తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారుస్తున్నారా?

Tammineni Sitaram Slams Chandrababu over Unemployed Stipend - Sakshi

చంద్రబాబుకు తమ్మినేని సీతారాం ప్రశ్న

సాక్షి, విజయవాడ: యువతను చంద్రబాబు ప్రభుత్వం మోసగిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతిపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇస్తామని చెప్పి, వెయ్యి రూపాయలకు తగ్గించారని తెలిపారు. ఇది న్యాయమా.. రాష్ట్రంలో అనేక మంది విద్యార్ధులు ఉద్యోగ, ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను నిర్వీర్యం చేస్తే నవనిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు. చంద్రబాబుది నవనిర్మాణ దీక్ష కాదు.. శవ నిర్మాణదీక్ష.

‘తాను మారానంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. కానీ ఆయనలో మార్పు లేదు. చంద్రబాబు పాలన అత్యంత పేలవంగా వుంది. తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌లో ఎప్పుడు కలుపుతున్నారు బాబూ..? ఇప్పటికే పరోక్షంగా మీ వైఖరి ప్రజల్లోకి పంపించారు. గతంలో మీరన్న ఇటలీ దెయ్యం.. ఇండియా దేవతగా మీకు కనిపిస్తోందా? కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిపి అభయహస్తం చూపించలేదా? ఏపీఎన్జీఓ నేత అశోక్‌బాబును అనధికారికంగా కర్ణాటకలో మీ ప్రచార దూతగా పంపించారు. అశోక్‌బాబు టీడీపీ కోవర్ట్. ఆయనను ప్రత్యేకంగా టీడీపీలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. టీడీపీ, బీజేపీ కలిసి ఏపీ ప్రజలను ముంచేశాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి.

నా రక్తంలో ముప్పైశాతం కాంగ్రెస్ రక్తం వుందని చంద్రబాబు చెప్పారు. రోజురోజుకు కాంగ్రెస్ రక్తం చంద్రబాబులో పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి టీడీపీని ఎప్పుడు అమ్మకానికి పెట్టబోతున్నారు? తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారుస్తున్నారా? చంద్రబాబు దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు సామాన్యులకు న్యాయం జరగదని ఎన్టీఆర్ టీడీపీనీ స్థాపించారు. చంద్రబాబు కాంగ్రెస్‌కు కోవర్ట్‌గా వున్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ చిదంబరంతో కోవర్ట్ మంతనాలు చేశారు. టీడీపీ నేతలు కళ్లు తెరవాలి. చంద్రబాబును అధ్యక్షస్థానం నుంచి పక్కకు తప్పించండి. ఎన్టీఆర్ ఆశయాల కోసం కట్టబడిన వారు బయటకు రావాలి. చంద్రబాబుకు కట్టబానిసలుగా వుండకండి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్ని ఫ్రంట్‌లు పెట్టారు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, మహాకూటమిలను ఏర్పాటు చేశార’ని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top