇందిరా గాంధీని ఓడించిన తర్వాతే కదా జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. 1996లో దేవెగౌడ ప్రధాని కావడమైనా, 1998లో వాజపేయి      నాయకత్వంలో ఎన్డీఏ ఏర్పాటైనా, 2004లో కాంగ్రెస్‌ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వమైనా ఎన్నికల తర్వాతే కొలువుదీరిన విషయాన్ని మరువొద్దు.

ఈసారీ అదే జరుగుతుంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు తప్పదు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం వచ్చింది. 2004లో యూపీఏ ప్రభుత్వాన్ని మేం బయట నుంచి బలపర్చాం. ఎన్నికల అనంతరం ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనే దాన్నిబట్టి ఉంటుంది. ప్రాంతీయ స్థాయిలో పోటీలు వేరు. జాతీయ స్థాయి రాజకీయాలు వేరు. ఉదాహరణకు 2004లో మేం (సీపీఎం) కేరళలో కాంగ్రెస్‌తో పోటీ పడ్డాం.

జాతీయ స్థాయిలో అదే కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చాం. ప్రత్యామ్నాయ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలంటే వామపక్షాల బలం ఎక్కువగా ఉండాలని కేరళ ప్రజలు భావించారు. ఎక్కువ సీట్లిచ్చారు. ఏ సమయంలో ఏది అవసరమో అది చేస్తాం. 1977లో ఇందిరా గాంధీ హయాంలో అత్యవసర పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. అప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరమని భావించాం.

ఎవరైతే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడతారో వారికి మద్దతిచ్చాం. ఆ రోజుల్లో బీజేపీ లేదు. జనతా పార్టీ ఉంది. వాళ్లు పోరాటాలు చేశారు. మేమూ చేశాం. కానీ ఎవరం పొత్తు పెట్టుకోలేదు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా మేం బంద్‌కు పిలుపిచ్చాం. వాళ్లూ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, రాజ్యాంగం ప్రమాదంలో పడింది. దీన్ని కాపాడేందుకు ఎవరు కలిసి వస్తారో వాళ్లతో వెళతాం. కలిసొచ్చే వాళ్లలో కాంగ్రెస్‌ ఉన్నా, టీడీపీ ఉన్నా సమన్వయంతో కదులుతాం. 

ఈ ఎన్నికల్లో మా ప్రధాన అజెండా... 
బీజేపీ ప్రభుత్వాన్ని దించడం ప్రధానం. లేకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ పట్టు మరింత పెరుగుతుంది. రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుంది.  రెండోది ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చడం. దేశ సమైక్యత, సమగ్రత కాపాడడం. వామపక్షాల బలం పెంచడం. మూడోది ఈ ఎన్నికల తర్వాత లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.  

పార్టీ తిరోగమనంలో ఉన్నప్పుడే పదవి చేపట్టా.. 
నేను ప్రధాన కార్యదర్శి పదవిని పార్టీ తిరోగమన దశలో ఉన్నప్పుడు చేపట్టా. పార్లమెంటులో మా బలం 44 నుంచి 9కి, లెఫ్ట్‌ఫ్రంట్‌ బలం 61 నుంచి 10కి చేరింది. అంతకుముందు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు మా చేతుల్లో ఉంటే నేను వచ్చేనాటికి ఒకటే మిగిలింది. నేను డౌన్‌లో పదవిని చేపట్టా. ఇప్పుడు అప్‌ (ఎదుగుదల) చూడాలి. నేను వచ్చిన తర్వాత కేరళలో గెలిచి ఒక మెట్టు ఎదిగాం. ఇప్పుడు రెండో మెట్టు కోసం కృషి చేస్తున్నాం.  

హోదా పోరులో వైఎస్సార్‌సీపీ కలిసొచ్చింది 
ఎన్టీఆర్‌తో, చిరంజీవితో పొత్తు పెట్టుకోని మాట నిజమే. ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడున్న ప్రధాన పార్టీలు రెండు టీడీపీ, వైఎస్సార్‌సీపీ. ఇద్దర్నీ చూస్తున్నాం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా పోరాటంలో ముందుకొచ్చింది. మిగతా సందర్భాల్లో కారణం ఏమిటో తెలియదు. 
 కన్హయ్య కుమార్‌కే మా మద్దతు  ఢిల్లీ జేఎన్‌టీయూ విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్య కుమార్‌ బిహార్‌లోని బెగుసరాయిలో పోటీ చేస్తే సీపీఎం మద్దతిస్తుంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ నుంచి ఏమైనా ఇబ్బంది వచ్చి వేరేచోటు నుంచి పోటీ చేయించాలని కూడా మేం భావించాం. బహుశా ఆయన బెగుసరాయి నుంచే బరిలో దిగొచ్చు. 

మార్పును ఆశించి ఓటేయండి 
కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలో నిర్దేశించే శక్తి తెలుగు రాష్ట్రాలది. ఇక్కడి ఓటర్లు కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. 2004లో ఏపీలో 37 సీట్లు రాబట్టే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. 2009లో మళ్లీ 34 సీట్లతో యూపీఏ–2 వచ్చింది. అన్ని సీట్లు ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావడం కష్టమయ్యేది. అందువల్ల తెలుగు రాష్ట్రాల ఓటర్లపై ప్రత్యేక బాధ్యత ఉంది. కొత్త ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే బాధ్యతాయుతంగా వ్యవహరించి మార్పును ఆశించేవారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top