ఇక టార్గెట్‌ కమిషనరే?

tdp Corporators target to commissioner - Sakshi

మాట వినటం లేదంటూ కార్పొరేటర్లు గగ్గోలు

మంత్రి నారాయణ ఆదేశాలకే విలువ

లోకేష్‌ వర్గానికి ప్రాధాన్యం తగ్గుతుందని ఆవేదన

చక్రం తిప్పాలన్న బుద్దా వర్గం

సాక్షి,అమరావతిబ్యూరో: ‘ఇక ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయి.. ఇంతవరకు నానా తిప్పలు పడి ఎంతో కొంత పోగేసుకున్నాం.. మళ్లీ ఎన్నికలప్పుడు ఖర్చు పెట్టాలంటే మరికొంత పోగేయ్యాలి.. కమిషనర్‌ మాత్రం చెప్పిన పనులు చేయటం లేదు.. మంత్రి నారాయణ మాటకే ఆయన విలువనిస్తున్నాడు..ఎవరు చెప్పినా లైట్‌గా తీసుకుంటున్నాడు. ఆయన్ను మార్చకుంటే నగరపాలక సంస్థ మన గుప్పిట్లోకి రాదు.. సంపాదన ఉండదు.. పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా చినబాబు ఉన్నాడు..ఆయన హవా ఉండాలంటే మనం చెప్పిన పనులకు చేవులూపాల్సిన వారైతేనే కరక్టు వెంటనే కమిషనర్‌ను మార్చేయండి.’  ఇదీ విజయవాడ నగరంలో పాలకపక్షంలోని ఓ వర్గం ప్రభుత్వ పెద్దల వద్ద తెస్తున్న ఒత్తిడి. ఇప్పటికే నగర పాలకసంస్థలో జరుగుతున్న పరిణామాలు, మేయర్‌ వ్యవహారంతోపాటు కమిషనర్‌ బదిలీ విషయంపై పార్టీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న వద్ద పలువురు కార్పొరేటర్లతోపాటు పార్టీ కీలక నేతలు అంతర్గత చర్చలు జరిపారు. మేయర్‌ వ్యవహారం సమసిపోయిన తరువాత  కమిషనర్‌ బదిలీపై తీవ్ర ఒత్తిడి పెంచేలా నిర్ణయించారు. ఇప్పటికే  నారా లోకేష్‌ వద్ద కమిషనర్‌ వ్యవహారంపై పంచాయితీ పెట్టడంతో ఆయన కమిషనర్‌ బదిలీపై హామీ ఇచ్చినట్లు సమాచారం.

అసలేం జరుగుతుందంటే..
నగర పాలక సంస్థ కమిషనర్‌గా జె.నివాస్‌ బాధ్యతలు చేపట్టిన నుంచి పాలకపక్ష కార్పొరేటర్ల అక్రమ దందా గురించి లోతుగా అధ్యయ నం చేశాడు. పేదల సొమ్ము పిండుకోవటమే కాకుండా బినామీల ద్వారా నగర పాలక సంస్థ ఆరగించడం, ప్రతి పనికి రేటు బట్టి వసూళ్లు చేయడం, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడం.. అభివృద్ధి పనులను అడ్డుకోవడం లాంటి పనులు చేస్తున్న వైనం గుర్తించారు. వీరిని ప్రోత్సహిస్తే అవినీతి మరకలు అంటే అవకాశం ఉందని భావించిన కమిషనర్‌ పాలకపక్ష సభ్యులను లైట్‌గా తీసుకున్నాడు. వారు సూచించిన పనులను పక్కన పెడుతున్నాడు. డివిజన్‌లలో స్వ యంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. అక్రమ ఆదాయం తగ్గిపోవడంతో పాలకపక్ష కార్పొరేటర్లకు ఆగ్రహం తెప్పిం చింది. కమిషనర్‌ వ్యవహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దే పంచాయితీ పెట్టిన సంఘటనలు ఉన్నాయి. కానీ మంత్రి నారాయణ అండదండలు కమిషనర్‌కు ఉండడంతో పాలకపక్ష సభ్యుల ఫిర్యాదును కూడా లైట్‌గా తీసుకున్నారు.

తెరపైకి రంజిత్‌బాషా
నగర పాలక సంస్థ కమిషనర్‌గా మంత్రి నారా లోకేష్‌ ఓఎస్‌డీగా పనిచేసే పి.రంజిత్‌ బాషాను పేరు తెరపైకి తెచ్చారు. డిప్యూటీ కలెక్టర్‌గా హోదాలో ఉన్న ఆయన రెండు రోజుల కిందటే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. దీంతో ఆయన్ను నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నా యి. చినబాబు ఓఎస్‌డీగా పనిచేసే రంజీత్‌బాషాకు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన్ను పంపించి తమ పనులు చక్కదిద్దుకోవా లనే ఆలోచనలో ఉన్నారు.

మంత్రి నారాయణ హవా
విజయవాడ పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా నారా లోకేష్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నగరపాలక సంస్థపై పెద్దగా దృష్టి సారించలేదు. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే కమిషనర్ల నియామకం జరుగుతుంది. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ప్రస్తుత కార్పొరేటర్ల అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్న కమిషనర్‌కు పంపించి వేయాలన్న డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతుంది. మంత్రి నారాయణ హవా పెరిగితే నగరంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పరపతి తగ్గే అవకాశం ఉందని ఆయన అనుచరవర్గం భావిస్తుంది. నగర పాలక సంస్థలో జరిగే పరిణామాలు పార్టీకి నష్టం కల్గిస్తున్నాయని వెంటనే చక్కదిద్దాలంటూ చినబాబు వద్ద పంచాయితీ పెట్టారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా విజయవాడ నగర పాలక సంస్థ కీలకమవుతుందని వెంటనే రంగంలోకి దింపి కార్పొరేటర్లుకు  లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకోవాలని ఆయన దృష్టిలో పెట్టారు. వారి వాదనకు ఏకీభవించిన చినబాబు త్వరలోనే మీ కోరిక తీరుస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top