అవిశ్వాసానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి సన్నాహాలు
వైఎస్సార్‌సీపీలో గిరిజన మహిళకు ప్రథమ పౌరురాలిగా గుర్తింపు
ఆ పదవి నుంచి దించేసి, గిరిజనులకు వెన్నుపోటు
డిప్యూటీ మేయర్.. ఇక ఇన్‌చార్జి మేయర్..?
నెల్లూరు (బారకాసు): నెల్లూరు మేయర్ పీఠంపై కన్నేసిన మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తమ మార్కు రాజకీయానికి తెర లేపారు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి సన్నాహాలు ప్రారంభించారు. సోమవారం కలెక్టర్‌కు అవిశ్వాసానికి నోటీసును అందించనున్నారు. వాస్తవానికి నెల్లూరు నగర పాలక సంస్థకు 2021లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 54 డివిజన్లలో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే 12, 53 డివిజన్ల నుంచి మాత్రమే ఇద్దరు గిరిజన సామాజిక వర్గాలకు చెందిన మహిళలు ఎన్నికయ్యారు. మేయర్ పదవి గిరిజన మహిళకు రిజర్వ్ కావడంతో అప్పట్లో వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్గంలోని 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన పోట్లూరు స్రవంతిని మేయర్‌గా ఎన్నుకున్నారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 2023లో వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరారు. గతేడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో రాజకీయ వ్యూహాలు ప్రారంభించారు.
టీడీపీ మార్కు రాజకీయం కోసమే..
కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగి నాలుగేళ్లు గడిచాయి. పట్టుమని 10 నెలల కాలం కూడా లేదు. ఈ తరుణంలో మేయర్ పీఠంపై టీడీపీ మార్కు రాజకీయానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తెరతీశారు. వాస్తవానికి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 డివిజన్లు ఉంటే.. అన్ని డివిజన్లను వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన రెండో డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికల సమాయానికి దాదాపు 42 మంది కార్పొరేటర్లు పచ్చ కండువాలు వేసుకొని టీడీపీ కార్పొరేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరంతా సాంకేతికంగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లుగానే కొనసాగుతున్నారు. కొంత కాలంగా తటస్థంగా ఉన్న మేయర్ స్రవంతి దంపతులు ఇటీవల వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉండడం, తాను వైఎస్సార్‌సీపీనే అని బహిరంగంగా చెప్పడంతో జీరి్ణంచుకోలేకపోయిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అసహనంతో రగిలిపోతున్నారు. ఆమెను ఇకపై మేయర్‌గా కొనసాగనివ్వ కూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి మేయర్‌పై అవిశ్వాసానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతోపాటు కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 54 డివిజన్లు ఉండగా వీటిని 71 డివిజన్లుగా విభజించాలని ప్రాథమికంగా విస్తరణ సరిహద్దులు కూడా నిర్ణయించారు. కేవలం రెండు.. మూడు రోజుల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. కార్పొరేషన్ లో డివిజన్లు పెరగడంతో రాజకీయ ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేడు అవిశ్వాస తీర్మానం నోటీస్
నగర పాలక సంస్థ పరిధిలోని సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ కార్పొరేటర్లందరూ సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను అందజేయనున్నారని తెలిసింది. 15 రోజుల్లోపు సమావేశం నిర్వహించి మేయర్‌గా కొనసాగుతున్న స్రవంతిని గద్దె దించాలని కలెక్టర్‌కు నోటీసులు ఇవ్వనున్నారు.
దేవరకొండకు ఇస్తారా..?ప్రత్యేకాధికారుల పాలన పెడతారా..?
54 డివిజన్లలో ప్రస్తుతం 12 మంది కార్పొరేటర్లు మాత్రమే వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. మిగతా 42 మంది టీడీపీలో కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాసం పెడితే నెగ్గే అవకాశం ఉంది. అయితే వీరిలో 53వ డివిజన్ నుంచి గెలిచిన దేవరకొండ సుజాత ఒక్కరే గిరిజన మహిళగా ఉన్నారు. అవిశ్వాసం తర్వాత తిరిగి మేయర్ ఎన్నిక నిర్వహిస్తే అవకాశం ఒక్క సుజాతకే ఉంది. అయితే కార్పొరేషన్ ఎన్నికలకు కేవలం 10 నెలలు కూడా లేకపోవడం, అవిశ్వాసం నెగ్గితే.. ఖాళీ అయ్యే మేయర్ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగాలంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నెలల్లోనే పదవీ కాలం పూర్తయ్యే పదవికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు తక్కువే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గిరిజన సామాజిక వర్గానికి 40 ఏళ్ల తర్వాత దక్కిన ఈ గౌరవాన్ని టీడీపీ స్వార్థ రాజకీయాలతో మసకబార్చేందుకు సిద్ధమైంది. గిరిజన పీఠాన్ని ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా కొనసాగుతున్న వ్యక్తికి ఇన్‌చార్జి మేయర్‌కు కట్టబెట్టాలని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
టీడీపీలో చేరాలంటూ ఒత్తిళ్లు.. ఆరోపణలు, కేసులు
మేయర్ స్రవంతితోపాటు మరికొందరు కార్పొరేటర్లపై ఒత్తిళ్లు, ఆరోపణలు, వేధింపులు, అక్రమ కేసులకు ఎమ్మెల్యేలు తెగబడడంతో దిక్కుతోచని స్థితిలో వీరు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోటంరెడ్డికి జైకొట్టారు. అయితే అప్పటికే వీరి మధ్య రాజకీయ అగాధం పెరగడం, వీరు తమ పదవులకు రాజీనామా చేయకపోవడంపై వైఎస్సార్‌సీపీ నేతలతోపాటు కార్పొరేటర్లు రచ్చ చేయడంతో తమ పదవికి గండం తప్పదని భావించిన మేయర్ దంపతులు తిరిగి వైఎస్సార్‌సీపీలోనే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే వీరు అటు టీడీపీ కార్యక్రమాల్లోనూ, ఇటు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా తటస్థంగా ఉన్నారు.


